జగన్ డెన్, కిరణ్‌పై ఢిల్లీ పెద్దల పావులు: క్యూలో చిరు?
న్యూఢిల్లీ: ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి రోజులు లెక్కబెట్టుకోవాల్సిందేనా? వైయస్ జగన్ ప్రాబల్యం ఉన్న రాయలసీమ ప్రాంతంలో నెగ్గుకు వచ్చేందుకు మరొకరిని ముఖ్యమంత్రి పీఠంపై కూర్చుండబెట్టేందుకు అధిష్టానం పావులు కదుపుతోందా? అంటే కావొచ్చుననే అంటున్నారు. కాంగ్రెసు పార్టీ అధిష్టానం, కేంద్రం రాష్ట్ర విభజన కోసం వేగంగా అడుగులు వేస్తుండగా ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి దానిని ప్రశ్నిస్తున్న విషయం తెలిసిందే.
ముఖ్యమంత్రి హెచ్చరికలు జారీ చేస్తున్నప్పటికీ అధిష్టానం విభజన వైపు వేగంగా అడుగులు వేస్తోంది. అసెంబ్లీకి వస్తే అడ్డుకునేందుకు కిరణ్ పావులు కదుపుతున్నారు. ఈ నేపథ్యంలో అధిష్టానం తెలంగాణ బిల్లును నెగ్గించుకోవడంతో పాటు సీమాంధ్రలోను పార్టీని తిరిగి బలంగా తయారు చేసేందుకు సిద్దమైందంటున్నారు.

ఇందులో భాగంగా కిరణ్‌ను తప్పించే అవకాశాలు లేకపోలేదంటున్నారు. విభజన జరిగితే ఎలాగు తెలంగాణలో పార్టీ పుంజుకుంటుంది. సీమాంధ్రలో పార్టీ పరిస్థితి దారుణంగా ఉంది. రాయలసీమలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ప్రాబల్యం ఎక్కువగా ఉందని అధిష్టానం భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. విభజనను సవాల్ చేస్తున్న కిరణ్, జగన్ సామాజిక వర్గాలు ఒక్కటే. దీంతో కిరణ్ వల్ల ఆ ప్రాంతంలో పార్టీకి అదనంగా ఒనగూరే ప్రయోజనం ఏమీ లేదని భావిస్తోందట.
ఎలాగూ కిరణ్ తమను సవాల్ చేస్తున్నందున ఆయనను తప్పించి కాపు వర్గానికి చెందిన వ్యక్తిని ముఖ్యమంత్రి పీఠంపై కూర్చుండబెడితే పార్టీకి కలిసి వస్తుందని భావిస్తోందని అంటున్నారు. అవసరాన్ని బట్టి విభజనకు ముందు లేదా తర్వాత కాపులను ఆ పీఠంపై కూర్చుండబెట్టే అవకాశాలున్నాయంటున్నారు. కాపులతో పాటు ఎస్సీ వర్గాలను కూడా పరిగణలోకి తీసుకుంటున్నారట.
కిరణ్‌ను తొలగిస్తే మంత్రి కన్నా లక్ష్మినారాయణ, పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ, కేంద్రమంత్రి చిరంజీవి తదితరుల పేర్లను పరిశీలిస్తోందని చెబుతున్నారు. ఎస్సీ వర్గం విషయానికి వస్తే కేంద్రమంత్రి పనబాక లక్ష్మీ పేరును కూడా పరిశీలిస్తున్నారట. అయితే కాపు వర్గానికే ఎక్కువ అవకాశాలు ఉన్నాయంటున్నారు.












Click it and Unblock the Notifications