ఓవైసీ ఆసుపత్రి కూలగొట్టు: కిషన్, కేసీఆర్‌కి భయమని..

తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటి సారిగా అధికారం చేపట్టిన తెరాస ప్రభుత్వ హయంలో పేదలు, అమాయక ప్రజల ఇళ్లకు రక్షణ లేకుండాపోయిందని, పాతబస్తీలోని పలువురు ప్రజాప్రతినిధులు ప్రస్తుతం నివసిస్తున్న భవనాలు కూడా అక్రమంగా నిర్మించినవేనని బీజేపీ గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడు బి వెంకట్ రెడ్డి హైదరాబాదులో విమర్శించారు.
మజ్లిస్ ఆఫీసు దగ్గర్లో యాకుత్‌పురా ఎమ్మెల్యే ఆరు అంతస్తుల భవనాన్ని అక్రమంగా నిర్మించి అద్దెకు ఇచ్చినా, బల్దియా అధికారులు వారిని కనీసం అనుమతి ఉందా? అని ఎందుకు ప్రశ్నించరని, వారంటే భయమా అని వెంకట్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.
యాకుత్‌పురాకు చెందిన ఎమ్మెల్యే నగరంలోని వివిధ ప్రాంతాల్లో 25 ఫంక్షన్ హాళ్లను ఎలాంటి అనుమతి లేకుండా నిర్మించారని ఆయన ఆరోపించారు. బడాబాబులు, ప్రజాప్రతినిధులు నిర్మించిన అక్రమ నిర్మాణాలను వదిలి పేదలు, మధ్య తరగతి ప్రజలు నిర్మించుకున్న ఇళ్లు అక్రమంగా నిర్మించారని కూల్చివేయటం అన్యాయమని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
నిబంధనలకు విరుద్దంగా, ఎలాంటి అనుమతుల్లేకుండా కొందరు బడాబాబులు అడ్డదారిలో బహుళ అంతస్తు భవనాలు, షాపింగ్ మాల్స్ నిర్మించారని, వారి జోలికెళ్లకుండా ప్రభుత్వం పేదలపై ఉక్కుపాదం మోపటం సబబు కాదని ఆయన విమర్శించారు.
కేసీఆర్ బ్లాక్ మెయిల్ రాజకీయాలు మాని, అక్రమ నిర్మాణాలపై ప్రత్యేకంగా కమిటీ వేసి, అన్ని పార్టీల నేతలతో చర్చించి నిర్ణయం తీసుకుంటే బాగుంటుందన్నారు.












Click it and Unblock the Notifications