బిజెపిలో చేరుతారా?: కిరణ్‌తో కిషన్, ఎపి-టీ స్పీకర్ల భేటీ
హైదరాబాద్: మాజీ ముఖ్యమంత్రి, జై సమైక్యాంధ్ర పార్టీ అధ్యక్షులు కిరణ్ కుమార్ రెడ్డిని తెలంగాణ రాష్ట్ర భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు కిషన్ రెడ్డి గురువారం కలిశారు. కిరణ్ బిజెపిలో చేరుతారనే ఊహాగానాలు వినిపించిన విషయం తెలిసిందే. ఇప్పుడు కిషన్ రెడ్డి ఆయనను కలవడం చర్చనీయాంశమైంది. కిరణ్‌తో భేటీ అనంతరం కిషన్ రెడ్డి మాట్లాడుతూ... కిరణ్ కుమార్ రెడ్డిని తాను క్యాజువల్‌గానే కలిశానని చెప్పారు. తమ మధ్య ఎలాంటి రాజకీయపరమైన చర్చ జరగలేదన్నారు.
పార్టీ విషయమై మాట్లాడుతూ.. మెదక్ లోకసభ అభ్యర్థిని అధిష్టానం నిర్ణయిస్తుందని చెప్పారు. తెలంగాణలో పార్టీని బలోపేతం చేస్తామని చెప్పారు. త్వరలో కొత్త కమిటీని ఏర్పాటు చేస్తామన్నారు.
అభినందించుకున్న ఏపీ, టీ స్పీకర్లు

గురువారం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సభాపతులు సమావేశమయ్యారు. తెలంగాణ సభాపతి మధుసూదనాచారి, ఏపీ స్పీకర్ కోడెల శివప్రసాద్‌లు భేటీ అయ్యారు. ఉమ్మడి రాజధాని, ఒకే సముదాయంలో అసెంబ్లీల నేపథ్యంలో వారు భేటీ అయ్యారు. అనంతరం మరోసారి భేటీ కావాలని నిర్ణయించుకున్నారు. ఇరు రాష్ట్రాల స్పీకర్లు ఒకరినొకరు అభినందించుకున్నారు.
అనంతరం సమస్యల పైన చర్చించారు. ఒకే సముదాయంలో రెండు రాష్ట్రాల అసెంబ్లీలు ఉండటం సరికాదని, స్పీకర్ పరిధి, సెక్యూరిటీ సమస్యలు తలెత్తే అవకాశముందని, జూబ్లీహాలులో ఏపీ అసెంబ్లీ ఉంటే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. అయితే ఏపీ కౌన్సిల్ ఎక్కడ ఉంటుందని ఏపీ స్పీకర్ కోడెల ప్రశ్నించారు. కౌన్సిల్, అసెంబ్లీలు వేరువేరు చోట్ల ఎందుకని ప్రశ్నించారు.
జూలై మొదటి వారంలో మరోసారి సమావేశమవుదామని, బడ్జెట్ సమావేశాలకు ముందే సమస్యలను పరిష్కరించుకుందామని ఇరువురు అభిప్రాయానికి వచ్చారు. ఇరు రాష్ట్రాల ప్రభుత్వాలకు ఇబ్బంది లేకుండా చూడాలని అభిప్రాయపడ్డారు. ఒక రాష్ట్రం ఉద్యోగులు మరో రాష్ట్రానికి వెళ్లారని, వాటిని కూడా పరిష్కరించుకుందామని చెప్పారు.












Click it and Unblock the Notifications