టీడీపీకి చేతికి అస్త్రం అందించిన కొడాలి నాని - వంశీ..!!
టీడీపీ చేతికి కొత్త అస్త్రం. వైసీపీ ఫైర్ బ్రాండ్ కొడాలి నాని - టీడీపీ రెబల్ వల్లభనేని వంశీ ఇద్దరూ తాజాగా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు కొత్త డిబేట్ కు కారణమయ్యాయి. కొంత కాలంగా టీడీపీ వర్సస్ జూనియర్ ఎన్టీఆర్ అన్నట్లుగా పరోక్ష యుద్దం సోషల్ మీడియా వేదికగా కొనసాగుతోంది. వైసీపీ నిర్ణయాల పట్ల తాము ఆశించిన స్థాయిలో జూనియర్ ఎన్టీఆర్ స్పందించటం లేదనేది టీడీపీ నేతల వాదన. దీంతో..టీడీపీ శ్రేణులు నేరుగా జూనియర్ ఎన్టీఆర్ ను టార్గెట్ చేస్తూ సోషల్ మీడియాలో పోస్టింగ్స్ పెడుతున్నారు.

తారక్ ను టార్గెట్ చేస్తున్న టీడీపీ
అసెంబ్లీలో ప్రతిపక్ష నేత చంద్రబాబు తన సతీమణి పైన వైసీపీ నేతలు అనుచిత వ్యాఖ్యలు చేసారంటూ సభను బహిష్కరించారు. ఆ తరువాత మీడియా సమావేశంలో కన్నీటి పర్యంతమయ్యారు. ఆ సమయం లో నందమూరి కుటుంబం మొత్తం చంద్రబాబుకు మద్దతుగా నిలిచి వైసీపీ నేతలకు హెచ్చరికలు చేసారు. నాడు జూ ఎన్టీఆర్ ఒక వీడియో సందేశం విడుదల చేసారు. అందులో ఎక్కడా వైసీపీ నేతలను తప్పు బట్టలేదు. ఇది రుచించని కొందరు టీడీపీ నేతలు ఓపెన్ గానే తారక్ పైన విమర్శలు చేసారు. ఇక..ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ పేరు మార్పు వ్యవహారంలోనే జూనియర్ ఎన్టీఆర్ చేసిన ట్వీట్ లో బ్యాలెన్స్ గా వ్యవహరించారు. ఎన్టీఆర్ - వైఎస్సార్ ఇద్దరూ ప్రజాదరణ కలిగిన నేతలంటూ పోస్టు చేసారు. ఇది కూడా టీడీపీ నేతలకు నచ్చలేదు. దీంతో, టీడీపీ శ్రేణులు జూనియర్ ను లక్ష్యంగా చేసుకుంటూ సోషల్ మీడియా లో పోస్టులు చేసారు. దీనికి తారక్ ఫ్యాన్స్ గట్టి కౌంటర్ ఇచ్చారు.

కొడాలి నాని - వంశీ తాజా వ్యాఖ్యలతో
తాజాగా అమరావతి రైతుల పాదయాత్రలో జూనియర్ ఎన్టీఆర్ ను సవాల్ చేసారు. దీనికి ఎన్టీఆర్ ఫ్యాన్స్ సీరియస్ గా తీసుకున్నారు. ఇక.. వీటి పైన కొడాలి నాని..వల్లభనేని వంశీ స్పందించారు. లోకేశ్ కు పోటీగా వస్తారనే కారణంగానే జూ ఎన్టీఆర్ పైన టీడీపీ ఇటువంటి ప్రచారం చేయిస్తుందని కొడాలి నాని పేర్కొన్నారు. అదే విధంగా..జూ ఎన్టీఆర్ కు మద్దతుగా వల్లభనేని వంశీ కీలక వ్యాఖ్యలు చేసారు. జూనియర్ ఎన్టీఆర్ తన స్వయంకృషితో పైకి వచ్చారన్నారు. ఆయన్ను ఎవరూ పైకి తీసుకురాలేదని చెప్పారు. అనేక అంతర్గత రహస్యాలున్నాయంటూ వ్యాఖ్యానించారు. ఇవన్నీ చెబితే చాలా మంది నిద్రపోరంటూ చెప్పుకొచ్చారు. జూనియర్ ఎన్టీఆర్ పెళ్లితో సహా ఆయనకు సంబంధించి ఎవరీ పాత్ర లేదని వంశీ స్పష్టం చేసారు. అమరావతితో జూనియర్ ఎన్టీఆర్‌కు ఏం సంబంధమని ప్రశ్నించారు.

వ్యూహాత్మకమా - అవకాశం ఇచ్చారా
గతంలో జూనియర్ ఎన్టీఆర్ ఈ ఇద్దరు నాని -వంశీకి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. వైసీపీలోకి వచ్చిన తరువాత తమకు జూనియర్ తో సంబంధాలు లేవని కొడాలి నాని కొద్ది రోజుల క్రితమే స్పష్టత ఇచ్చారు. ఇప్పుడు ఈ ఇద్దరూ జూనియర్ కు మద్దతుగా వ్యాఖ్యలు చేయటం ద్వారా.. తారక్ ను విమర్శిస్తున్న టీడీపీ శ్రేణుల చేతికి అస్త్రం అందించినట్లేనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఈ ఇద్దరికీ వ్యక్తిగతంగా నందమూరి కుటుంబం పైన అభిమానం ఉంది. కానీ, ఇప్పుడున్న పరిస్థితుల్లో ఓపెన్ గా జూ ఎన్టీఆర్ కు మద్దతివ్వటం వ్యూహాత్మకమనే చెబుతున్నా... టీడీపీకి అవకాశం ఇచ్చినట్లుగా ఉన్నాయనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. దీంతో..వీరిద్దరి వ్యాఖ్యల పైనా టీడీపీ ఏ రకంగా రియాక్ట్ అవుతుందో చూడాలి.