పురందేశ్వరిది ఏ పార్టీ ? ఆ లెటర్స్ కు బెదిరేది లేదన్న కొడాలి నాని..
ఏపీ సీఎం వైఎస్ జగన్, వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి బెయిల్స్ రద్దు చేయాలని కోరుతూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి ఇవాళ ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి రాసిన లేఖ కలకలం రేపింది. దీనిపై వైసీపీ మండిపడుతోంది. ఈరోజు పురంధేశ్వరి ఒక లేఖ రాశారని టీడీపీ అనుకూల ప్రసార సాధనాల్లో హడావుడి చేస్తున్నారని, చంద్రబాబు గారి వదినను ఇప్పుడు బీజేపీ రాష్ట్ర నాయకులే కొన్ని ప్రశ్నలు అడిగితే బాగుంటుందని వైసీపీ మాజీ మంత్రి కొడాలి నాని సూచించారు.
అప్పట్లో టీడీపీ, కాంగ్రెస్ రాజకీయ కక్ష సాధింపుగా జగన్ మీద, విజయసాయిరెడ్డి మీద పెట్టిన కేసుల్ని ఈరోజు కాకపోతే రేపు ఏ న్యాయస్థానం అయినా రాజకీయ కేసులే తప్ప, ఎలాంటి అధికార దుర్వినియోగంగానీ, అవినీతిగానీ జరగలేదు అని నిర్థారిస్తాయని కొడాలి నాని ధీమా వ్యక్తం చేశారు. కాబట్టి, ఇలా చార్జిషీట్ల నంబర్లు వేసి హడావుడి చేసినంతమాత్రాన, ఇక్కడ బెదిరేవాళ్ళు ఎవరూ లేరన్నారు. అయితే పురంధేశ్వరి, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉందా? లేక తెలుగుదేశం పార్టీలో ఉందా? అన్నది తేల్చాలన్నారు.

ఎందుకంటే ఆవిడ బీజేపీలో ఉన్నట్టు ఎక్కడా కనిపించడంలేదని కొడాలి నాని తెలిపారు. తెలంగాణలో తెలుగుదేశం పార్టీని ఎన్నికల బరిలోకి దింపవద్దని చంద్రబాబు చేసిన నిర్ణయానికి కారణం ఏమిటో స్వయంగా తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ వివరించారని కొడాలి గుర్తుచేసారు. ఈ ఎన్నికల్లో టీడీపీ పూర్తిగా కాంగ్రెస్ కు మద్దతు ఇస్తోందని చంద్రబాబు స్పష్టం చేసినందువల్లే తాను ఇక టీడీపీలో ఉండబోనని కాసాని జ్ఞానేశ్వర్ ప్రకటించారన్నారు. దీని అర్థం ఏమిటని ప్రశ్నించారు.
కాంగ్రెస్ వెనుక, కాంగ్రెస్ తోనూ ఉన్నది చంద్రబాబేనని అంత స్పష్టంగా కనిపిస్తుంటే తెలంగాణలో కాంగ్రెస్ తో పోరాడుతున్నాం, బీఆర్ఎస్ తో పోరాడుతున్నాం అంటున్న బీజేపీకి కాకుండా, పురంధేశ్వరి టీడీపీకి మద్దతు ఇస్తోందని కొడాలి ఆక్షేపించారు. టీడీపీ అంటే కాంగ్రెసే కదా..? మరి, పురంధేశ్వరి కాంగ్రెస్ లో ఉన్నట్టా..? లేక టీడీపీలో ఉన్నట్టా? లేక బీజేపీలో ఉన్నట్టా? అన్నది బీజేపీ వారే అర్థం చేసుకోవాలన్నారు.
ఆమె గతాన్ని చూస్తే.. టీడీపీలో ఉండి ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచిందని, కాంగ్రెస్ లో ఉండి కేంద్ర మంత్రి పదవి అనుభవించి, అధికారం పోయిందని వారినీ వదిలేసి బయటకు వచ్చిందని కొడాలి ఆరోపించారు. ఆ తర్వాత బీజేపీలో చేరినా, బాబు ఆదేశాల మేరకు, బాబు ప్రయోజనాల కోసమే చేరిందన్నారు. అంటే దీని అర్థం పురంధేశ్వరికి రాజకీయ విలువలు ఉన్నాయనా..? అవి ఏమాత్రం లేవనా అని ప్రశ్నించారు.
మరి ఇలాంటి మనిషి కాంగ్రెస్-టీడీపీ కలిసి జాయింట్ గా అప్పట్లో పెట్టిన కేసుల్ని, అదికూడా ఓదార్పు యాత్రకు వెళ్ళవద్దంటే, కొడుకుగా తన ధర్మం నెరవేర్చకుండా ఉండలేనని జగన్ ఓదార్పు యాత్రకు వెళ్ళినందుకు కాంగ్రెస్ పార్టీ టీడీపీతో కలిసి పెట్టిన కేసులు అవి అని కొడాలి నాని తెలిపారు. అలాంటి కేసుల్లో చార్జిషీట్లను ఇప్పుడు బీజేపీలో చేరిన పురంధేశ్వరి ప్రస్తావిస్తున్నారంటే, ఆమెకు ఉన్నది ఎవరి మీద ప్రేమ? ఎవరి మీద కోపం? అని అడిగారు. కాంగ్రెస్ లో ఉన్నా రేణుకా చౌదరి, బీజేపీలో ఉన్నా పురంధేశ్వరి.. చంద్రబాబు ప్రయోజనాలు, చంద్రబాబు బృందం ప్రయోజనాలు కాపాడటంలో ముందుకు దూకుతున్నారంటే.. వీరి రాజకీయం ఎవరి కోసం అని ప్రశ్నించారు.












Click it and Unblock the Notifications