టీపై తేడా వస్తే తీవ్రం: కోదండ, 59ఏళ్ల పోరాటం: ఈటెల
న్యూఢిల్లీ/కరీంనగర్: రాయల తెలంగాణ ప్రతిపాదనను పూర్తిగా వ్యతిరేకిస్తున్నామని తెలంగాణ రాజకీయ జెఏసి ఛైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం తెలిపారు. బుధవారం ఉదయం ఢిల్లీలోని ఏపి భవన్‌లో తెలంగాణ జెఏసి స్టీరింగ్ కమిటీ సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. భవిష్యత్ కార్యాచరణపై సమావేశంలో చర్చించినట్లు తెలిపారు. తెలంగాణ ఏర్పాటులో తేడా వస్తే తీవ్ర పరిణామాలుంటాయని ఆయన హెచ్చరించారు.
పది జిల్లాలతో కూడిన సంపూర్ణ తెలంగాణను కోరుకుంటున్నామని కోదండరాం ఈ సందర్భంగా స్పష్టం చేశారు. పార్లమెంటు శీతాకాల సమావేశాల్లోనే తెలంగాణ బిల్లు పెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. రాయల తెలంగాణను వ్యతిరేకిస్తున్నామని, ఎలాంటి ఆంక్షలు లేని తెలంగాణను కోరుకుంటున్నట్లు కోదండరాం చెప్పారు.

రాయల తెలంగాణ ప్రతిపాదనకు నిరసనగా గురువారం తెలంగాణ రాష్ట్ర సమితి తలపెట్టిన తెలంగాణ బంద్‌కు జెఏసి మద్దతు పలుకుతోందని తెలిపారు. సమావేశంలో ఉద్యోగ సంఘాల నేతలు దేవీప్రసాద్, శ్రీనివాస్ గౌడ్, విఠల్, విద్యుత్ ఉద్యోగుల జెఏసి కన్వీనర్ రఘు పాల్గొన్నారు.
59ఏళ్ల పోరాటాన్ని మరువరాదు: ఈటెల
రాయల తెలంగాణ ఇస్తే కాంగ్రెస్ పార్టీకి పుట్టగతులు ఉండవని తెలంగాణ రాష్ట్ర సమితి సీనియర్ నేత, శాసనసభ్యుడు ఈటెల రాజేందర్ అన్నారు. ఆయన బుధవారం కరీంనగర్‌లో మీడియాతో మాట్లాడుతూ.. 10 జిల్లాలతో కూడిన తెలంగాణ ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం 59ఏళ్ల నుంచి చేస్తున్న తెలంగాణ ప్రజల పోరాటాన్ని మరువరాదని ఆయన ఈ సందర్భంగా తెలిపారు.












Click it and Unblock the Notifications