వైయస్ చిచ్చుతో కాంగ్రెసు కసి తీర్చుకుంటోంది: కోడెల

తెలుగుజాతి అంటే కాంగ్రెసు పార్టీకి కసి, నిరసన ఉందని, తెలంగాణవాళ్ల ఆత్మగౌరవాన్ని దెబ్బ తీసేందుకు ఎప్పటికప్పుడు ప్రయత్నిస్తూనే ఉందని, తెలుగు ప్రజలకు కాంగ్రెసు ద్రోహం చేసిందని ఆయన అన్నారు. తెలుగుజాతి ఆత్మగౌరవ నినాదంతో అధికారంలోకి వచ్చిన ఎన్టీ రామారావును ఏడాదిన్నర కూడా పాలన సాగించకముందే గద్దె దించిందని ఆయన అన్నారు. ఆత్మగౌరవ ప్రతీకగా ఇందిరా గాంధీ ముందు కాలు మీద కాలు వేసుకుని కూర్చునే ధైర్యం ఎన్టీ రామరావు చేశారని, తెలుగువారి సత్తా చూపారని, దేశవ్యాప్తంగా భావసారూప్యం కలిగిన పార్టీలను ఎన్టీ రామారావు కాంగ్రెసుకు వ్యతిరేకంగా ఒకే వేదిక మీదికి తెచ్చారని, దాన్ని కాంగ్రెసు జీర్ణించుకోలేకపోయిందని ఆయన అన్నారు.
ప్రధానిగా పనిచేసిన పివి నర్సింహారావును కూడా కాంగ్రెసు పార్టీ అవమానించిందని, పివికి తర్వాతి ఎన్నికల్లో టికెట్ కూడా ఇవ్వలేదని, ఆయన భౌతిక కాయాన్ని పార్టీ కార్యాలయంలో కూడా పెట్టలేదని కోడెల అన్నారు. బోఫోర్స్ కుంభకోణం నేపథ్యంలో కాంగ్రెసు పార్టీ ప్రభుత్వాన్ని కూల్చిన ఘనత తమ పార్టీదేనని, వీటన్నింటి వల్ల తెలుగువారంటే కాంగ్రెసుకు చులకనభావం, కసి పెరిగిందని ఆయన అన్నారు. తెలుగువారికి కాంగ్రెసు ఎప్పుడూ అన్యాయమే చేసిందని ఆయన అన్నారు.
తెలుగుజాతి కలిసి ఉంటే రాహుల్ గాంధీ ప్రధాని కాలేడని, చీల్చడానికి పూనుకుందని ఆయన విమర్శించారు. రాష్ట్రం ఏమైనా ఫరవా లేదు, తన కుమారుడు ప్రధాని కావాలనే ఉద్దేశంతో సోనియా గాంధీ రాష్ట్రాన్ని చీల్చడానికి పూనుకున్నారని ఆయన విమర్శించారు. దేశంలోని చాలా రాష్ట్రాల్లో విభజన వాదం ఉందని, వాటిని పట్టించుకోకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మాత్రమే చీల్చాలని నిర్ణయం తీసుకున్నారని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications