ఏపీ మంత్రివర్గంలోకి కోడెల: శాఖ ఇదేనంటూ ఊహాగానాలు?
అమరావతి: ఏపీ శాసనసభ స్పీకర్‌గా విధులు నిర్వహిస్తున్నా కోడెల శివప్రసాదరావు త్వరలో చంద్రబాబు తన మంత్రివర్గంలో చేరే అవకాశాలున్నాయి. దసరా పండుగ సందర్భంగా సీఎం చంద్రబాబు మంత్రవర్గంలో పలు మార్పులు చేయాలన్న ఆలోచనలో ఉన్నట్లు సమాచారం.
ఈ నేపథ్యంలో మంత్రివర్గంలోకి కోడెల శివప్రసాదరావు చేరిక ఖాయమని తెలుగుదేశం నేతలు భావిస్తున్నారు. గతంలో చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు దసరా పండుగ రోజున కేబినెట్‌లో మార్పుచేర్పులు చేశారు. అయితే ఈసారి దసరా రోజున అమరావతి శంకుస్థాపన ఉన్న విషయం తెలిసిందే.
ఈ శంకుస్థాపనకు ప్రధాని మోడీ సైతం హాజరవుతుండటంతో కేబినెట్‌లో మార్పులు అదేరోజు చేస్తారా లేక పండగ తరువాత మంత్రివర్గం మారుతుందా? అన్న విషయమై స్పష్టత వెలువడాల్సి వుంది. ప్రస్తుతం ఉన్న మంత్రవర్గంలో కొందరికి ఉద్వాసన తప్పదని ఇప్పటికే పలుమార్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.

ఇటీవల కలెక్టర్ల సదస్సులో పలు శాఖల్లో అవినీతి రెండంకెల స్థాయికి చేరిందని చంద్రబాబు స్వయంగా వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో వైద్య, ఆరోగ్య శాఖపై తీవ్ర విమర్శలు వస్తున్నాయని చెబుతూ ఆ శాఖ నుంచి కామినేని శ్రీనివాస్‌ను తప్పించి గతంలో ఇదే శాఖ నిర్వహించిన కోడెలకు అప్పగించే అవకాశాలున్నాయి.
ప్రస్తుతం ప్రత్తిపాటి పుల్లారావు వ్యవసాయ శాఖతో పాటు పశు సంవర్ధక, మత్స్య, మార్కెటింగ్ తదితర శాఖలు నిర్వహిస్తున్నారు. ఆయనకు కొంత వెసులుబాటును కల్పిస్తూ, మార్కెటింగ్ శాఖను వేరొకరికి అప్పగించనున్నట్టు తెలుస్తోంది. దీంతో పాటు ప్రస్తుతం సీఎం చంద్రబాబు స్వయంగా చూసుకుంటున్న విద్యుత్ శాఖను మరొకరికి అప్పగించనున్నారు.
పాఠశాల, సాంకేతిక, ఉన్న విద్యాశాఖలను కలిపి మానవ వనరుల అభివృద్ధి శాఖను ఏర్పాటు చేసి గంటా శ్రీనివాసరావుకు అప్పగించగా సాంకేతిక విద్యను విభజించే అవకాశముంది. మంత్రి పల్లె రఘునాథరెడ్డి వద్ద ఉన్న ఆరు శాఖల్లో ఇన్‌ఫర్మేషన్ టెక్నాలజీని వేరు చేసి మరొకరికి ఇవ్వవచ్చని సమాచారం.












Click it and Unblock the Notifications