అసెంబ్లీ లాంజ్‌లో వైయస్ చిత్రపటాన్ని తొలగించమని నేను చెప్పలేదు: కోడెల
అమరావతి: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో దివంగత వైయస్ రాజశేఖర్ రెడ్డి చిత్రపటాన్ని తొలగించమని తాను చెప్పలేదని స్పీకర్ కోడెల శివప్రసాదరావు వెల్లడించారు. అసెంబ్లీలో మాజీ ముఖ్యమంత్రుల చిత్ర పటాలు తొలగించాలా? లేదా? అనేది నిబంధనల ప్రకారం జరుగుతుందన్నారు.
వైయస్ చిత్రపటం తొలగింపు విషయంలో కేవీపీ రామచంద్రరావు నుంచి తమకు ఎలాంటి లేఖ అందలేదని పేర్కొన్నారు. తాను సాంప్రదాయం ప్రకారం స్పీకర్ విధులను నిర్వర్తిస్తున్నానని ఓ తెలుగు ఛానల్‌తో కోడెల పేర్కొన్నారు.
ఇది ఇలా ఉంటే అసెంబ్లీ లాంజ్‌లో దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి చిత్రపటం తొలగింపు పైన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత కెవిపి రామచంద్ర రావు అసెంబ్లీ స్పీకర్‌కు బుధవారం నాడు లేఖ రాశారని మీడియాలో వార్తలు వచ్చాయి.
మృతి చెందిన నేతల చిత్రపటాలు తొలగించడం సరికాదని, సంప్రదాయం కాదని ఆయన లేఖలో పేర్కొన్నారు. పార్లమెంటు సభ్యుడిగా, ఎమ్మెల్యేగా, ముఖ్యమంత్రిగా పని చేసిన వైయస్ ఫోటోను తీసి వేయడం సరికాదన్నారు. ఆ చిత్రపటాన్ని ఎక్కడ నుంచి తీశారో అక్కడే పెట్టాలని ఆయన లేఖలో విజ్ఞప్తి చేశారు.

వైయస్ చిత్రపటం తొలగించడానికి అసలు కారణం?
ఆంధ్రప్రదేశ్ శాసన సభ ఆవరణలోని సభ్యుల లాంజ్‌లో ఉన్న దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి చిత్రపటాన్ని తొలగించడం చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. ఏపీ విడిపోయి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత వైయస్ ఫోటో ఉన్న లాంజ్ ప్రాంతాన్ని ఏపీకి కేటాయించారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి అక్కడ పలుమార్లు టిడిపి శాసన సభా పక్ష సమావేశాలు నిర్వహించారు.
ఈ సమావేశం సమయంలో వైయస్ చిత్రపటానికి ముసుగు వేసేవారు. వైయస్ మృతి చెందినప్పుడు దీనిని అక్కడ ఏర్పాటు చేశారు. అసెంబ్లీలో మాజీ సభాపతుల చిత్రపటాలు తప్ప, ముఖ్యమంత్రులవి ఏర్పాటు చేసే సంప్రదాయం లేకపోవడం వల్లనే వైయస్ చిత్రపటాన్ని తొలగించినట్లు శాసన సభ వర్గాలు చెబుతున్నాయి.












Click it and Unblock the Notifications