ముస్తాబైన తిరుచానూర్ ఆలయం
TTD: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో ఈ 11 నుండి 13వ తేదీ వరకు వార్షిక వసంతోత్సవాలు వైభవంగా నిర్వహించనున్నారు. ఈ వేడుకల కోసం మే 10వ తేదీ సాయంత్రం 6 గంటలకు టీటీడీ అర్చకులు శాస్త్రోక్తంగా అంకురార్పణ చేయనున్నారు. భక్తులు ఒక్కొక్కరు 150 రూపాయలను చెల్లించి వసంతోత్సవంలో పాల్గొనవచ్చు.
ఉత్సవాల్లో భాగంగా మే 12వ తేదీ ఉదయం 9.45 గంటలకు స్వర్ణ రథోత్సవం కన్నులపండువగా జరుగనుంది. వసంతోత్సవాలు జరిగే మూడు రోజులు మధ్యాహ్నం 2:30 నుండి సాయంత్రం 4:30 గంటల వరకు శుక్రవారపు తోటలో అమ్మవారి ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం నిర్వహించనున్నారు. సాయంత్రం 7:30 నుండి 8:30 గంటల వరకు ఆలయ నాలుగు మాడ వీధుల్లో అమ్మవారు విహరించి భక్తులను కటాక్షించనున్నారు.

వార్షిక వసంత్సోవాలను పురస్కరించుకుని నేడు తిరుచానూర్ అమ్మవారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు అర్చకులు. ఈ సందర్భంగా సుప్రభాతంతో అమ్మవారిని మేల్కొలిపారు. సహస్రనామార్చన, శుద్ధి చేశారు. అనంతరం తెల్లవారు జామున 6 నుండి ఉదయం 9 గంటల వరకు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించారు.
ఇందులో ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పు, పూజాసామగ్రి తదితర వస్తువులను నీటితో శుద్ధి చేసిన అనంతరం నామకోపు, శ్రీచూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డ కర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచీలిగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్రజలాన్ని ఆలయం అంతటా ప్రోక్షణం చేశారు. అనంతరం భక్తులను సర్వదర్శనానికి అనుమతించారు.
ఈ వసంతోత్సవాల కారణంగా ఈ నెల 11 నుండి 13వ తేదీ వరకు కల్యాణోత్సవం, ఊంజల్ సేవను టీటీడీ రద్దు చేసింది. తిరుమంజనం కార్యక్రమంలో టీటీడీ ఆలయ అర్చకులు బాబు స్వామి, ఏఈవో దేవరాజులు, సూపరింటెండెంట్ జీ.రమేష్, ఆలయ ఇన్‌స్పెక్టర్లు చలపతి, సుబ్బరాయుడు, ప్రసాద్, ఏవీఎస్వో జీ సతీష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
అటు తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. సోమవారం నాడు శ్రీవారి దర్శించుకున్న భక్తుల సంఖ్య 80 వేలను అధిగమించింది. ఆ ఒక్క రోజే 83,380 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. వారిలో 27,936 మంది తలనీలాలు సమర్పించారు. తమ మొక్కులు చెల్లించుకున్నారు.
వైకుంఠం క్యూ కాంప్లెక్స్ కంపార్ట్‌మెంట్లల్లో భక్తులు వేచివుండలేదు. క్యూలైన్ ద్వారా నేరుగా శ్రీవారి దర్శనం చేసుకున్నారు. టోకెన్ లేని సర్వదర్శనం భక్తులకు స్వామివారి దర్శనానికి 2 నుంచి 4 గంటల సమయం పట్టింది. క్యూ లైన్లల్లో ఉన్న వారికి టీటీడీ సిబ్బంది, శ్రీవారి సేవకులు అల్పాహారం, పాలు, మంచినీరు పంపిణీ చేశారు.












Click it and Unblock the Notifications