చంద్రబాబు ప్యాకేజీ అడిగితే సంతోషించా: కోమటిరెడ్డి
న్యూఢిల్లీ: కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ తెలంగాణ ప్రకటించిన సమయంలో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు సీమాంధ్ర అభివృద్ధి కోసం రూ. 5లక్షల కోట్ల ప్యాకేజీ కోరితే సంతోషించానని కాంగ్రెస్ మాజీ మంత్రి, ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. అదే విధంగా పోరాడివుంటే ఈ సమయానికి రూ. 10లక్షల కోట్లు ప్యాకేజీ సాధించేవారని ఆయన చెప్పారు. మంగళవారం పార్లమెంటులో తెలంగాణ బిల్లుపై చర్చ జరగనున్న నేపథ్యంలో ఆయన మీడియాతో మాట్లాడారు.
ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు నాయుడు సీమాంధ్ర ద్రోహులేనని కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆరోపించారు. కిరణ్ నిజంగా సమైఖ్య వాది అయితే తెలంగాణ ప్రకటించిన వెంటనే రాజీనామా చేసి ఉండే వారని, అలా కాకుండా పదవిలో ఉండి సాధ్యమైనంత సంపాదించుకునే ప్రయత్నం చేశారని కోమటి రెడ్డి ఆరోపించారు. సీమాంధ్ర ప్రజలను కిరణ్, చంద్రబాబు, జగన్మోహన్ రెడ్డి మోసం చేస్తున్నారని ధ్వజమెత్తారు.

ముఖ్యమంత్రి పదవిని కట్టబెట్టినందుకు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాకు ఎదురు తిరిగిన కిరణ్ తల్లి పాలు తాగి రొమ్ము గుద్దె రకమని కోమటిరెడ్డి ధ్వజమెత్తారు. తెలంగాణ బిల్లుకు ఎవరు మద్దతు ఇచ్చినా ఇవ్వకపోయినా, మూజువాణివోటుతో బిల్లు ఆమోదం పొందుతుందని కోమటి రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ బిల్లు ఆమోదం పొందిన తర్వాత తాము నిరాడంబరంగా వేడుకలు చేసుకోనున్నట్టు తెలిపారు.
తమ 40 సంవత్సరాల కల నెరవేరే సమయం దగ్గర పడిందని అన్నారు. తెలంగాణ ప్రజల పోరాటాలు, ఆరాటాలు, బలిదానాలు చూసి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ తెలంగాణ ఇస్తున్నారని కోమటిరెడ్డి తెలిపారు. పార్లమెంట్‌లో తెలంగాణ బిల్లుకు మద్దతు ఇస్తున్నందుకు భారతీయ జనతా పార్టీ సహా ఇతర జాతీయ పార్టీలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. సోనియా గాంధీని దేవతలా కొలుస్తూ బంగారు తెలంగాణను నిర్మించుకుంటామని, హైదరాబాద్‌లో ఉన్న సీమాంధ్రులకు రక్షణగా నిలుస్తామని కోమటిరెడ్డి స్పష్టం చేశారు.












Click it and Unblock the Notifications