కొండపల్లి ఎన్నిక పూర్తి-టీడీపీకి 16-వైసీపీకి 15-ఛైర్మన్ ను నిర్ణయించనున్న హైకోర్టు
ఎట్టకేలకు కృష్ణాజిల్లా కొండపల్లి మున్సిపాలిటీలో ఎన్నికలు పూర్తయ్యాయి. రెండు రోజులుగా వరుసగా వాయిదా పడుతుూ వస్తున్న ఎన్నికలను ఇవాళ హైకోర్టు ఆదేశాలతో పూర్తి పోలీసు భద్రత మధ్య నిర్వహించారు. దీంతో వైసీపీ కౌన్సిలర్లు ఈసారి గందరగోళం చేయకుండా తమ స్ధానాలకే పరిమితమయ్యారు. దీంతో ఎన్నికను వీడియో షూటింగ్ తీసి మరీ నిర్వహించారు.
ముందుగా ఎన్నికల్లో గెలిచిన టీడీపీ, వైసీపీ అభ్యర్ధులతో అధికారులు ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం ఛైర్మన్, రెండు వైస్ ఛైర్మన్ పదవులకు ఎన్నికలు నిర్వహించారు. -ఇందులో టీడీపీకి 16, వైసీపీకి 15 ఓట్లువచ్చాయి. టీడీపీ తరఫున ఎన్నికైన 15 మంది సభ్యులతో పాటు ఎక్స్ అఫీషియో కోటాలో విజయవాడ ఎంపీ కేశినేని నాని టీడీపీకి ఓటు వేశారు. అలాగే వైసీపీ తరఫున ఎన్నికైన 14 మందికి తోడు ఎక్స్ అఫీషియో కోటాలో మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ వైసీపీకి ఓటేశారు. దీంతో ఒక్క ఓటు తేడాతో టీడీపీ ఛైర్మన్, వైఎస్ ఛైర్మన్ పదవుల్ని దక్కించుకుంది.

టీడీపీ తరఫున ఛైర్మన్ గా 25వ వార్డు కౌన్సిలర్ చెన్నుబోయిన చిట్టిబాబు ఎన్నిక కాగా.. వైస్ ఛైర్మన్లుగా 29 వ వార్డు కౌన్సిలర్ చుట్టుకుదురు శ్రీనివాస్,10 వ వార్డు టిడిపి కౌన్సిలర్ కరిమికొండ శ్రీలక్ష్మి లు ఎన్నికయ్యారు. అయితే వీరి ఎన్నికను హైకోర్టు ధృవపర్చాల్సి ఉంది. టీడీపీ ఎంపీ కేశినేని నానికి ఎక్స్ అఫీషియో ఓటు కల్పించడాన్ని వైసీపీ వ్యతరేకిస్తోంది.
దీంతో హైకోర్టు దీనిపై తుది నిర్ణయం తీసుకోనుంది. హైకోర్టు నాని ఓటును సమర్ధిస్తే టీడీపీ సభ్యులు ఛైర్మన్, వైస్ ఛైర్మన్లు అవుతారు. సమర్ధించపోతే మాత్రం వైసీపీ సభ్యులకు ఈ మూడు పదవులు దక్కనున్నాయి. సీల్డ్ కవర్లో చైర్మన్, వైస్ చైర్మన్, కోఆప్షన్ సభ్యుల ఎన్నికకు సంబంధించిన సమాచారాన్ని హైకోర్టుకు మున్సిపల్ ఎన్నికల సిబ్బంది అందజేయనున్నారు.












Click it and Unblock the Notifications