కిరణ్‌ను ఏకిపారేసిన కొండ్రు, డొక్కా సెటైర్స్: బొత్స క్లారిఫై

రాజ్యసభ పదవులు త్యాగం చేసిన దళితులకు ఇప్పటికీ ఎమ్మెల్సీ పదవులు ఇవ్వలేదన్నారు. మండలి విప్ పదవులు బలహీనవర్గాలకు ఇవ్వారా అని ప్రశ్నించారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడులా ముఖ్యమంత్రి కిరణ్ వెన్నుపోటు పొడుస్తున్నారన్నారు. సిఎం పదవిని అడ్డు పెట్టుకొని ఓ వర్గం దోచుకుంటుందన్నారు. ఈ రోజుతో కాంగ్రెసు పార్టీతో ఉండేదెవరో ఊడెదెవరో తేలుతుందన్నారు.
కిరణ్ కొత్త పార్టీ, రాజీనామా నేపథ్యంలో బొత్స దిద్దుబాటు చర్యలు చేపట్టారన్నారు. కిరణ్ కొత్త పార్టీ పెడతారనే ప్రచారం జరుగుతోందని, కాంగ్రెసు పార్టీలో పుట్టిన ఒకరిద్దరు పార్టీనే నాశనం చేద్దామనుకుంటున్నారన్నారు. కిరణ్ కొత్త పార్టీ పెట్టినా కాంగ్రెసు నేతలు ఎవరు ఆ పార్టీలోకి వెళ్లరన్నారు. పార్టీలో ఉన్నప్పుడు పదవులు అనుభవించి ఇప్పుడు పార్టీ పెట్టాలని చూడటమేమిటన్నారు. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు వీడితేప్రజలు ఛీ కొడతారన్నారు. సాయంత్రం జరిగే సమావేశంలో తాము అన్ని అంశాలను చర్చిస్తామని చెప్పారు.
డొక్కా సెటైర్లు
డొక్కా మాణిక్య వర ప్రసాద్ మరోసారి సెటైర్లు విసిరారు. కిరణ్ అధిష్టానం నిర్ణయం ప్రకారమే నడుచుకుంటారని తాను భావిస్తున్నానని చెప్పారు. కొత్త పార్టీ, రాజీనామా ప్రచారంపై మాట్లాడుతూ.. పాపం కిరణ్‌కు సంబంధం లేదనుకుంటా, ఇదంతా ఎవరో చేస్తున్నారని ఎద్దేవా చేశారు. సమైక్యాంధ్ర కోసం ఎంపీలు చేస్తున్న కృషి వృథా కాదన్నారు.
తాను బొత్స సమావేశానికి వెళ్తానని చెప్పారు. నిన్నటి సిఎం సమావేశానికి తనకు ఆహ్వానం లేదని చెప్పారు. తనది నియోజకవర్గం లెవల్ అంటూ మరోసారి పరోక్షంగా కిరణ్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. కిరణ్ రాజ్యసభ ఎన్నికల సమయంలోను అధిష్టానం వ్యూహాల ప్రకారమే నడుచుకున్నారన్నారు.
సాయంత్రం భేటీపై బొత్స వివరణ
సాయంత్రం ఐదు గంటలకు మంత్రుల భేటీ పైన పిసిసి చీఫ్ బొత్స సత్యనారాయణ వివరణ ఇచ్చారు. సమైక్యాంధ్ర కోసం పోరాడుతున్న కేంద్రమంత్రులకు నైతిక స్థైర్యం ఇచ్చేందుకే ఈ భేటీ జరగనుందన్నారు. మంత్రులను మాత్రమే పిలిచినట్లు చెప్పారు.












Click it and Unblock the Notifications