కోడెలపై కేసు, బాబుని చూస్తే ఆనందం: వైసిపి ఎమ్మెల్యే, రోజా కంటే సీఎం ఎక్కువ

హైదరాబాద్: శాసన సభాపతి కోడెల శివప్రసాద రావు పైన వైసిపి పెట్టిన అవిశ్వాస తీర్మానం పైన మంగళవారం అసెంబ్లీలో చర్చ ప్రారంభమైంది. మొదట వైసిపి సభ్యుడు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి చర్చను ప్రారంభించారు. ఆయన రూల్స్ మార్చిన విషయాన్ని ప్రస్తావించారు.

శాసన సభా వ్యవహారాల రూల్స్ ఎందుకు మార్చారని వైసిపి సభ్యుడు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ప్రశ్నించారు. వాస్తవాలు ఏమిటో ప్రజలే నిర్ణయిస్తారని చెప్పారు. శాసన సభా వ్యవహారాల మంత్రి యనమల రామకృష్ణుడు కొన్ని రూల్స్ ఎందుకు మార్చారో చెప్పాలన్నారు.

దీనిపై యనమల మాట్లాడుతూ.. మీరు నా పైన అవిశ్వాస తీర్మానం పెట్టలేదని, స్పీకర్ పైన పెట్టారని, దాని గురించి మాట్లాడాలన్నారు. మీ (వైసిపి) కల్చర్ వేరు మా కల్చర్ వేరు అన్నారు. మీది అవినీతి, మాది అభివృద్ధి అన్నారు.

దానికి కోటంరెడ్డి మాట్లాడుతూ.. ఇప్పుడే ప్రారంభించా, అప్పుడే లేచారా అని సెటైర్ వేశారు. అనంతరం కోటంరెడ్డి తన ప్రసంగాన్ని కొనసాగించారు. ప్రత్యక్ష ప్రసారాలను ఎడిట్ చేయకుండా ప్రసారం చేయాలన్నారు.

ఓ సమయంలో మంత్రి అచ్చెన్నాయుడు ఆయన ప్రసంగాన్ని తప్పుబట్టారు. స్పీకర్ పైన పెట్టిన అవిశ్వాస తీర్మానం గురించి మినహా అన్ని విషయాల గురించి వైసిపి మాట్లాడుతోందని, మాట్లాడేందుకు సరుకు లేకపోతే ఊరుకోవాలన్నారు.

ప్రభుత్వంపై అవిశ్వాసం పెడితే అది వీగిపోయిందని, స్పీకర్ పైన అవిశ్వాసం పెట్టారు కానీ, అందులో ఎటువంటి విషయమూ లేదన్నారు. ఈ సందర్భంగా ప్రతిపక్ష సభ్యులకు తానొక సలహా ఇస్తానని చెప్పారు. ఆ సలహా ఏమిటంటే శాసనసభలో ప్రతిపక్ష నాయకుడిపై ఆ పార్టీ సభ్యులు అవిశ్వాసం తీర్మానం పెడితే సమస్యలన్నీ పరిష్కారమవుతాయని, పట్టిన దరిద్రం వదులుతుందన్నారు.

దీనిపై కోటంరెడ్డి మాట్లాడుతూ.. అప్పుడే ఇద్దరు మంత్రులు లేచి, తన ప్రసంగానికి అడ్డు పడ్డారన్నారు. జగన్ మాట్లాడుతుండగా మంత్రులు పదేపదే అడ్డుతగిలారన్నారు. మేం ఏం మాట్లాడాలో ప్రభుత్వమే డిసైడ్ చేస్తుందా అని ప్రశ్నించారు.

పార్లమెంటరీ భాష ఉపయోగించాల్సిన చోట బూతులు మాట్లాడుతున్నారన్నారు. ముఖ్యమంత్రిని చూస్తుంటే ఓ వైపు సంతోషం, మరోవైపు బాధగా ఉంటుందన్నారు. చంద్రబాబు హామీలు ఇచ్చి, టిడిపిని అధికారంలోకి తీసుకు వచ్చారని, అందుకు సంతోషమన్నారు.

Kotamreddy interesting comments on Chandrababu

రోజా కంటే చంద్రబాబు పెద్ద మాటలు

రూల్స్‌కు విరుద్ధంగా ఎమ్మెల్యే రోజాను ఏడాది పాటు సస్పెండ్ చేశారని, ముఖ్యమంత్రి చంద్రబాబు అంతకంటే పెద్ద పెద్ద మాటలు మాట్లాడలేదా అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రికి నేను చేతులు జోడించి విజ్ఞప్తి చేస్తున్నానని, 8 మంది ఎమ్మెల్యేలు తమ పార్టీ నుంచి మీ పార్టీలోకి వచ్చారని చెప్పారు.

ఆ 8 మంది ఎక్కడ?

వారిని ప్రలోభ పెట్టి టిడిపిలో చేర్చుకున్నారని మేం చెబుతున్నామని, కానీ మీరు అభివృద్ధిని చూసి చేరుతున్నారని చెబుతున్నారన్నారు. మీ అభివృద్ధిని చూసి టిడిపిలో చేరిన ఆ ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ఎక్కడున్నారో చెప్పాలన్నారు. వారు అవిశ్వాస తీర్మానంలో పాల్గొంటారా అన్నారు.

సభా నాయకుడు స్పీకర్‌ను సైతం బెదిరించేలా మాట్లాడుతున్నారన్నారు. సభలో స్పీకర్ అధికార పార్టీకి రక్షణ కవచంగా కనిపిస్తున్నారన్నారు. స్పీకర్ అంటే తండ్రిలాంటి వాడన్నారు. స్పీకర్ పెద్దన్నకే (అధికార పార్టీ) ప్రాధాన్యత ఇచ్చారన్నారు. స్పీకర్ల వ్యవస్థ పైన అత్యంత గౌరవం ఉండాలన్నారు.

ఏ సభ్యుడైనా స్పీకర్‌గా ఎన్నికైతే పార్టీకి రాజీనామా చేయాలన్నారు. ఇప్పుడు స్పీకర్‌కు కార్యకర్తకు తేడా లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతిపక్షం గొంతు నొక్కుతూ అధికార పక్షానికి వంతపాడుతున్నందుకే తాము స్పీకర్ పైన అవిశ్వాసం నోటీసు ఇచ్చామన్నారు.

స్పీకర్‌ను గౌరవించాలి

టిడిపి సభ్యుడు బండారు సత్యనారాయణమూర్తి మాట్లాడుతూ... నాదెండ్ల మనోహర్‌ను స్పీకర్‌గా పెడితే దానిని గౌరవించిన వ్యక్తి చంద్రబాబు అన్నారు. స్పీకర్‌ను గౌరవించని వ్యక్తి ప్రతిపక్ష నేత అన్నారు. సభాపతికి గౌరవం ఎలా ఇవ్వాలో ప్రతిపక్ష నేత తెలుసుకోవాలన్నారు.

సభలో అధికార పక్షానికి ఎంత పాత్ర ఉంటుందో, ప్రతిపక్షానికి అంతే పాత్ర ఉంటుందన్నారు. సభాపతిని కామెంట్ చేయడం సరికాదన్నారు. అనుభవం ఉన్న వ్యక్తిని స్పీకర్‌గా ఎన్నుకున్నామని చెప్పారు.

కోడెలపై కేసులు ఉన్నాయి: శివప్రసాద్ రెడ్డి

వైసిపి సభ్యుడు శివప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ.. పక్షపాత ధోరణితో స్పీకర్ వ్యవహరించినప్పుడు తాము అవిశ్వాసం పెట్టామన్నారు. స్పీకర్ సౌమ్యుడై ఉండాలన్నారు. తాను ఓ సమయంలో సభలో లేనప్పుడు కూడా తనను సస్పెండ్ చేశారన్నారు. కోడెల పైన కేసులు ఉన్నాయన్నారు.

మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి మాట్లాడుతూ... శివప్రసాద్ రెడ్డి చేసిన ఆరోపణలు నిరాధారం అన్నారు. కేసుల విషయంలో సిబిఐ విచారణ, ఇతర విచారణలు జరిగాయని, ఆయనను నిర్దోషిగా తేల్చాయన్నారు. వాళ్ల మాదిరిగా సిబిఐ కేసులు, జైళ్లు లేవన్నారు. కోడెల పైన ఉన్న కేసును కొట్టి వేశారన్నారు. ఆయన మంచి డాక్టర్ అన్నారు. కావాలంటే మీరు విచారించుకోవచ్చునని వైసిపి సభ్యులకు సూచించారు. ఆయన క్లీన్ వ్యక్తి అన్నారు.

శివప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ.. జగన్ కేసుల్లో ముద్దాయి అయితే నేరస్తుడిగా, టిడిపి సభ్యులు ముద్దాయి అయితే నిర్దోషులుగా మాట్లాడటం విడ్డూరమన్నారు.

దానిపై పల్లె మాట్లాడుతూ.. తాను స్పష్టంగా చెప్పానని, కోడెల పైన కేసు ఉండేదని, కానీ విచారణలో కడిగిన ముత్యంలా బయటకు వచ్చారని చెప్పానని, అతను ఎందులోను ముద్దాయి కాదని చెప్పారు.

శివప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ... అబద్దపు హామీలతో టిడిపి అధికారంలోకి వచ్చిందని, అలాంటి ప్రభుత్వాన్ని తాము నిలదీసేందుకు అవకాశం ఇవ్వడం లేదన్నారు. నిన్న కూడా ఆయన ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరించారన్నారు.

టిడిపి సభ్యులు ఇష్టారీతిన బూతులు మాట్లాడితే స్పీకర్ చర్యలు ఎందుకు తీసుకోలేదన్నారు. తాను పొద్దుటూరు నియోజకవర్గంలో ఉన్నానని, అలాంటి సందర్భంలో తనను సస్పెండ్ చేయడం ఏమిటన్నారు. తనను నాలుగుసార్లు సస్పెండ్ చేశారన్నారు. ఓసారి సభకు రాకున్నా సస్పెండ్ చేశారన్నారు.

యనమల రామకృష్ణుడు వెటకారంగా మాట్లాడి తమను బాధిస్తున్నారన్నారు. సంగీతంలో ఒకరు డోలు, మరొకరు మరొకటి వాయిస్తారని, ఇక్కడ మాత్రం అన్నింటినీ యనమలనే వాయిస్తారన్నారు. అధికార పార్టీని వెనుకేసుకొస్తున్నారు కాబట్టి, కోడెలపై కేసులు ఉన్నాయి కాబట్టి తాము అవిశ్వాసం పెట్టామన్నారు.

టిడిపి సభ్యుడు గౌతు శ్యాంసుందర్ శివాజీ మాట్లాడుతూ... స్పీకర్ స్థానం ఓ ప్రత్యేకమైనదన్నారు. ఆ సీట్లో కూర్చున్న వారు అధికార, ప్రతిపక్షాల విషయంలో ఎలాంటి తేడా చూపరని, ఇది అందరూ అర్థం చేసుకోవాలన్నారు.

ఈ సందర్భంగా శివాజీ ఓ కథను చెప్పారు. పూర్వాకాలంలో ఓ రాజు ఉండేవాడని, అతని సింహాసనం కనిపించలేదని, కానీ ఓ గ్రామంలో ఓ కుర్రాడు ఆ సింహాసనంపై కూర్చొని తీర్పులు చెబుతున్నాడని కథ చెప్పారు. సీటు మహిమ అలా ఉంటుందని చెప్పారు.

తన తండ్రి గౌతు లచ్చన్న గురించి తెలియని వారు ఉండరని, ఆయన నుంచి కూడా తాను ఈ సీటు గురించి తెలుసుకుంటున్నానని చెప్పారు. జగన్‌ను ఉద్దేశించి మాట్లాడుతూ.. నేను కడప జిల్లాలోనే పెళ్లి చేసుకున్నానని, మీ తాత రాజారెడ్డి గురించి తనకు తెలుసునని చెప్పారు. మీ నాన్న కూడా గౌరవం ఇచ్చిపుచ్చుకునే వారన్నారు.

మొదటిసారి ప్రతిపక్ష నేత పాత్ర వచ్చినప్పుడు దానికి న్యాయం చేయాలన్నారు. కనీసం ఇప్పటి నుంచైనా జగన్ తన పద్ధతి మార్చుకోవాలని హితవు పలికారు. స్పీకర్ స్థానానికి గౌరవం ఇవ్వాలన్నారు. ఇది దురదృష్టకరమే అయినప్పటికీ (స్పీకర్ పైన అవిశ్వాసం) తాను సూచన చేస్తున్నానని చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+