అందుకే జగన్ పార్టీ నుంచి వచ్చేశా, అన్ని స్థానాల్లో తమ పార్టీ పోటీ: కొత్తపల్లి గీత
విశాఖపట్నం: వచ్చే ఎన్నికల్లో తమ పార్టీ అన్ని స్థానాల్లో పోటీ చేస్తుందని జన జాగృతి పార్టీ, అరకు ఎంపీ కొత్తపల్లి గీత సోమవారం వెల్లడించారు. రానున్న శాసనసభ ఎన్నికల్లో రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లోను జన జాగృతి పార్టీ పోటీ చేస్తుందన్నారు.
ఆమె విశాఖపట్నంలో సోమవారం మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో మాట్లాడారు. త్వరలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తామని చెప్పారు. తాను ఎక్కడి నుంచి పోటీ చేసేది ఆ రోజు ప్రకటిస్తానని తెలిపారు. కేంద్ర, రాష్ట్రాల్లోని అన్ని రాజకీయ పార్టీలు ప్రజలను మోసం చేస్తున్నాయని ఆమె ధ్వజమెత్తారు.

తాను ప్రజల కోసమే పార్టీ పెట్టానని గీత చెప్పారు. గత నెల పార్టీ ఏర్పాటు చేయకముందే తన అభిమానాన్ని దెబ్బతీసిన పార్టీ నుంచి బయటకు వచ్చినట్లు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని ఉద్దేశించి అన్నారు. ఎంపీ పదవికి రాజీనామా చేశానని అన్నారు. ఎంపీ లాడ్స్ వ్యయం నుంచి పార్లమెంట్లో ప్రశ్నలు అడగడం వరకు తన విధిని సక్రమంగా నెరవేర్చానని చెప్పారు.
కాగా, ఆమె పది రోజుల క్రితం తన జన జాగృతి పార్టీని ప్రకటించిన విషయం తెలిసిందే. ఆగస్ట్ 24వ తేదీన విజయవాడలో జరిగిన కార్యక్రమంలో తన పార్టీ పేరును, జెండాను ప్రకటించారు. పార్టీ పేరును జన జాగృతి పార్టీగా తెలిపారు. పార్టీ గుర్తు తెలుపు, నీలం రంగుల్లో ఉండి, మధ్యలో గొడుగు గుర్తు ఉంది.












Click it and Unblock the Notifications