డిజిపి, సిఎస్..: ఎపికి బాబు, టికి కెసిఆర్‌ల టీంలు రెడీ
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ముఖ్యమంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్న తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు, తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షులు కల్వకుంట్ల చంద్రశేఖర రావులు తమ తమ జట్లను సిద్ధం చేసుకున్నారు. డిజిపి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వంటి ముఖ్య అధికారుల పేర్లను ఖరారు చేసుకున్నారు.
కెసిఆర్ జూన్ 2వ తేదీన ఉదయం గం.8.15 నిమిషాలకు ప్రమాణ స్వీకారం చేస్తారు. మధ్యాహ్నం 12.57 నిమిషాలకు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించనున్నారు. అమరవీరుల కుటుంబాలకు పరిహారం, రుణాల మాఫీపై తొలి సంతకాలు చేస్తారు. ఇక చంద్రబాబు జూన్ రెండో వారంలో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆయన ఏడో తేదీన ప్రమాణం చేసే అవకాశముంది. రుణమఫీ పైన సంతకం చేసే అవకాశముంది.

చంద్రబాబు, కెసిఆర్‌లు తమ తమ రాష్ట్రాల్లో డిజిపి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిలకు సంబంధించి గవర్నర్ నరసింహన్‌కు లేఖ పంపారు.
తెలంగాణ తొలి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా రాజీవ్ శర్మ, తొలి డిజిపిగా అనురాగ్ శర్మ, సిఎం పేషీ ముఖ్య కార్యదర్శిగా నర్సింహ రావు, ఇంటెలిజన్స్ చీఫ్‌గా శివధర్ రెడ్డి, హైదరాబాద్ పోలీసు కమిషనర్‌గా మహేందర్ రెడ్డిల పేర్లు పేర్కొంటూ కెసిఆర్ గవర్నర్‌కు లేఖ పంపించారు.
చంద్రబాబు తాను ఎంపిక చేసుకొన్న బృందంలో ముగ్గురు ముఖ్యమైన అధికారులను తీసుకొని శనివారం ఇక్కడ గవర్నర్‌ను కలిసి, పాలనా వ్యవహారాలపై చర్చించారు. కొత్త రాష్ట్రానికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఇప్పగుంట యశధర రామ (ఐవైఆర్) కృష్ణారావును, డిజిపిగా జెవివి రాముడు, తన కార్యాలయంలో ప్రిన్సిపల్ కార్యదర్శిగా అజయ్ ప్రకాశ్ సాహ్నిని ఆయన ఎంపిక చేసుకున్నారు. శనివారం ఉదయం బాబు ఆ ముగ్గురినీ తీసుకొని గవర్నర్ వద్దకు వెళ్లారు. చంద్రబాబు తన పేషీకి అజయ్ ప్రకాశ్ సాహ్నితోపాటు గిరిధర్, సాయి ప్రసాద్‌లను ఎంపిక చేసుకొన్నారు.












Click it and Unblock the Notifications