వానదేవుడి దయ: ఎపి, తెలంగాణ గొడవకు బ్రేక్
చెన్నై: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మధ్య చోటు చేసుకున్న వివాదాన్ని వానదేవుడు చల్లార్చినట్లే ఉన్నాడు. శ్రీశైలం జలాశయంలో విద్యుదుత్పత్తిపై ఇరు రాష్ట్రాల మధ్య తీవ్ర రగడ చోటు చేసుకున్న విషయం తెలిసిందే. కర్నూలు, గుంటూరు, నల్లగొండ జిల్లాల్లో ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి. కృష్ణానదిలోకి వరద ప్రవాహం పెరిగింది. దీంతో విద్యుత్తు డిమాండ్ గణనీయంగా తగ్గింది.
ప్రకాశం బ్యారేజీ నుంచి సముద్రంలోకి పెద్ద యెత్తున నీరు ప్రవహిస్తోంది. అంతేకాకుండా పులిచింతల జలాశయం పరిసరాల్లోని గ్రామాలకు ముంపు ప్రమాదం ఏర్పడింది. దీంతో నాగార్జునసాగర్ పవర్ హౌస్ నుంచి నీరు విడుదల చేయవద్దని కృష్ణా డెల్టా సిస్టమ్స్ చీఫ్ ఇంజనీర్ తెలంగాణ ప్రభుత్వాన్ని కోరారు.

ఆ విజ్ఞప్తికి తెలంగాణ ప్రభుత్వం సానుకూలంగా ప్రతిస్పందించి నాగార్జునసాగర్ డ్యామ్ వద్ద విద్యుదుత్పత్తిని నిలిపేసింది. నల్లగొండ, గుంటూరు జిల్లాల్లో భారీ వర్షాలు కురవడంతో పులిచింతల ఆనకట్టపై గల గ్రామాలకు ముంపు ప్రమాదం ఏర్పడింది. దాంతో పులిచింతల నుంచి 77 వేల క్యూసెక్కుల నీటిని కృష్ణా నదిలోకి అధికారులు వదిలేశారు.
పులిచింతల నుంచి 77 వేల క్యూసెక్కుల నీరు విడుదల కావడంతో విజయవాడ వద్ద ప్రకాశం బ్యారేజీ క్రెస్ట్ గేట్లను తెరిచి నీటిని సముద్రంలోకి వదులుతున్నారు. వర్షంపై ఆధారపడి మరో రెండు మూడు రోజులు ఇదే పరిస్థితి కొనసాగవచ్చునని అధికారులు అంటున్నారు. శ్రీశైలం జలవిద్యుత్తు కేంద్రంలో కూడా తెలంగాణ ప్రభుత్వం దాదాపుగా ఉత్పత్తిని నిలిపేసింది. గ్రిడ్ నడవడానికి అవసరమైనంత మేరకు మాత్రమే విద్యుదుత్పత్తి జరుగుతోంది.
శనివారం నుంచి తెలంగాణలో మెదక్, కరీంనగర్, నల్లగొండ, రంగారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాల్లో వర్షాలు పడుతున్నాయి. దీంతో విద్యుత్తు డిమాండ్ కూడా గణనీయంగా తగ్గింది.












Click it and Unblock the Notifications