చంద్రబాబూ! ఇదేం పని.. అసహ్యించుకుంటున్నారు: కృష్ణంరాజు ఆగ్రహం
అమరావతి: ఏపీలో బీజేపీ నేతలపై దాడులు లేదా దాడి యత్నాలపై బీజేపీ నేత, కేంద్ర మాజీ మంత్రి కృష్ణంరాజు శుక్రవారం మండిపడ్డారు. ఏపీలో టీడీపీ భౌతిక దాడులకు దిగుతోందని ఆరోపించారు. ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగిస్తోందన్నారు. ఇలా చేస్తే ఆ పార్టీకి సమయం వచ్చినప్పుడు ప్రజలు గట్టిగా బుద్ధి చెబుతారన్నారు.
తమ పార్టీ ఏపీ అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ ప్రతి వారం ఏపీ సీఎం చంద్రబాబుకు ఐదు ప్రశ్నలు సంధిస్తున్నారని, వాటికి పొంతన లేకుండా సమాధానం చెబుతున్నారని ఎద్దేవా చేసారు. టీడీపీ నేతలు ప్రజలను గందరగోళంలోకి నెడుతున్నారన్నారు. కన్నాపై చెప్పులు వేసి రౌడీయిజం ప్రదర్శిస్తున్నారని మండిపడ్డారు.

టీడీపీ వారు ప్రజలు అసహ్యించుకునేలా ప్రవర్తిస్తున్నారని చెప్పారు. ప్రజలు మెచ్చుకునేలా పనులు చేస్తే బాగుంటుందన్నారు. వరి సహా ఇతర పంటలకు కేంద్రం మద్దతు ధర భారీగా పెంచడంపై కృష్ణంరాజు స్పందించారు. ఇది హర్షణీయం అన్నారు. వరి పంటకు రూ.200 మద్దతుతో రైతుకు ఎకరాకు రూ.6వేల నుంచి రూ.8వేల లాభం అందుతుందన్నారు.
పంట కొనుగోలు భారం రాష్ట్రాలపై పడకుండా కేంద్రం జాగ్రత్తలు తీసుకుందని చెప్పారు. 2022 నాటికి రైతుల ఆదాయం రెట్టింపు చేయడమే బీజేపీ లక్ష్యమన్నారు. పంటలకు మద్దతు ధర ప్రకటించిన మోడీకి థ్యాంక్స్ చెప్పారు. 33 ఏళ్లలో ఇంత పెద్ద మొత్తంలో మద్దతు ధర పెరగలేదన్నారు. బీజేపీ రైతు పక్షపాతి అన్నారు.












Click it and Unblock the Notifications