కృపామణి ఆత్మహత్య కేసులో పురోగతి: విశాఖలో తలదాచుకున్న నిందితుడు
అమరావతి: పశ్చిమ గోదావరి జిల్లాలో సంచలనం సృష్టించిన కృపామణి ఆత్మహత్య కేసులో కీలక నిందితుడు గూడాల సాయి శ్రీనివాస్ విశాఖపట్నంలో తలదాచుకున్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు.
ఆదివారం ఉదయం విశాఖ నగర పరిధిలోని డాబా గార్డెన్స్‌లో సాయి శ్రీనివాస్ కారును (ఏపీ 9 బీటీ 7991) స్వాధీనం చేసుకున్న పోలీసులు సాధ్యమైనంత త్వరలో అతనిని అరెస్ట్ చేస్తామని వెల్లడించారు. సాయి శ్రీనివాస్‌ను పట్టుకోవాలని భావిస్తున్న ఏపీ పోలీసులు ఆరు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే.
కృపామణి ఆత్మహత్య కేసులో పోలీసులకు కీలకమైన ఆధారాలు లభ్యమయ్యాయి. శుక్రవారం సాయి శ్రీనివాస్ ఇంట్లో పోలీసులు సోదాలు నిర్వహించిన విషయం తెలిసిందే. ముఖ్యంగా శ్రీనివాస్ ఇంటిలో లభించిన ఓ పెన్ డ్రైవ్ లోని సమాచారాన్ని చూసి పోలీసులే నివ్వెరపోయారు.
చిన్నపాటి పెన్ డ్రైవ్‌లో వందలాది నగ్న వీడియోలతో పాటు న్యూడ్ ఫొటోలు గుట్టలు గుట్టలుగా ఉన్నట్టు కనుగొన్నారు. కేవలం కృపామణినే కాకుండా, అనేక మంది మహిళలను శ్రీనివాస్ వేధించినట్లు పోలీసులకు పక్కా ఆధారాలు లభించినట్లైంది. ఏడు నెలలుగా లైంగిక దోపిడీకి పాల్పడుతూ అతను కృపామణి నగ్న వీడియోలు తీసినట్లు తెలుస్తోంది.

వీటితో పాటు కృపామణి రాసిన సూసైడ్ నోట్‌ను, సెల్ఫీ వీడియోను పోలీసులు ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపించారు. కృపామణి ఆత్మహత్య కేసులో గుడాల సాయి శ్రీనివాస్‌ను మొదటి ముద్దాయిగా పోలీసులు చేర్చారు. ఎ2గా కృపామణి తల్లి లక్ష్మిని, ఎ3గా తండ్రి రామలింగేశ్వర రావును, ఎ4గా రాజ్ కుమార్‌ను చేర్చారు.
నలుగురు నిందితులపై సెక్షన్ 344, 306, 370 క్లాజ్ 1,2,3, 376 క్లాజ్1 కింద నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేశారు. కృపామణి కేసు విచారణాధికారిగా జంగారెడ్డి గూడెం డిఎస్పీ వెంకట్రావును నియమించారు. సాయి శ్రీనివాస్ మీద పీడి యాక్ట్ కింద కేసు నమోదు చేశారు.
పవన్ కుమార్‌ను పెళ్లి చేసుకున్న కృపామణిని వ్యభిచారం చేయాలని తల్లిదండ్రులు, సోదరుడు తీవ్రమైన ఒత్తిడి చేయడమే కాకుండా ఆమెను రూ. 7 లక్షలకు సాయి శ్రీనివాస్‌కు విక్రయించిన విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications