కృపామణి ఆత్మహత్య: చంద్రబాబు సీరియస్, తణుకులోనే ఎస్పీ మకాం
ఏలూరు: కృపామణి ఆత్మహత్య కేసు విషయమై మంత్రి పీతల సుజాత బుధవారం నాడు స్పందించారు. కృపామణి ఆత్మహత్య కేసులో దోషులను ఉపేక్షించేది లేదని ఆమె చెప్పారు. పశ్చిమ గోదావరి జిల్లా వేల్పూర్‌లోని కృపామణి భర్త, బంధువులను ఆమె పరామర్శించారు.
ఈ సందర్భంగా మాట్లాడారు. ఈ కేసును ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని సమీక్షిస్తున్నట్లు చెప్పారు.
ఇదిలా ఉండగా, కృపామణి ఆత్మహత్య కేసులో నేటికీ నిందితుల జాడ లేదు. తల్లిదండ్రులు, సోదరుడు, రౌడీ షీటర్ వేధింపుల కారణంగా పశ్చిమ గోదావరి జిల్లా తణుకు మండలం వేల్పూరులో కృపామణి అనే గృహిణి ఆత్మహత్య చేసుకుంది.
ఆత్మహత్యకు ముందు తాను అనుభవించిన నరకయాతనను సూసైడ్ నోట్‌లో రాసింది. అంతేకాదు, సెల్ఫీ వీడియోలో రికార్డు చేసి మరీ ఆమె తనువు చాలించింది. దీనిపై దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు నిందితుల కోసం ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు.

తణుకులోనే ఎస్పీ మకాం
ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ కేసుపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. ఈ నేపథ్యంలో పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీ భాస్కర భూషణ్ మూడు రోజులుగా తణుకులోనే మకాం పెట్టారు. అయినా నిందితుల జాడ తెలియలేదు. కృపామణి తల్లి లక్ష్మి, ప్రధాన నిందితుడు సాయితో గల సంబంధాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. సాయి శ్రీనివాస్ నివాసంలో దొరికిన మెమొరీ కార్డులను విశ్లేషిస్తున్నారు.
కృపామణిని వేధింపులకు గురి చేసిన రౌడీ షీటర్ సాయి శ్రీనివాస్‌కు స్థానిక పోలీసులతో మంచి సంబంధాలు ఉన్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే అతడు పోలీసులకు చిక్కకుండా చాకచక్యంగా తప్పించుకొని ఉండవచ్చుననే వాదనలు వినిపిస్తున్నాయి.
కుటుంబ సభ్యుల పాత్రపై ఆరా
కృపామణి భర్త పవన్ కుమార్‌ను పోలీస్ స్టేషన్ రప్పించి అతని నుంచి అన్ని కోణాల్లో జిల్లా ఎస్పీ సమాచారం రాబట్టినట్లుగా సమాచారం. ఆత్మహత్యకు కొద్ది రోజుల ముందు కృపామణి తల్లి లక్ష్మి... అల్లుడిని చంపుతానని బెదిరించినట్లుగా సెల్ ఫోన్ రికార్డు చేసిన వాయిస్‌ను పోలీసులకు అందించారు. అత్తిడి సభ్యుల వ్యవహార శైలి పైన కూడా దర్యాఫ్తు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications