నా సీటు తలసాని తీసుకున్నారు!: సనత్‌నగర్ రేసులో కూన, ముఖేష్ గౌడ్ చేరికపై...
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న తలసాని శ్రీనివాస్ యాదవ్ అప్పుడు తన సనత్ నగర్ సీటును దొంగిలించారని తెలుగుదేశం పార్టీ నేత కూన వెంకటేష్ గౌడ్ ఆరోపించారు. గతంలో తనకు దక్కాల్సిన సీటును తలసాని ఎగురేసుకు పోయారన్నారు.
నాలుగేళ్ల నుండి ఆ సీటు కోసం తాను కష్టపడ్డానని, దానిని గత సార్వత్రిక ఎన్నికల్లో తలసాని దక్కించుకున్నారన్నారు. ఈసారి మాత్రం ఆ సీటు తనదే అన్నారు. మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత ముఖేష్ గౌడ్ తమ పార్టీలోకి వచ్చినా ఆ సీటు తనదే అన్నారు.

గతంలో తమ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సనత్ నగర్ సీటును తనకే ఇస్తానని చెప్పారని, అయితే, పూర్తిగా హామీ ఇవ్వలేకపోయారని, ఆ సమయంలో దానిని తలసాని దక్కించుకున్నారని, ఈసారి మాత్రం చంద్రబాబు తనకు హామీ ఇచ్చారన్నారు.
తనకు దేవేందర్ గౌడ్ కూడా మద్దతిస్తాన్నారు. ముఖేష్ గౌడ్‌కు టీడీపీ టిక్కెట్ ఇస్తారనే ప్రచారంపై మాట్లాడుతూ.. ఇప్పుడు నడుస్తున్నదంతా తప్పుడు ప్రచారమన్నారు. ముఖేష్ గౌడ్ తనకు బంధువేనని, ఆయన తన పైన పోటీకి రారని చెప్పారు.
కాగా, ముఖేష్ గౌడ్ టీడీపీలో చేరుతారని, ఆయనకు చంద్రబాబు నాయుడు సనత్ నగర్ నియోజకవర్గం టిక్కెట్ ఇచ్చేందుకు సుముఖత వ్యక్తం చేసినట్లుగా వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ముఖేష్ గౌడ్‌ను టీడీపీలోకి తీసుకు వచ్చేందుకు దేవేందర్ గౌడ్ పావులు కదిపినట్లుగా ప్రచారం జరిగింది. అయితే, ఇప్పుడు కూన రేసులోకి రావడం గమనార్హం.












Click it and Unblock the Notifications