రాజకీయాల్లోకి లగడపాటి రీ ఎంట్రీ: బీజేపీలో చేరుతున్నట్లు బెజవాడలో ఫ్లెక్సీలు
విజయవాడ: లగడపాటి రాజగోపాల్.... తెలుగు రాష్ట్రాల్లో ఈ పేరు వినని వారుండరు. విజయవాడ ఎంపీగా, కాంగ్రెస్ పార్టీ నేతగా ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో ఆయన చేసిన హడావుడి అంతా ఇంతా కాదు. రాష్ట్ర పునర్విభజన బిల్లు సందర్భంగా పార్లమెంట్ హాలులోనికి పెప్పర్ స్ర్పేను తీసుకెళ్లి దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించారు.
అంతక ముందు సమైక్యాంధ్రకు మద్దతుగా విజయవాడలో నిరాహారదీక్షకు దిగారు. దీంతో లగడపాటిని పోలీసులు అక్కడి ప్రభుత్వాసుపత్రిలో చేర్చగా, పోలీసుల కన్నుగప్పి అక్కడి నుంచి మాయమై వివిధ మార్గాల్లో పయనించి ట్రాక్ సూట్‌లోనే హైదరాబాద్‌కు వచ్చి నిమ్స్‌లో చేరిన సంగతి తెలిసిందే.

లాంకో ఇండస్ట్రీస్ అధినేతగా దేశ వ్యాప్తంగా పారిశ్రామికరంగంలో విజయవంతమయ్యారు. ఏపీ రాజకీయాల్లోనూ తనదైన ముద్ర వేశారు. అయితే రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ ఆయన కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయడంతో పాటు రాజకీయాల నుంచే వైదొలగారు. 2014లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కూడా ఆయన పాల్గొనలేదు.
అయితే ఈ మధ్య కాలంలో ఆయన మళ్లీ రాజకీయాల్లోకి వస్తున్నారంటూ రాష్ట్ర వ్యాప్తంగా ఊహాగానాలు ఊపందుకున్నాయి. మళ్లీ ఆయన రాజకీయాల్లోకి వస్తున్నారంటూ బెజవాడలో ప్లెక్సీలు వెలిశాయి. ఈ మేరకు సోమవారం ఆయన పుట్టినరోజును పురస్కరించుకుని లగడపాటి రాజకీయాల్లోకి రావాలని ఆకాంక్షిస్తూ ప్లెక్సీలు వెలిశాయి.
లగడపాటి సన్నిహితుల పేరిట వెలసిన సదరు ప్లెక్సీల్లో బీజేపీ నేతల ఫోటోలతో పాటు, మరికొన్ని చోట్ల సినీ నటుడు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఫోటోలతో కూడిన ప్లెక్సీలు కనిపిస్తున్నాయి. ఈ క్రమంలో లగడపాటి రాజగోపాల్ బీజేపీలో చేరుతున్నట్లు ప్రచారం జోరందుకుంది.












Click it and Unblock the Notifications