నెలల వ్యవధిలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో సీన్ రివర్స్!
హైదరాబాద్: విభజన, కొత్త రాజధాని నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌లో పలు ప్రాంతాల్లో భూముల ధరలు ఆకాశాన్ని అంటుతుండగా.. అదే సమయంలో నిన్నటి వరకు ఎక్కువగా ఉన్న తెలంగాణ ప్రాంతంలోని పలు ప్రాంతాల భూముల ధరలు ఇప్పుడు పడిపోయాయట. విభజనకు ముందు రాజధాని హైదరాబాద్ పరిసర ప్రాంతాలతో పాటు వరంగల్ లాంటి జిల్లాల్లో భూముల ధరలు ఎక్కువగా ఉండేవి.
ఆంధ్రప్రదేశ్‌లో (నాటి సీమాంధ్ర) విశాఖపట్నం, విజయవాడ, రాజమండ్రి వంటి కొన్ని ప్రాంతాల్లో మినహా మిగిలిన జిల్లాల్లో రియల్ బూమ్ అంతగా ఉండేది కాదు. అయితే విభజన అనంతరం ఒక్కసారిగా పరిస్థతి మారిపోయింది.

ఆంధ్రప్రదేశ్‌కు కొత్త రాజధానిని ఎక్కడ నిర్మించాలనే విషయంపై సర్వేలు జరుగుతున్న నేపథ్యంలో గుంటూరు, కృష్ణాలతో పాటు పలు జిల్లాల్లో ఒక్కసారిగా భూముల ధరలు భారీగా పెరిగిపోయాయి. ఈ కారణంగానే ఇటీవలే ఏపీ ప్రభుత్వం భూముల రిజిస్ట్రేషన్లకు బ్రేక్ వేసినట్లుగా వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. రెండు నెలల వ్యవధిలోనే అక్కడి భూముల విలువ ఎన్నో రెట్లు పెరిగిపోయాయట.
తెలంగాణలోని జిల్లాల్లో మాత్రం రియల్ బూమ్ తగ్గిందంటున్నారు. రెండు నెలలుగా వరంగల్, ఖమ్మం, నిజామాబాద్, ఆదిలాబాద్ తదితర జిల్లాల్లో భూముల క్రయవిక్రయాలు దాదాపుగా స్తంభించాయట. ఈ క్రమంలో ఆయా జిల్లాల్లో రిజిష్ర్టేషన్ ఆదాయం కూడా భారీగా తగ్గిపోయిందట.












Click it and Unblock the Notifications