భూములు రీసర్వే చేస్తేనే భారీగా నిధులు: బడ్జెట్‌లో కేంద్రం మెలిక: అయోమయంలో చంద్రబాబు
Chandrababu Naidu: కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్.. వార్షిక బడ్జెట్ ప్రతిపాదనలను లోక్‌సభలో ప్రవేశపెట్టారు. 2024- 2025 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ప్రతిపాదనలు ఇవి. ఇదివరకు సార్వత్రిక ఎన్నికల ముందు ఓటాన్ అకౌంట్‌ను సభ ముందు ఉంచారు. ఇప్పుడు ఇది పూర్తిస్థాయి బడ్జెట్ ప్రతిపాదనలు.
కేంద్రంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సారథ్యంలో ఎన్డీఏ సంకీర్ణ కూటమి ప్రభుత్వం వరుసగా మూడోసారి అధికారంలోకి వచ్చాక నిర్మల సీతారామన్ ప్రవేశపెట్టిన తొలి బడ్జెట్ ఇదే కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. మొత్తంగా ఆమెకు ఇది ఏడవది. ఇప్పటి వరకు ఆరుసార్లు బడ్జెట్‌ను సభకు సమర్పించారు.

ఏపీ రాజధాని అమరావతిని అభివృద్ధి పర్చడానికి 15,000 కోట్ల రూపాయలను సమకూర్చుకోవడానికి సహకరిస్తామని ప్రకటించారు నిర్మల సీతారామన్. ఏపీలో వెనుకబడిన మూడు జిల్లాల అభిృద్ధికి ప్రత్యేకంగా గ్రాంట్‌ను మంజూరు చేస్తామనీ అన్నారు. పోలవరం ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేయడానికి కృషి చేస్తామని అన్నారు. బిహార్‌కు 26,000 కోట్ల రూపాయలను కేటాయించారు.
భూములను రీసర్వే చేసిన రాష్ట్రాలకు భారీగా ప్రోత్సాహకాలను ప్రకటించారు ఈ బడ్జెట్ ప్రతిపాదనల్లో. ఏకంగా 50 సంవత్సరాల పాటు వడ్డీ లేని రుణాలను ఇస్తామని నిర్మల సీతారామన్ స్వయంగా ప్రకటించారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాలలో భూ సంబంధిత సంస్కరణలను చేపట్టిన రాష్ట్రాలకు అదనపు నిధులను ఇస్తామని, ఆర్థికంగా ఆదుకుంటామని అన్నారు.
వచ్చే మూడు సంవత్సరాల్లో భూముల సమగ్ర రీసర్వే పూర్తి చేయడానికి ప్రోత్సాహకాలను సైతం ఇస్తామని నిర్మలా సీతారామన్ వివరించారు. భూ సంస్కరణలు, భూ ఆధార్, ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ అండ్ ప్లానింగ్, ల్యాండ్ మేనేజ్‌మెంట్‌లలను చేపట్టే రాష్ట్రాలకు మాత్రమే ఈ ప్రోత్సాహకాలు గానీ, 50 సంవత్సరాల పాటు వడ్డీ లేని రుణాలు గానీ అందుతాయని అన్నారు.
అన్ని భూములకు యూనిక్ ల్యాండ్ పార్శిల్ ఐడెంటిఫికేషన్ నంబర్ (ULPIN) లేదా భూ-ఆధార్ అసైన్‌మెంట్, కాడాస్ట్రల్ మ్యాప్‌ల డిజిటలైజేషన్, ప్రస్తుత యాజమాన్యం ప్రకారం మ్యాప్ సబ్-డివిజన్‌ల సర్వే, ల్యాండ్ రిజిస్ట్రీ అండ్ లింక్.. వంటివి గ్రామీణ భూ సంబంధిత చర్యలలో ఉంటాయని సీతారామన్ వివరించారు.
ఈ చర్యలు క్రెడిట్ ఫ్లో, ఇతర వ్యవసాయ సేవలను కూడా సులభతరం చేస్తాయని అన్నారు. పట్టణ భూ సంబంధిత చర్యలకు సంబంధించి, పట్టణ ప్రాంతాల్లోని భూ రికార్డులను జీఐఎస్ మ్యాపింగ్‌తో డిజిటలైజ్ చేస్తామని నిర్మలా సీతారామన్ తెలిపారు. ఆస్తి రికార్డు నిర్వహణ, నవీకరణ, పన్ను నిర్వహణ కోసం ఐటీ ఆధారిత వ్యవస్థ ఏర్పాటు చేస్తామని అన్నారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సారథ్యంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం- జనసేన- భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి ప్రభుత్వం మాత్రం దీనికి భిన్నంగా వ్యవహరిస్తోంది. గతంలో వైఎస్ జగన్ ప్రభుత్వం చేపట్టిన సమగ్ర భూసర్వేను తీవ్రంగా వ్యతిరేకించింది చంద్రబాబు సర్కార్.
ఇప్పుడు నిర్మలా సీతారామన్ చేసిన ప్రకటనతో అయోమయంలో పడింది. జగన్‌పై ధ్వేషంతో వ్యవహరించడం వల్ల భూ సంస్కరణలను చేపడితే కేంద్రం నుంచి అదనంగా రావాల్సిన నిధులు, ప్రోత్సాహకాలను కోల్పోవాల్సిన దుస్థితి ఎదురైందని అంటోన్నారు.












Click it and Unblock the Notifications