వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

శుంఠలు పుట్టారు, లాస్ట్ బాల్ ఢిల్లీలో: జైపాల్ తూటాలు

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడుల పైన కేంద్రమంత్రి జైపాల్ రెడ్డి శనివారం పరోక్షంగా నిప్పులు చెరిగారు. విభజనను వ్యతిరేకిస్తున్న సీమాంధ్ర నేతలపై విరుచుకుపడ్డారు. ముఖ్యమంత్రి ఆఖరి బంతి ఢిల్లీలో ఆడాలని ఎద్దేవా చేశారు. ఆట ముగిసిందని చురకలు అంటించారు. హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో తెలంగాణ తహసిల్దార్ల సంఘం డైరీని జైపాల్ రెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన తీవ్ర పదజాలంతో మండిపడ్డారు.

ప్రకాశం పంతులు, పట్టాభి సీతారామయ్య వంటి మహానుభావులు పుట్టిన ప్రాంతంలో శుంఠలు కూడా పుట్టారనిపిస్తోందన్నారు. శ్రీశ్రీ అన్నట్లుగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు దిశగా తన వంతు కృషి చేశానన్నారు. రాష్ట్ర విభజన ముగిసిన తర్వాత తానేం చేశానో చెబుతానని అన్నారు. చివరి బంతి మిగిలే ఉందని, సమన్యాయం అని ఇంకా ప్రజలను భ్రమల్లో పెడుతున్నారని, సీమాంధ్ర నేతలకు ఇంకా దింపుడుకల్లం ఆశ ఉందా? అని ప్రశ్నించారు.

Jaipal Reddy

ఈ నెల 23వ తేదీ అర్ధరాత్రి తర్వాత బంతి ఢిల్లీకి చేరుకుంటుందని ఆఖరి బంతి ఆడేది అక్కడేనని, హైదరాబాద్‌లో కాదన్నారు. తాను మరొకరిని చూసి క్రికెట్ భాష వాడలేదని పరోక్షంగా ముఖ్యమంత్రిపైకి బౌన్సర్ వదిలారు. ఎన్నికలకు ముందే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటవుతుందని, రెండు రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతాయన్నారు. 'అసెంబ్లీ మాటకు ఎందుకు విలువ ఉండదంటూ సీమాంధ్ర నేతలు బాధపడుతున్నారని, సుప్రీం కోర్టుకు వెళతామంటున్నారని జైపాల్ పేర్కొన్నారు.

వారిని చూసి తాను బాధపడటం లేదని, ఇది అజ్ఞానంతో కూడిన బాధ అన్నారు. సుప్రీం కోర్టు న్యాయమూర్తిగా పని చేసిన సుబ్బారావులాంటి న్యాయకోవిదులు సీమాంధ్ర నుంచే వచ్చారని, ఇప్పుడు కూడా కొందరుంటారని, ఈ సమయంలో వారంతా ఎందుకు మూగపోయారని నిలదీశారు. విభజన సమాఖ్య స్ఫూర్తికి, రాజ్యాంగానికి విరుద్ధమనడమేమిటని ప్రశ్నించారు. భారతదేశం సమాఖ్య వ్యవస్థ అని వారికి ఎవరు చెప్పారు? రాజ్యాంగంలో అలా రాశారా? రాజ్యాంగంలో ఇండియన్ యూనియన్ అని రాసి ఉందన్నారు.

అమెరికాలో మాదిరిగా మన దేశంలో రెండు పౌరసత్వాలు లేవని, మొఖం బాగోలేక అద్దం పగులగొట్టుకున్నట్లుంది కొందరి వాదన ఉందన్నారు. సీమాంధ్రలోనూ అమాయక ప్రజలు ఉన్నారని, బడా పెత్తందారులు కూడా ఉన్నారని, ప్రజల అమాయకత్వాన్ని ఆసరా చేసుకొని వారిని భ్రమల్లో ఉంచుతున్నారని విమర్శించారు. మంచి వర్షాలు కురవడానికి ముఖ్యమంత్రి బాధ్యుడయితే కరువుకు కూడా ఆయనే బాధ్యుడు కావాలన్నారు.

అంత గొప్ప అభివృద్ధి సాధిస్తే అంతే గొప్పగా ఎందుకు ఓడిపోతున్నారని చంద్రబాబును ఉద్దేశించి అన్నారు. ఆయన రిటైర్ అయ్యాక కూడా అంతా తనదే నడుస్తోందని, హైదరాబాద్‌ను తామే అభివృద్ధి చేశామంటున్నారని, అంతగా అభివృద్ధి చేస్తే ఎందుకలా ఓడిపోతున్నారన్నారు. తాను పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా ఉన్న కాలంలోనే మెట్రోరైలు, జేఎన్ఎన్‌యూఆర్ఎమ్ బస్సులు, ప్రాజెక్టులు ఇచ్చానని కానీ, ఆయనెవరో వచ్చి హైదరాబాద్‌ను తానే కట్టాను, బాగుచేశానని చెప్పుకొంటే తానేం చేయగలనని అన్నారు.

తెలంగాణ సాధన అసాధారణమైన విజయమని జైపాల్ అభివర్ణించారు. రాజధానితో కూడిన రాష్ట్ర ఏర్పాటు దేశంలో ఇదే మొదటిసారని, ఇది విప్లవంలాంటి విజయమన్నారు. ఇప్పటి వరకు పెట్టుబడిదారులు హైదరాబాద్‌లో ఎలా పెట్టుబడులు పెట్టారో తేలిదని కానీ, ఇకపై తెలంగాణలో పెట్టుబడులు పెట్టదలుచుకుంటే భూసంతర్పణ ఉండదన్నారు. తెలంగాణ ఏర్పడ్డాక సీమాంధ్ర మిత్రులు కూడా హైదరాబాద్‌లో పెట్టుబడులు పెడుతారని నమ్ముతున్నానని చెప్పారు.

కొందరు నేతలు అక్కడ పుట్టాం, ఇక్కడ పుట్టామని చెబుతున్నారని, దేశంలో ఎక్కడ పుట్టినా ఎమ్మెల్యేలు కావొచ్చని, పంజాబ్‌లో పుట్టిన షీలా దీక్షిత్ మూడుసార్లు ఢిల్లీకి ముఖ్యమంత్రి అయ్యారన్నారు. హైదరాబాదులో జన్మించిన వారే కాదు, శక్తి ఉంటే సీమాంధ్రులూ తెలంగాణకు ముఖ్యమంత్రి కావొచ్చునని చెప్పారు. సీమాంధ్ర ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని చంద్రబాబు, కిరణ్, వైయస్ జగన్‌ల పైన మండిపడ్డారు.

English summary
Union minister Jaipal Reddy has used the analogy of cricket to tell CM Kiran Kumar Reddy, a former cricketer, that the game was up for him as Telangana state was going to be created.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X