మంగళంపల్లి బాలమురళీకృష్ణ మృతి: చంద్రబాబు, కేసీఆర్‌ల సంతాపం
ప్రముఖ కర్ణాటక సంగీత విద్వాంసులు మంగళంపల్లి బాలమురళీ కృష్ణ మృతి పట్ల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంగళవారం నాడు సంతాపం తెలిపారు. ఆయన మృతి సంగీత ప్రియులకు తీరని లోటు అన్నారు.
అమరావతి: ప్రముఖ కర్ణాటక సంగీత విద్వాంసులు మంగళంపల్లి బాలమురళీ కృష్ణ మృతి పట్ల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంగళవారం నాడు సంతాపం తెలిపారు. ఆయన మృతి సంగీత ప్రియులకు తీరని లోటు అన్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్, ఉభయ తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ కూడా సంతాపం తెలిపారు.
బాలమురళీకృష్ణ మంగళవారం సాయంత్రం చెన్నైలోని తన నివాసంలో కన్నుమూసిన విషయం తెలిసిందే. ఆయన వయస్సు 86. 1930 జులై 6న తూర్పు గోదావరి జిల్లా శంకరగుప్తంలో పట్టాభి సీతారామయ్య, సూర్యకాంతం దంపతులకు జన్మించారు.

బాలమురళీ కృష్ణ ఆరేళ్ల వయసులో గాయకుడిగా సంగీత ప్రస్థానం ప్రారంభించారు. ప్రారంభంలో బాలమురళీ కృష్ణ తండ్రి పట్టాభిరామయ్య వద్ద సంగీతం నేర్చుకున్నారు. ఆయన ప్రపంచవ్యాప్తంగా 25 వేల కచేరీలు నిర్వహించారు. వయోలిన్, వీణ, మృదంగం తదితర సంగీత వాయిద్యాల్లో కృష్ణకు ప్రావీణ్యం ఉంది.
జుగల్బందీ తరహా కచేరీ రూపకల్పనకు ఆద్యులు. ఆయన టీటీడీ, శృంగేరి పీఠాల ఆస్థాన విద్వాంసులు. అమెరికా, కెనడా, బ్రిటన్, ఇటలీ, ఫ్రాన్స్, రష్యా, శ్రీలంక, మలేసియా, సింగపూర్ దేశాల్లో వేలాది కచేరీలు నిర్వహించారు. తెలుగు, కన్నడం, సంస్కృతం, తమిళం, హిందీ, బెంగాలీ భాషల్లో పాటలు పాడారు.
ఆయన భక్తప్రహ్లాదలో నారదునిగా నటించి తన పాటను తానే పాడారు. గంధర్వగాన సామ్రాట్, జ్ఞానసాగర, సంగీత కళానిధి, గాన కౌస్తుభ, గాన కళాభూషణం, గానగంధర్వ, గాయక శిఖామణి, జ్ఞానశిఖామణి, జ్ఞాన చక్రవర్తి, జ్ఞానపద్మం, నాదజ్యోతి, సంగీత కళాసరస్వతి, నాద మహర్షి వంటి బిరుదులు ఆయన సొంతం.
ఆయన ఎన్నో విశ్వవిద్యాలయాల నుంచి గౌరవ డాక్టరెట్లు అందుకున్నారు. పద్మభూషణ్, పద్మవిభూషణ్‌లను అందుకున్నారు. మహతి, సుముఖం, సర్వశ్రీ, ప్రతిమధ్యమావతి, గణపతి, సిద్దిరాగాలు, భద్రాద్రి శ్రీరామ చంద్రుని సుప్రభాతాన్ని ఆలపించారు. నాటి రాష్ట్రపతి రాజేంద్రప్రసాద్ బాలమురళీకృష్ణ భద్రాద్రి సుప్రభాత రికార్డులు తెప్పించుకుని వినేవారు.












Click it and Unblock the Notifications