తిరుమల మెట్ల మార్గంలో మళ్లీ..: భయాందోళనల్లో శ్రీవారి భక్తులు?
Tirumala: తిరుమలలో మరోసారి చిరుతల సంచారం మళ్లీ ఆరంభమైనట్టే కనిపిస్తోంది. తాజాగా శ్రీవారి మెట్ల నడకమార్గంలో చిరుత సంచరించింది. ఈ మార్గంలో తిరుమలకు వెళ్తోన్న భక్తులకు తీవ్ర భయాందోళనలకు గురి చేసింది. సమాచారం అందుకున్న వెంటనే తిరుమల తిరుపతి అధికారులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. భద్రత చర్యలు చేపట్టారు.
ఈ వారం రోజుల్లో తిరుపతి- తిరుమల మెట్ల మార్గంలో చిరుత కనిపించడం ఇది రెండోసారి. కిందటి నెల 25వ తేదీన అలిపిరి నడక దారిలో చిరుత సంచరించిన విషయం తెలిసిందే. 350వ మెట్టు సమీపంలో భక్తులు చిరుతను గుర్తించారు అప్పట్లో. భయంతో భక్తులు పరుగులు తీశారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

ఇప్పుడు తాజాగా మళ్లీ చిరుత కనిపించడం కలకలం రేపింది. శ్రీవారి భక్తుల్లో భయాందోళనలను నింపింది. ఈ ఉదయం మెట్ల మార్గం 500 మెట్టు సమీపంలో పొదల్లో చిరుతను గుర్తించారు కొందరు భక్తులు. వెంటనే టీటీడీ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. ఈ సమాచారం అందిన వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్న సిబ్బంది.. భద్రత చర్యలు చేపట్టారు.
సైరన్ మోగిస్తూ చిరుతను తరిమేందుకు ప్రయత్నాలు చేశారు. భక్తులు ఒంటరిగా కొండపైకి వెళ్లొద్దని సూచించారు. గుంపులుగా మాత్రమే వెళ్లాలని కోరారు. 12 సంవత్సరాలలోపు వయస్సున్న వారిని ఈ మార్గంలో అనుమతించకూడదని నిర్ణయించారు. భక్తుల భద్రత కోసం టీటీడీ అటవీ విభాగం సిబ్బంది మెట్లమార్గం పొడవునా పెట్రోలింగ్ ఏర్పాటు చేశారు.
శేషాచలం అడవుల్లో చిరుతలు, ఎలుగుబంట్లు, ఇతర వణ్య ప్రాణుల సంఖ్య భారీగా పెరుగుతోందనడానికి తాజా ఉదంతం ఉదాహరణగా చెప్పుకోవచ్చు. గత ఏడాది చిరుతల సంచారం శ్రీవారి భక్తులను భయాందోళనలకు గురి చేసిన విషయం తెలిసిందే. అలిపిరి, శ్రీవారిమెట్లు, గాలి గోపురం పరిసర ప్రాంతాల్లో చిరుతలు కనిపించాయి అప్పట్లో.
వాటిని కదలికలను ఎప్పటికప్పుడు గుర్తించడానికి సుమారు 500 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. అలిపిరి నుంచి గాలిగోపురం, శ్రీలక్ష్మీ నరసింహస్వామి ఆలయం, 38వ మలుపు, శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయం క్యాంపస్ సహా మొత్తం ఏడు చోట్ల చిరుతల సంచారాన్ని గుర్తించారు అప్పట్లో.
ఇప్పుడు మరోసారి చిరుతల బెడద మొదలైంది. దీన్ని నివారించడంపై టీటీడీ ఇప్పటికే దృష్టి సారించింది. అలిపిరి మార్గాన్ని చిరుత రహిత ప్రాంతంగా మార్చడానికి కెమెరా ట్రాప్స్, స్మార్ట్ స్టిక్స్, బయో ఫెన్సింగులు, నెట్ గన్స్, హై ఫ్లాష్ టార్చ్ లైట్లు, పెప్పర్ స్ప్రేలు.. తదితర వస్తువులను రక్షణ పరికరాల వినియోగించేలా నిర్ణయం తీసుకుంది.
అలిపిరి మెట్ల మార్గంలో రెండున్నర కిలో మీటర్ల పొడవు ఉన్న 7వ మైలు నుండి శ్రీలక్ష్మీ నరసింహ స్వామి ఆలయం వరకు పటిష్ట భద్రత కల్పించడం, చిరుతలు- ఇతర వన్యప్రాణుల కదలికలపై నిఘా ఉంచాలని టీటీడీ నిర్ణయించింది. ప్రతి నెల మానవ-వన్యప్రాణి ఘర్షణపై సంబంధిత అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించి కార్యాచరణ ప్రణాళికల పురోగతిని సమీక్షించనుంది.












Click it and Unblock the Notifications