'లైగర్' సినిమా బాధితులకు న్యాయం చేయండి
పూరీ జగన్నాథ్ సినిమా వస్తోందంటేనే అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తారు. ఆయన సినిమాలను డైలాగుల కోసమే చూసేవారు ఎంతోమంది ఉన్నారు. పూరీ దర్శకత్వంలో ఫలానా కథానాయకుడు నటించాడు అంటే ఎంత కొత్తగా హీరో కనిపించాడు అనేదే టాపిక్ అవుతుంది. హీరో క్యారెక్టర్ పైనే కథలు రాసి హిట్ కొట్టగల ఏకైక దర్శకుడిగా పూరీకి పేరుంది. ఇడియట్, అమ్మా నాన్న ఓ తమిళ అమ్మాయి, పోకిరి, బిజినెస్ మేన్, టెంపర్, శివమణి, బుజ్జిగాడు.. ఇలా చెప్పుకుంటూ పోతే జాబితా చాలా పెద్దవుతుంది.
ఇస్మార్ట్ శంకర్ తో సాలిడ్ హిట్ కొట్టిన పూరీ లైగర్ సినిమాతో భయంకరమైన ఫ్లాప్ ను ఇచ్చాడు. పాన్ ఇండియా సినిమాగా రూపొందిన లైగర్ పై పూరీయే కాకుండా కథానాయకుడు విజయ్ దేవరకొండ కూడా ఎక్కువ నమ్మకం పెట్టుకున్నారు. అయితే వీరందరి ఆశలపై నీళ్లు చల్లుతూ ఈ సినిమా ఘోర పరాజయం పాలైంది. బాక్సింగ్ బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమాను రూపొందించారు. అనకాపల్లి నుంచి ముంబయి వరకు ఈ సినిమాను కొన్న ప్రతి ఒక్కరూ భారీ నష్టాలను ఫేస్ చేశారు. బయర్లంతా పూరీపై గొడవకు దిగారు.

నష్టాలను భర్తీ చేస్తాను అనే మాట పూరీ వారందరికీ ఇచ్చాడు. లైగర్ పరాజయం నుంచి కోలుకొని కొత్త సినిమా చేయడానికి సిద్ధమయ్యాడు. మే 15వ తేదీన ఈ సినిమాను ప్రకటించబోతున్నారు. రామ్ పోతినేని కథానాయకుడిగా ఇస్మార్ట్ శంకర్ కాంబినేషన్ ను మళ్లీ తీసుకువస్తూ రామ్ పుట్టినరోజైన 15న ప్రకటించడానికి ముహూర్తాన్ని కూడా పెట్టారు. ఈ విషయం బయటకు రావడంతో "లైగర్ సినిమా బాధితులకి న్యాయం చెయ్యండి" ఎగ్జిబిటర్స్, లీజర్స్ అసోసియేషన్ రిలే దీక్షలకు దిగారు. ఈ ఇష్యూకి పూరీ ఎలా రెస్పాండవుతాడు? అనేదే ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.












Click it and Unblock the Notifications