బంగాళాఖాతంపై ద్రోణి- ఏపీలో ఈ జిల్లాల్లో వర్షాలు
ఏపీలో రోజురోజుకూ ఎండ తీవ్రత అధికమౌతోంది. ఉక్కపోత జనాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. నడి వేసవి రాకముందే రోళ్లు పగిలేలా ఎండలు కాస్తోన్నాయి. ప్రజలు రోడ్ల మీదికి రావాలంటే హడలిపోయే పరిస్థితి నెలకొంది. ఇది ఇప్పట్లో ఆగేలా కనిపించట్లేదు. మున్ముందు ఎండ తీవ్రత మరింత పెరిగే అవకాశాలు లేకపోలేదు. ఉపరితల ఆవర్తనం వల్ల మొన్నటివరకు వర్షాలు పడ్డాయి గానీ ఇప్పుడు పరిస్థితి మళ్లీ మొదటికొచ్చింది.
ఇప్పటికే రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రత దిమ్మతిరిగేలా చేస్తోంది. రికార్డుస్థాయిలో టెంపరేచర్ నమోదవుతోంది. 40 డిగ్రీలకు పైగా ఎండ కాయడం సాధారణమైపోయింది. చిత్తూరు నుంచి శ్రీకాకుళం వరకు దాదాపు అన్ని ప్రాంతాల్లో కూడా ఇదే స్థాయిలో ఉష్ణోగ్రత నమోదవుతోంది. ఈ ఎండలకు వడగాల్పులు తోడవుతున్నాయి. వేడి గాలులు మరింతగా జనాన్ని ఇబ్బందులకు గురి చేస్తోన్నాయి. ప్రత్యేకించి రాయలసీమ జిల్లాల్లో వేడిగాలులు, ఉష్ణోగ్రత పంజా విసురుతున్నాయి.

ఈ పరిస్థితుల మధ్య ఉత్తరాంధ్ర జిల్లాలకు తీపికబురు అందింది. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ద్రోణి ప్రభావంతో నేడు, రేపు కొన్ని చోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది. ద్రోణి ప్రభావంతో పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, పోలవరం, ఏలూరు జిల్లాల్లో అక్కడక్కడా పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు. ద్రోణి ప్రభావం ఉత్తరాంధ్రకు మాత్రమే పరిమతం కావొచ్చు.
రాష్ట్రంలోని మిగిలిన ప్రాంతాల్లో ఎండ తీవ్రత యధాతథంగా కొనసాగుతుందని తెలిపారు. నేడు పల్నాడు, ప్రకాశం, మార్కాపురం, తిరుపతి, చిత్తూరు, కడప, కర్నూలు, అనంతపురం, సత్యసాయి, అన్నమయ్య, నంద్యాల జిల్లాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. ఆయా జిల్లాల్లో 27 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 25 మండలాల్లో సాధారణ వడగాల్పులు వీస్తాయని ప్రఖర్ జైన్ తెలిపారు. శనివారం నాడు కడప జిల్లా ఒంటిమిట్టలో గరిష్టంగా 45 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.












Click it and Unblock the Notifications