చంద్రబాబుకు గుదిబండగా మారిన రుణమాఫీ
హైదరాబాద్: రైతు, డ్వాక్రా రుణాల మాఫీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి గుదిబండగా మారింది. రుణాల మాఫీ ఆయనను వెంటాడోతుంది. ఎన్నికల సమయంలో ఇచ్చిన రుణమాఫీ హామీని నిలబెట్టుకోవడానికి ఆయన తీవ్రమైన ఇబ్బందులకు గురి కావాల్సిన పరిస్థితి ఏర్పడింది. దాంతో ప్రతిపక్ష నేత వైయస్ జగన్ నుంచి ఆయనకు తీవ్రమైన ఒత్తిడి వస్తోంది.
రుణమాఫీ అంశం మళ్లీ సోమవారం నిర్వహించనున్న మంత్రివర్గ సమావేశంలో చర్చకు వస్తోంది. రుణమాఫీపై విమర్శల పరంపర వెల్లువెత్తుతోంది. సమస్య నుంచి బయటపడేందుకు చంద్రబాబు ప్రభుత్వం కమిటీ వేశారు. కమిటీ ఇప్పటి వరకు నివేదిక ఇవ్వలేకపోయింది. రుణమాఫీపై కాలయాపన చేసేందుకే కమిటీ వేశారని జగన్ విమర్శిస్తున్నారు.

రుణమాఫీపై అధ్యయనం కోసం నియామకం అయిన కోటయ్య నేతృత్వంలోని కమిటీ జూన్ 22లోపే నివేదిక ఇస్తుందని చంద్రబాబు స్వయంగా ప్రకటించారు. విశాఖపట్నంలో జూన్ 12న తొలి మంత్రవర్గ సమావేశం తర్వాత ఈమేరకు ప్రకటించారు. ప్రభుత్వ వైఖరి ఏమిటో నేటికీ స్పష్టం కాకపోవడంతో ఈ కమిటీ కూడా నివేదిక రూపొందించలేని స్థితిలో ఉంది.
రాష్ట్ర మంత్రివర్గం మూడో సమావేశం సోమవారం హైదరాబాద్‌లో జరుగనుంది. మొట్టమొదటి సమావేశం విశాఖపట్నంలో జూన్ 12న నిర్వహించారు. రెండో సమావేశం హైదరాబాద్‌లోని లేక్‌వ్యూ గెస్ట్‌హౌజ్‌లో నిర్వహించారు. ప్రస్తుతం మూడో పర్యాయం మంత్రివర్గ సమావేశం మళ్లీ హైదరాబాద్‌లోని చంద్రబాబు క్యాంప్ ఆఫీసుగా కొనసాగుతున్న లేక్‌వ్యూ గెస్ట్‌హౌస్‌లోనే నిర్వహిస్తున్నారు.
తెలుగుదేశం పార్టీ ఎన్నికల ప్రణాళికలో ప్రజలకు ఇచ్చిన హామీల్లో కీలకమైన అంశాలపై నేటికీ స్పష్టమైన నిర్ణయాలు తీసుకోలేని పరిస్థితి ఏర్పడింది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ధీనస్థితిలో ఉందని చంద్రబాబే స్వయంగా చెబుతున్నారు. రాజధాని నిర్మాణం కోసం విరాళాలు సేకరిస్తుండడం మరో విమర్శకు తావిస్తోంది.
ప్రభుత్వం ముందున్న సమస్యల్లో తక్షణమే పరిష్కరించాల్సిన అంశాలు రెండున్నాయి. రైతులకు రుణమాఫీ ఒక అంశం కాగా, తెలంగాణ రాష్ట్రంలో చదువుతున్న ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ మరో అంశం. తెలంగాణలో చదువుతున్న ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకు తాము ఫీజు రీయింబర్స్‌మెంట్ చేయబోమని తెలంగాణ ముఖ్యమంత్రి చేసిన ప్రకటనపై ఆంధ్రప్రదేశ్ మంత్రులు తీవ్రంగా విమర్శలు చేస్తున్నారు. కానీ తెలంగాణలోని తమ విద్యార్థులకు భరోసా ఇచ్చేందుకు మాత్రం ఏమీ చేయడం లేదు.












Click it and Unblock the Notifications