Shirdi: సాయి భక్తులకు అలర్ట్ - షిర్డీలో మే 1వ తేదీ నుంచి నిరవధిక బంద్ ..!!
ప్రముఖ పుణ్యక్షేత్రం షిర్డీలో మే 1వ తేదీ నుంచి నిరవధిక బంద్ నిర్వహించనున్నారు. తాజాగా ఆలయానికి సంబంధించిన నిర్ణయాలను స్థానికులు వ్యతిరేకిస్తున్నారు. ఈ నిర్ణయాలతో పెద్ద ఎత్తున ఆంక్షలు పెడతారని.. వాటివల్ల పర్యాటకులకు, తమకు తీవ్ర ఇబ్బందులు కలుగుతాయని, తమ ఉపాధి అవకాశాలు దెబ్బతింటాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. స్థానికులు, వ్యాపారులు, అన్ని సంఘాలవారు సమావేశమై బంద్ నిర్ణయం తీసుకున్నారు. కానీ, దేవాలయం మాత్రం తెరిచే ఉంటుంది.
షిర్డీలో బంద్:షిర్డీలో స్థానికులు వచ్చే సోమవారం నుంచి బంద్ పాటించాలని నిర్ణయించారు. షిర్డీ ఆలయానికి ఉగ్రవాదుల నుంచి ముప్పు ఉందనే ఆందోళనతో ప్రభుత్వం సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ ను రక్షణ కోసం నియమిస్తూ నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు షిర్డీ ఆలయానికి మహారాష్ట్ర పోలీసులు భద్రత కల్పిస్తున్నారు. నిఘా వర్గాల హెచ్చరికతో సీఐఎస్ఎఫ్ ను రంగంలోకి దించి భద్రతను పటిష్ఠం చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయం పైన స్థానికులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా నాలుగు డిమాండ్లను తీసుకొచ్చారు. ఆలయానికి సీఐఎస్ఎఫ్ భద్రత వద్దని చెబుతున్నారు. దేవాలయానికి సీఈవో పోస్టు రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వ అధికారులతో కమిటీ వేయాలనేది మరో డిమాండ్.

స్థానికుల అభ్యంతరాలు:ప్రస్తుతం తాత్కాలిక కమిటీ సాయి సంస్థాన్ పనులను పర్యవేక్షిస్తోంది. దీంతో కార్యకలాపాలు నెమ్మదించి, తీసుకోవాల్సిన నిర్ణయాలు పలు పెండింగ్ లో ఉన్నాయని స్థానికులు చెబుతున్నారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వమే పూర్తి స్థాయి కమిటీ వేయాలని కోరుతున్నారు. 50 శాతం ధర్మకర్తలు షిర్డీ నుంచే ఉండేలా కొత్త ట్రస్టీ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఇదే సమయంలో బంద్ జరిగితే దేవాలయం దర్శనం విషయంలో ఎటువంటి మార్పులు లేవని అధికారులు ప్రకటించారు. బంద్ పాటించినా ఆలయం మాత్రం తెరిచే ఉంటుంది. సాయి భక్తులు దర్శనానికి వెళ్లొచ్చు. సాయి సంస్థాన్ ట్రస్ట్ నిర్వహించే ఉచిత అన్నదానం, ట్రస్ట్‌కు సంబంధించిన వసతి సౌకర్యాలన్నీ అందుబాటులో ఉంటాయని ట్రస్టు ప్రకటించింది.
దేవాలయం యధావిధిగా:భక్తుల కోసం సంస్థాన్ లో అన్ని సౌకర్యాలు కొనసాగుతాయని స్పష్టత ఇచ్చారు. దూరం నుంచి వచ్చే భక్తుల కోసం ఎలాంటి ఇబ్బందులు లేకుండా వసతి విషయంలో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందు కోసం స్థానికులు సహకరిస్తామని హామీ ఇచ్చారు. ఆలయం మినహా ఇతర వ్యాపార సంస్థలు అన్నీ మూసివేస్తారు. దీంతో, బంద్ ప్రకటించినా సాధారణ భక్తులకు మాత్రం ఎటువంటి ఇబ్బంది ఉండదని అధికారులు హామీ ఇస్తున్నారు. వేసవి సెలవులు కావటంతో షిర్డీకి ఈ సమయంలోనే భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. భక్తులు ఎవరూ ఈ బంద్ ప్రకటనతో ఆందోళన అవసరం లేదని ట్రస్టు సభ్యులు స్పష్టం చేసారు. యధావిధిగా సాయి భక్తులు షిర్డీకి రావచ్చని పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications