పులివెందులలో లాకప్‌డెత్ అంటూ వార్తలు, ఖండించిన డీఎస్పీ.. జగన్ సర్కార్ టార్గెట్ గా ప్రతిపక్షాలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోలీసు వ్యవస్థను టార్గెట్ చేస్తూ నిత్యం ఏవో వార్తలు పెద్ద ఎత్తున ప్రచారం అవుతూనే ఉన్నాయి. ఇక తాజాగా కడప జిల్లా పులివెందుల పోలీసులు దొంగతనం కేసులో అరెస్ట్ చేసిన ఓ యువకుడు పోలీస్ స్టేషన్ లోనే మృతిచెందినట్టు వస్తున్న వార్తలు రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపుతున్నాయి. ఇదే సమయంలో యువకుడి మృతదేహాన్ని రాత్రికి రాత్రి దహనం చేశారన్న వార్తల నేపథ్యంలో జగన్ సర్కార్ ను, ఏపీ పోలీసు వ్యవస్థను టార్గెట్ చేస్తున్నారు ప్రతిపక్ష పార్టీల నాయకులు.

పులివెందులలో పోలీసుల అదుపులో యువకుడు మృతి
పులివెందుల అహోబిళపురం కాలనీకి చెందిన 25 సంవత్సరాల వల్లెపు అశోక్ అలియాస్ అక్కులప్ప తండ్రి చిన్నప్పుడే మరణించగా, తల్లి కువైట్ కు వలస వెళ్లింది. అనంతపురం జిల్లా ధర్మవరం పట్టణానికి చెందిన ఓ యువతిని పెళ్లి చేసుకున్న అక్కులప్పపై దొంగతనం కేసులు ఉన్నట్టుగా తెలుస్తుంది. ఈ క్రమంలో అతనిని అదుపులోకి తీసుకున్న పులివెందుల పోలీసులు ఆదివారం అతడిని పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్ళినట్టుగా సమాచారం. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియదు గానీ అక్కులప్ప మరణించాడు. అయితే పోలీసులు అతనిపై థర్డ్ డిగ్రీ ప్రయోగించారని, బాగా కొట్టడం వల్లే అతను మరణించాడని స్థానికంగా పెద్ద ఎత్తున ఆరోపణలు వినిపిస్తున్నాయి.

లాకప్ డెత్ కాదన్న డీఎస్పీ .. యువకుడి మృతి ఘటనపై క్లారిటీ
అక్కులప్ప మృతి తర్వాత రాత్రికి రాత్రి గుట్టుచప్పుడు కాకుండా అతని మృతదేహాన్ని దహనం చేసినట్లుగా ప్రచారం జరుగుతుంది.మొదట ఖననం చెయ్యాలని భావించి గుంత తవ్వారని, మళ్ళీ దహనం చేశారని చర్చ జరుగుతుంది. ఇది లాకప్ డెత్ అని ప్రచారం జరుగుతున్న పరిస్థితులలో అది తప్పని ఖండించారు డిఎస్పీ శ్రీనివాస్. అక్కులప్పది లాకప్ డెత్ కాదని, అతను అనారోగ్యంతో మరణించాడు అని వెల్లడించారు. ఈ మేరకు అతని చెల్లెలు కూడా లిఖితపూర్వక వాంగ్మూలం రాసి ఇచ్చారని పోలీసులు చెప్తున్నారు.

విచారణ చెయ్యాలన్న టీడీపీ బీసీ సెల్.. జగన్ ను టార్గెట్ చేసిన రామ కృష్ణ
అయితే ఇది లాకప్ డెత్ అని, దీనిపై విచారణ జరపాల్సిన అవసరముందని టిడిపి బీసీ సెల్ రాష్ట్ర కన్వీనర్ చంద్రశేఖర్ యాదవ్ డిమాండ్ చేస్తున్నారు. జగన్ సర్కార్ ను టార్గెట్ చేస్తూ, పోలీసులు సామాన్యులను చిత్రహింసలకు గురి చేస్తూ వారి మరణాలకు కారణం అవుతున్నారని ఆరోపిస్తున్నారు. ఒకపక్క పోలీసులు ఇది లాకప్ డెత్ కాదని చెప్తున్నా, పులివెందులలో యువకుడు మృతి ఘటనపై సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పులివెందులలో లాకప్ డెత్ జరగడం అమానుషమని ఆయన మండిపడుతున్నారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందా లేదా అని ప్రశ్నించిన రామకృష్ణ చనిపోయిన వ్యక్తి చివరి చూపు కూడా కుటుంబ సభ్యులకు లేకుండా రాత్రికి రాత్రి దహనం చేసి దారుణానికి పాల్పడ్డారని తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.

పులివెందులలో ఇలాంటి ఘటన జరిగినా జగన్ కు సిగ్గుందా? సీపీఐ నేత ధ్వజం
సీఎం జగన్ సొంత జిల్లాలోనే ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయని, పులివెందులలో ఇలాంటి ఘటన జరిగినా జగన్ కు సిగ్గుందా అని ప్రశ్నించారు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ. పులివెందుల లాకప్ డెత్ పై జ్యుడీషియల్ విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. అంతేకాదు ఈ ఘటనకు బాధ్యులైన ఎస్సై గోపీనాథ్ రెడ్డిని వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు రామకృష్ణ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా గాడి తప్పాయని పేర్కొన్న రామకృష్ణ డీజీపీ గౌతమ్ సవాంగ్ శాంతిభద్రతల పరిరక్షణలో పూర్తిగా విఫలమయ్యారని నిప్పులు చెరిగారు.












Click it and Unblock the Notifications