నిమిషంలో లోకసభ వాయిదా, దేశం నివ్వెరపోతోందని వెంకయ్య అసహనం
న్యూఢిల్లీ: లోకసభలో అదే తీరు. పదకొండో రోజు కూడా తీరు మారలేదు. బుధవారం ఉదయం పదకొండు గంటలకు ప్రారంభమైన లోకసభ నిమిషానికే వాయిదా పడింది. సభ ప్రారంభం కాగానే స్పీకర్ సుమిత్రా మహాజన్ ప్రశ్నోత్తరాలు చేపట్టారు.
ఆ వెంటనే కావేరీ యాజమాన్య బోర్డు ఏర్పాటు చేయాలని అన్నాడీఎంకే సభ్యులు ఆందోళన చేపట్టారు. స్పీకర్ పోడియం వద్దకు చేరుకుని ప్లకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలు చేశారు. సభ సజావుగా సాగేలా సహకరించాలని స్పీకర్ కోరినా వారు వినలేదు. దీంతో సభ వాయిదా పడింది.

మరోవైపు, ఏపీకి ప్రత్యేక హోదా ప్రకటించడంతో పాటు విభజన హామీలన్నీ నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ టీడీపీ ఎంపీలు పార్లమెంటు ప్రాంగణంలో ఆందోళన చేపట్టారు. ఉభయ సభల ప్రారంభానికి ముందు మహాత్మా గాంధీ విగ్రహం ఎదుట ప్లకార్డులతో నిరసన తెలిపారు.
ఏపీకి న్యాయం చేయాలంటూ నినాదాలు చేశారు. ఏపీ పట్ల కేంద్రం నిర్లక్ష్య వైఖరి ప్రదర్శిస్తోందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. చిత్తూరు ఎంపీ శివప్రసాద్ దోబీ వేషధారణలో ఆందోళనలో పాల్గొన్నారు.
రాజ్యసభలోను ఆందోళన
ఏపీని ఆదుకోవాలంటూ రాజ్యసభలోను ఆందోళనలు చేపట్టారు. చైర్మన్ పోడియాన్ని చుట్టుముట్టిన టీడీపీ, వైసీపీ ఎంపీలు ప్లకార్డులతో నిరసన చేపట్టారు. వెంకయ్య నాయుడు స్పందిస్తూ సభలో అన్ని అంశాలపై చర్చిద్దామని, ఆందోళన వద్దని కోరారు. సభ్యుల ప్రవర్తన చూసి దేశమంతా నివ్వెరపోతోందన్నారు. సభ సజావుగా సాగేందుకు అవకాశం కల్పిస్తే ఏపీ, కావేరీ యాజమాన్యం అంశాలపై చర్చిద్దామన్నారు. అనంతరం సభను రెండు గంటల వరకు వాయిదా వేశారు. కాగా, రాజ్యసభలో కొత్తగా ఎన్నికైన టీఆర్ఎస్ ఎంపీలు తెలుగులో ప్రమాణ స్వీకారం చేశారు.












Click it and Unblock the Notifications