ఆస్ట్రేలియాలో బిజీ బిజీగా మంత్రి లోకేష్.. వెస్ట్రన్ సిడ్నీ యూనివర్సిటీ పరిశోధకులతో భేటీ..
రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ వెస్ట్రన్ సిడ్నీ యూనివర్సిటీ (WSU)ని సందర్శించారు. ఈ సందర్భంగా WSU అధికారులు మంత్రి లోకేష్ కు ఘనస్వాగతం పలికారు. అనంతరం యూనివర్సిటీ సీనియర్ ఎగ్జిక్యూటివ్ లు, అగ్రికల్చరల్ టెక్నాలజీ పరిశోధకులతో మంత్రి లోకేష్ భేటీ అయ్యారు.
ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ...ఆంధ్రప్రదేశ్ లో వ్యవసాయ ఆధునీకరణకు WSU వాతావరణ నిరోధక పంటలు, ప్రెసిషన్ ఫార్మింగ్ లో నైపుణ్యాలను ఆచార్య ఎన్ జి రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయంతో కలిసి పంచుకోండి. రైతులు, అగ్రి-ప్రొఫెషనల్స్ కు స్మార్ట్ ఫార్మింగ్ టెక్నిక్ లు, అగ్రి-టెక్ ఇన్నోవేషన్లలో శిక్షణ ఇచ్చే సంయుక్త కార్యక్రమాలు నిర్వహించండి. ఆంధ్రప్రదేశ్ విశ్వవిద్యాలయాలతో స్థిరమైన నీటి నిర్వహణ, భూమి ఆరోగ్య ప్రాజెక్టులపై సహకారం అందించండి.
స్మార్ట్ నీటిపారుదల వ్యవస్థలు, AI ఆధారిత వ్యవసాయ పరిష్కారాలను అభివృద్ధి చేసే ఇన్నోవేషన్ హబ్ ల ఏర్పాటుకు సహకరించండి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి వ్యవసాయ విధానాలు, స్థిరమైన అభివృద్ధి వ్యూహాలపై పరిశోధన ఆధారిత సూచనలు అందించాల్సిందిగా మంత్రి లోకేష్ విజ్ఞప్తిచేశారు.
WSU సీనియర్ ఎగ్జిక్యూటివ్ లు, పరిశోధకులు యూనివర్సిటీ ప్రత్యేకతలను తెలియజేస్తూ... 1989లో ఆస్ట్రేలియాలోని గ్రేటర్ వెస్ట్రన్ సిడ్నీలో స్థాపించిన వెస్ట్రన్ సిడ్నీ విశ్వవిద్యాలయం (WSU) కమ్యూనిటీ ఎంగేజ్ మెంట్స్, ఇన్నోవేషన్స్ పై దృష్టి సారించిన ప్రముఖ విద్యాసంస్థగా అభివృద్ధి చెందిందని చెప్పారు. పరిశ్రమతో అనుసంధానమైన కోర్సులకు ప్రసిద్ధి చెందిన WSU.. ఆరోగ్య, విద్య, వ్యాపార, ఇంజినీరింగ్ రంగాల్లో ప్రావీణ్యం సాధించింది.

స్థిరమైన అభివృద్ధిపై ప్రభావం చూపడంలో ప్రపంచంలో నెం.1 స్థానంలో ఉంది (THE Impact Rankings 2023 ప్రకారం). ప్రపంచంలోని టాప్ 2 శాతం విశ్వవిద్యాలయాల్లో WSU స్థానం సంపాదించింది (QS World University Rankings 2023 ప్రకారం).. 70కి పైగా దేశాల నుండి 49వేల మందికి పైగా విద్యార్థులు, 3వేల మందికి పైగా సిబ్బందితో ఆస్ట్రేలియాలోని అతిపెద్ద, వైవిధ్యమైన విశ్వవిద్యాలయాలలో ఒకటిగా నిలిచిందని చెప్పారు.
భారతీయ విశ్వవిద్యాలయాలతో (ఉదాహరణకు IITలు) స్టూడెంట్ ఎక్స్ఛేంజి, సంయుక్త పరిశోధన, నైపుణ్య అభివృద్ధి కార్యక్రమాలలో భాగస్వామ్యం వహిస్తున్నట్లు చెప్పారు. భారతీయ విద్యార్థులకు స్కాలర్‌షిప్ లు అందిస్తూ, భారతీయ పరిశ్రమలతో ఇన్నోవేషన్, వ్యాపార చొరవపై భాగస్వామ్యం వహిస్తున్నాం. WSU అనుబంధ హాక్స్ బరీ ఇన్ స్టిట్యూట్ ఫర్ ద ఎన్విరాన్‌మెంట్.. భూమి ఆరోగ్యం, నీటి సామర్థ్యం, పర్యావరణ ప్రభావం తగ్గింపుపై దృష్టి సారించి స్థిరమైన వ్యవసాయ పద్ధతులపై పరిశోధనల్లో ముందంజలో ఉందని తెలిపారు.

కృత్రిమ మేధస్సు (AI), ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (IoT), డేటా విశ్లేషణలను ఉపయోగించి పంట దిగుబడులను పెంచడం, అనవసర వ్యయాన్ని తగ్గించడంపై అధునాతన పరిశోధన చేస్తున్నట్లు చెప్పారు. పరిశ్రమ, ప్రభుత్వాలతో కలిసి స్మార్ట్ నీటిపారుదల వ్యవస్థలు, ఆటోమేటెడ్ వ్యవసాయ పరికరాలను అనుసంధానించే ఆధునిక అగ్రి- టెక్ సాంకేతిక పరిష్కారాలను అభివృద్ధి చేస్తుంది. స్థిరమైన వ్యవసాయ పద్ధతులను ప్రోత్సహించడం ద్వారా పరిశోధన, ప్రపంచ ఆహార భద్రతకు సహకరిస్తున్నట్లు చెప్పారు.












Click it and Unblock the Notifications