వైఎస్ వివేకా హత్య కేసుపై జగన్ కు లోకేష్ సవాల్ : ప్రమాణానికి రెడీనా, హూ కిల్డ్ బాబాయ్ అంటున్న టీడీపీ నేతలు
తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నికల ప్రచారంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ వైయస్ జగన్మోహన్ రెడ్డి కి సవాల్ విసిరారు. వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసు పై వాడి వేడి వాగ్బాణాలను సంధించారు. ఈనెల 14వ తేదీన ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి తిరుపతి వస్తున్నారంట.. మీ బాబాయిని మేము గానీ , మా కుటుంబ సభ్యులు గానీ చంపలేదని వెంకటేశ్వర స్వామి పై ప్రమాణం చేస్తా ..మీరు మీ కుటుంబ సభ్యులు చంపలేదని ప్రమాణం చేస్తారా జగన్ రెడ్డి అంటూ నారా లోకేష్ జగన్ మోహన్ రెడ్డి కి సవాల్ విసిరారు.
వైఎస్ వివేకా హత్యకేసు : జగన్ పై లోకేష్ సెటైర్లు .. కుక్కల మాదిరిగా మొరుగుతారా అన్న కొడాలి నాని

లోకేష్ సవాల్ కు రెడీ .. జగన్ రెడీనా ? టీడీపీ నేతల ప్రశ్న
తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నికల్లో సూళ్లూరుపేట నియోజకవర్గం నాయుడుపేటలో ప్రసంగించిన సందర్భంగా లోకేష్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఇక నారా లోకేష్ చేసిన సవాల్ కు వైసిపి అధినేత, ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి రెడీనా అంటూ టిడిపి నేతలు జగన్ ను టార్గెట్ చేస్తున్నారు. నారా లోకేష్ చేసిన సవాలుకు ఎవరు ఇప్పటి వరకు నోరు మెదపలేదు అని, జగన్ కు వెంకటేశ్వరస్వామి పై ప్రమాణం చేసే దమ్ము ఉందా అంటూ ప్రశ్నిస్తున్నారు.

బాబాయ్ ని వేసేసింది అబ్బాయే అనడానికి ఇంతకన్నా ఏం కావాలి: అయ్యన్న పాత్రుడు
మాజీమంత్రి టీడీపీ సీనియర్ నాయకుడు అయ్యన్నపాత్రుడు మౌనానికి అర్థం అంగీకారమే అని అభిప్రాయపడ్డారు. బాబాయ్ ని వేసేసింది అబ్బాయే అనడానికి ఇంతకన్నా ఏం కావాలి అని ప్రశ్నించారు . లోకేష్ విసిరిన సవాలుకు సమాధానం చెప్పాలన్నారు. 14వ తేదీన వెంకన్న సాక్షిగా ప్రమాణం చేయడానికి సిద్ధం అంటూ ప్రశ్నించారు. టిడిపి సీనియర్ నేత అయ్యన్నపాత్రుడు బాబాయ్ హత్య తో సంబంధం లేకపోతే పులివెందుల పిల్లి మ్యావ్ అని ఎందుకు పారిపోయింది ? అంటూ సెటైర్లు వేశారు.

లోకేష్ సవాల్ కు జగన్ పరార్ : మాజీ మంత్రి జవహర్
ప్రతిదానికి గట్టిగా అరిచి, రచ్చ చేసే బులుగు బ్యాచ్ ఎందుకు సైలెంట్ అయింది అంటూ అయ్యన్నపాత్రుడు ప్రశ్నించారు . ఇక ఇదే సమయంలో టిడిపి నేత మాజీ మంత్రి జవహర్ సైతం లోకేష్ సవాల్ పై వైసిపి సమాధానం చెప్పాలన్నారు. ట్విట్టర్ వేదికగా సీఎం జగన్మోహన్ రెడ్డి పై విమర్శలు గుప్పించిన జవహర్ లోకేష్ సవాల్ కు జగన్ పరార్ అంటూ ఆసక్తికర పోస్ట్ చేశారు. ఇక్కడే తేలిపోయింది .. వివేకా హత్య వెనుక ఉన్న మిస్టరీ ఏంటో అంటూ లోకేష్ సవాల్ పై స్పందించని జగన్ తీరును ఎండగట్టారు.

హూ కిల్డ్ బాబాయ్? 14వ తేదీన తేలిపోతుంది
మీకు మీ కుటుంబ సభ్యులకు సంబంధం లేకపోతే వెంకన్న సాక్షిగా ప్రమాణం చేయడానికి ఎందుకు వెనుకాడుతున్నారు జగన్ రెడ్డి గారు అంటూ జవహర్ ఎద్దేవా చేశారు. హూ కిల్డ్ బాబాయ్? 14వ తేదీన తేలిపోతుంది .. లోకేష్ రెడీ , జగన్ రెడ్డి సిద్ధమేనా అంటూ జవహర్ ప్రశ్నించారు. మొత్తానికి వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసును వదిలిపెట్టకుండా టిడిపి నాయకులు జగన్ ను టార్గెట్ చేస్తూ రచ్చ కొనసాగిస్తున్నారు. వెంకన్న సాక్షిగా సత్య ప్రమాణానికి సవాల్ చేస్తున్నారు.

ఏపీలో వివేకా హత్యకేసు రగడ ... జగన్ పై టీడీపీ విమర్శలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాజీమంత్రి, ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి బాబాయ్ వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసుపై ఆయన కుమార్తె సునీత రెడ్డి చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో మరోమారు వివేకా హత్య కేసు తెరమీదికి వచ్చింది. ఇక అధికార పార్టీని, సీఎం జగన్ మోహన్ రెడ్డిని టార్గెట్ చేస్తూ ప్రతిపక్ష పార్టీలు వైయస్ వివేకా హత్య కేసుని ఇప్పటివరకు తేల్చలేదని విమర్శలు గుప్పిస్తున్నాయి. ఇదే సమయంలో వైఎస్ వివేకా హత్య వెనుక వైసీపీ నేతలే ఉన్నారంటూ పరోక్ష వ్యాఖ్యలు చేస్తూ జగన్ ను టార్గెట్ చేస్తున్నారు టిడిపి నేతలు.