అడ్డు లేదు!?: టిడిపిలో నెం. 2గా ఎదుగుతున్న లోకేష్

Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు తనయుడు నారా లోకేష్ పార్టీలో రెండో నెంబర్‌గా ఎదుగుతున్నారనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇప్పటికే పార్టీలో కీలకంగా మారి పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటున్న లోకేష్.. ఏ సమస్య వచ్చినా తానే స్వయంగా చూసుకుంటున్నారు.

చంద్రబాబునాయుడు తన తర్వాత పార్టీ బాధ్యతలను లోకేష్‌కే అప్పగించే అవకాశాలున్న నేపథ్యంలో టిడిపిలో ముఖ్య నేతగా చలామణి అవుతూ.. పార్టీ నేతల మధ్య సయోధ్యను కుదుర్చడంలో ముందుంటున్నారు. ప్రస్తుతం టిడిపి సమన్వయ కమిటీ అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్న లోకేష్.. అటు పార్టీ కార్యకలాపాలను, ఇటు ప్రభుత్వ కార్యక్రమాలను సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు.

లోకేష్ నేతృత్వంలోని 10మంది సభ్యుల ఈ కమిటీ పార్టీ సీనియర్ నేతలనే గాక, ప్రభుత్వంలో మంత్రులుగా కొనసాగుతున్న వారి పనితీరును కూడా సమీక్షిస్తోంది. ఈ కమిటీకి అధ్యక్షుడిగా లోకేష్‌ను ప్రకటించి.. చంద్రబాబునాయుడు తన తర్వాత లోకేషే(చినబాబు) తన బాధ్యత నిర్వహిస్తారని చెప్పకనే చెప్పినట్లు టిడిపి వర్గాలు చెబుతున్నాయి.

ఈ నేపథ్యంలో తొలిసారి లోకేష్ అధ్యక్షతన జరిగిన సమన్వయ కమిటీ సమావేశంలో పార్టీ సీనియర్ నేతలు యనమల రామకృష్ణుడు, కళా వెంకట్రావ్, డిప్యూటీ సీఎం చినరాజప్ప, మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, తదితరులు హాజరయ్యారు. ఇప్పటి వరకు టిడిపి ప్రభుత్వంలో యనమల రామకృష్ణుడు నెంబర్ 2గా కొనసాగుతుండగా, పార్టీ ఏపీ అధ్యక్షుడిగా కళా వెంకట్రావ్ ఉన్నారు.

కాగా, గత వారం కూడా లోకేష్ మరో సమన్వయ కమిటీ సమావేశానికి అధ్యక్షుడిగా వ్యవహరించారు. ఈ సమావేశంలో తెలంగాణ తెలుగుదేశం పార్టీకి చెందిన సీనియర్ నాయకులు రావుల చంద్రశేఖర్ రెడ్డి, టిటిడిపి అధ్యక్షుడు ఎల్ రమణ, వర్కింగ్ కమిటీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, తదితర నేతలు పాల్గొన్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో నిర్వహించిన సమన్వయ కమిటీ సమావేశాలకు కూడా నారా లోకేష్ అధ్యక్షత వహించి పార్టీ కార్యక్రమాలపై నేతలతో చర్చించారు.

Lokesh emerges as No. 2 in TDP

'ప్రస్తుతం లోకేష్ ప్రభుత్వ, పార్టీ కార్యక్రమాలపై ఎలాంటి ఇబ్బంది లేకుండా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలతో సమీక్షిస్తున్నారు. సీనియర్ నేతలందరూ కూడా పార్టీకి సంబంధించిన ముఖ్య విషయాలను లోకేష్‌తో చర్చిస్తున్నారు. ఈ సందర్భంగా పార్టీ, ప్రభుత్వానికి సంబంధించిన విధాన నిర్ణయాలను లోకేష్ ప్రకటిస్తున్నారుై' అని ఓ మంత్రి తెలిపారు.

2012లో చంద్రబాబునాయుడు 'మీ కోసం' పాదయాత్ర చేసిన సమయంలో నారా లోకేష్ రాజకీయ ప్రస్థానం ప్రారంభమైంది. ఈ పాదయాత్ర 2014లో అధికారంలోకి రావడానికి చంద్రబాబుకు ఎంతో సహాయపడింది. టిడిపి అధికారంలోకి రావడం లోకేష్‌కు అనుకూలాంశంగా మారింది. ఈ క్రమంలో లోకేష్‌కు పార్టీ ప్రధాన కార్యదర్శి బాధ్యతలు అప్పగించారు చంద్రబాబు. ఆ తర్వాత జాతీయ కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టారు. అనంతరం పార్టీ తీసుకునే నిర్ణయాల్లో కీలకంగా వ్యవహరించే పొలిట్‌బ్యూరోలో చోటు దక్కించుకున్నారు.

ప్రస్తుతం తెలంగాణ, ఏపీ రాష్ట్రాల్లో టిడిపి కార్యకలాపాల సమన్వయకర్తగా లోకేష్ వ్యవహరిస్తున్నారు. చంద్రబాబు తర్వాత పార్టీలో కీలక నేతలుగా ఎదిగిన యనమల రామకృష్ణుడు, అశోక్ గజపతికృష్ణుడు తమ రాజకీయ జీవితంలో పార్టీకి సంబంధించి ఎలాంటి పదోన్నతులు ఉండకపోవచ్చని టిడిపి వర్గాలు చెబుతున్నాయి. అయితే, లోకేష్‌పై చంద్రబాబునాయుడు తీసుకున్న నిర్ణయానికి ఈ ఇద్దరు నేతల ఆమోదం కూడా ఉందని తెలుస్తోంది.

మరికొందరు సీనియర్ నేతలు కళా వెంకట్రావ్, కెఈ కృష్ణమూర్తి, చిన్నరాజప్ప, తదితరులు లోకేష్ నాయకత్వంలో పని చేసేందుకు తామంతా సిద్ధమేనని ఇప్పటికే ప్రకటించడంతో లోకేష్‌కు ఎలాంటి ఇబ్బంది లేకుండా పోయింది. పార్టీ కార్యకలాపాలను పూర్తిగా లోకేష్‌కు అప్పగించి.. రాజధాని నిర్మాణంపైనే దృష్టి కేంద్రీకరించాలని చంద్రబాబు నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.

కుటుంబ పార్టీ అనే ఆరోపణలు వస్తాయని మొదట పార్టీ వ్యవహారాలన్నింటినీ లోకేష్‌కు అప్పగించేందుకు చంద్రబాబు వెనకాడినప్పటికీ.. పార్టీలో ఇతర నేతల నుంచి ఎలాంటి వ్యతిరేకత రాకపోవడంతో చంద్రబాబు స్వేచ్ఛగా లోకేష్‌కు పార్టీ బాధ్యతలను అప్పగించారు.

అయితే, టిడిపి వ్యవస్థాపక అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి దివంగత నేత ఎన్టీఆర్ పెద్ద కుమారుడు, మాజీ ఎంపీ హరికృష్ణ మాత్రం ఈ విషయంపై ఇప్పటి వరకు స్పందించలేదు. ప్రస్తుతం ఆయన పొలిట్‌బ్యూరో సభ్యులుగా కొనసాగుతున్నారు. హరికృష్ణ కుమారుడు జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం పార్టీకి దూరంగా ఉంటూ సినిమాలపైనే దృష్టి సారిస్తున్నారు. అయితే, పార్టీకి అవసరమైనప్పుడు తాను సిద్ధంగా ఉంటానని గతంలో పలుమార్లు చెప్పిన విషయం తెలిసిందే.

ఇది ఇలా ఉండగా, ఎన్టీఆర్ కూతురు మాత్రం బిజెపిలో కీలక నేతగా కొనసాగుతున్నారు. ఎన్టీఆర్ మరో కుమారుడు బాలకృష్ణ హిందూపురం టిడిపి ఎమ్మెల్యేగా ఉన్నారు. లోకేష్.. బాలకృష్ణకు సొంత అల్లుడే కావడంతో ఇక్కడ్నుంచి కూడా ఎలాంటి వ్యతిరేకతలు వచ్చే అవకాశం లేదు. దీంతో లోకేష్ టిడిపిలో నెంబర్ 2గా చలామణికి ఎలాంటి ఆటంకాలు లేవని చెప్పవచ్చు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
It is now clear that Nara Lokesh, son of Chandrababu Naidu, is the unopposed number 2 in the Telugu Desam Party.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి