జగన్ సర్కార్ పట్టింపులేకనే గురుకులాలు మృత్యుకేంద్రాలుగా; పాము కాటు ఘటనపై లోకేష్ ఆగ్రహం
విజయనగరం జిల్లా కురుపాంలో విషాద ఘటన చోటుచేసుకుంది.జ్యోతిరావు పూలే బీసీ గురుకుల పాఠశాలలో నిద్రిస్తున్న 8వ తరగతి విద్యార్థులను పాము కాటు వేసింది. అర్ధరాత్రి గదిలో నిద్రిస్తున్న ముగ్గురు విద్యార్థులను పాము కాటు వేసిన ఘటనలో ఒక విద్యార్థి మృతి చెందాడు. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది ప్రస్తుతం వారిద్దరూ విజయనగరం మహారాజా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఉపముఖ్యమంత్రి పుష్ప శ్రీ వాణి ఇలాకాలో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది.

పాము కాటుకు గురైన కురుపాం గురుకుల బాలుర పాఠశాల విద్యార్థులు, ఒకరి మృతి
మొదట పాముకాటుకు గురైన ముగ్గురు విద్యార్థులను కురుపాం ఏరియా ఆసుపత్రికి తరలించారు. అక్కడికి చేరుకునేసరికి రంజిత్ అనే విద్యార్థి మరణించాడు. ఏరియా ఆస్పత్రిలో ప్రథమ చికిత్స చేసిన తర్వాత మిగిలిన ఇద్దరిని మెరుగైన చికిత్స కోసం విజయనగరం మహారాజా ఆస్పత్రికి తరలించారు ప్రస్తుతం వారిలో ఒక విద్యార్ధి వెంటిలేటర్ పై ఉన్నట్టు సమాచారం. ప్రస్తుతం వారి పరిస్థితి కూడా ఆందోళనకరంగా ఉందని సమాచారం.

కన్నీరు మున్నీరు అవుతున్న తల్లిదండ్రులు, ఆస్పత్రికి వెళ్ళిన డిప్యూటీ సీఎంపుష్ప శ్రీవాణి
విద్యార్థులు పాముకాటుకు గురైన విషయం తెలిసిన తల్లిదండ్రులు ఆస్పత్రికి వచ్చి కన్నీరుమున్నీరవుతున్నారు. ఎన్నో ఆశలతో పెంచుకుంటున్న తమ పిల్లలు స్కూల్ లో పాము కాటుకు గురవటంపై ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమతో కలిసి చదువుకుంటున్న విద్యార్ధి విగతజీవిగా మారటంతో తోటి విద్యార్థులు సైతం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటన విషయం తెలిసి హుటాహుటిన డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి ఆస్పత్రికి వెళ్లి చికిత్స పొందుతున్న విద్యార్థుల పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు.వారికి మెరుగైన చికిత్స చెయ్యాలని సూచించారు.
పాము కాటు ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన నారా లోకేష్
ఇక దీనిపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సోషల్ మీడియా వేదికగా తమ స్పందనను తెలియజేశారు. మహాత్మ జ్యోతిరావు పూలే బీసీ గురుకుల పాఠశాలలో నిద్రిస్తున్న ఎనిమిదో తరగతి విద్యార్థిని పాము కాటు వేసిన ఘటన తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పేర్కొన్నారు. డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి సొంత నియోజకవర్గంలో ఈ ఘటన జరిగిందని, ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే బంగారు భవిష్యత్తు ఉన్న విద్యార్థి మృతి చెందడం బాధాకరమని ఆయన పేర్కొన్నారు.
Recommended Video

బాధ్యులపై క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలి
ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండటం తీవ్ర విచారకరమని, విద్యార్థులకు మెరుగైన చికిత్స అందించాలని నారా లోకేష్ పేర్కొన్నారు. బాధ్యులపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని లోకేష్ డిమాండ్ చేశారు. పిల్లల్ని సురక్షితంగా చూసుకోవలసిన గురుకులాలను జగన్ మోహన్ రెడ్డి పట్టించుకోవడంలేదని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వైయస్ జగన్ సర్కార్ పట్టించుకోకపోవడంతోనే గురుకులాలు మృత్యు కేంద్రాలుగా మారుతున్నాయి అని లోకేష్ అసహనం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో విద్యా వ్యవస్థ దుస్థితికి ఇది నిదర్శనమని లోకేష్ పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications