పోటాపోటీ యాత్ర!: ముందే చెప్పానన్న లోకేష్, జగన్ ఆగ్రహం
కర్నూలు/విజయవాడ: ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు తనయుడు నారా లోకేష్ పోటాపోటీగా ఏపీలో యాత్రలు చేస్తున్నారు! చంద్రబాబు పైన జగన్, వైసీపీ అధినేత పైన నారా లోకేష్ విమర్శలు గుప్పిస్తున్నారు.
మూడు సంవత్సరాల క్రితమే ప్రత్యక్ష రాజకీయాల్లో వస్తానని చంద్రబాబును కోరినట్లు లోకేష్ గురువారం కర్నూలు జిల్లాలో చెప్పారు. ఎన్నో త్యాగాలు చేస్తూ పార్టీని ముందుకు నడిపిస్తున్న కార్యకర్తలను ఆదుకునే బాధ్యతను తీసుకుంటేనే ప్రత్యక్ష రాజకీయాల్లో రావాలని తనకు చంద్రబాబు సూచించారన్నారు.
మాట తప్పం మడమ తిప్పబోమని తాము వట్టి మాటలు చెప్పమని, కార్యకర్తలకు అండగా ఉండి ఆదుకుంటామని లోకేష్ చెప్పారు. మాట తప్పం.. మడమ తిప్పమని జగన్ తరుచూ డైలాగ్ కొట్టే విషయం తెలిసిందే. లోకేష్ అదే వ్యాఖ్యలతో జగన్‌కు పరోక్షంగా కౌంటర్ ఇచ్చారు.

కార్యకర్తల సంక్షేమ యాత్రలో లోకేష్ కర్నూలులో పర్యటిస్తున్నారు. నగరంలోని చిత్తూరు వీధికి చెందిన పార్టీ కార్యకర్త కళావతమ్మ కుటుంబ సభ్యులను లోకేష్ పరామర్శించారు. వారికి రూ.2 లక్షల చెక్కును అందించారు. అనంతరం నంద్యాలలో చిక్కి కాలనీలో టీడీపీ కార్యకర్త మధు కుటుంబాన్ని పరామర్శించి, ఆర్థిక సాయం అందించారు.
చంద్రబాబుపై జగన్ ఆగ్రహం
రాయలసీమపై ముఖ్యమంత్రి చంద్రబాబుది కపట ప్రేమ అని జగన్ దుయ్యబట్టారు. బస్సుయాత్రలో భాగంగా గురువారం ప్రకాశం బ్యారేజిని జగన్ పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడారు. కేవలం ముడుపుల కోసమే పట్టిసీమ చేపట్టారని ఆరోపించారు. పట్టిసీమలో చంద్రబాబు రూ.300 కోట్ల ముడుపులు అందుతాయన్నారు.
రాయలసీమ పేరుతో చంద్రబాబు దొంగనాటకాలు ఆడుతున్నారన్నారు. కాంట్రాక్టర్లకు మేలు చేయడం కోసమే రాయలసీమ పేరు వాడుకుంటున్నారన్నారు. విజయవాడ ప్రకాశం బ్యారేజి నుంచి జగన్ బస్సుయాత్ర ప్రారంభించారు. ఈ సందర్భంగా బ్యారేజికి ఇరువైపులా ట్రాఫిక్ నిలిచిపోయి వాహనదారులు ఇబ్బందులకు గురయ్యారు.












Click it and Unblock the Notifications