జగన్ ను దాటేస్తున్న లోకేష్ - చంద్రబాబుకు కొత్త టెన్షన్..!!
యువగళం యాత్ర వేళ లోకేష్ సీఎం జగన్ దాటేస్తున్నారు. అదే ఇప్పుడు చంద్రబాబుకు టెన్షన్ గా మారుతోంది.
టీడీపీ నేత నారా లోకేష్ (Nara Lokesh) యువగళం ప్రారంభమై నెల రోజులు పూర్తవుతోంది. చిత్తూరు జిల్లా కుప్పంలో ప్రారంభమైన యాత్ర షెడ్యూల్ ప్రకారం కొనసాగుతోంది. తారకరత్న మరణంతో రెండు రోజులు యాత్రకు స్వల్ప విరామం ఇచ్చారు. ఈ నెల రోజుల యాత్రలో లోకేష్ కొత్త రాజకీయం ప్రదర్శిస్తున్నారు. ప్రభుత్వం..సీఎం జగన్ లక్ష్యంగా విరుచుకుపడుతున్నారు. వైసీపీ స్థానిక ఎమ్మెల్యేలపైన ఉన్న ఆరోపణలపైన స్పందిస్తున్నారు. సవాళ్లు చేస్తున్నారు. ఇదే సమయంలో పార్టీలో కొత్త చర్చకు లోకేష్ కారణమవుతున్నారు. కొన్ని సందర్భాల్లో జగన్ తన పాదయాత్ర సమయంలో వ్యవహరించిన తీరును దాటిపోయేలా లోకేష్ తీరు కనిపిస్తోందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. అదే ఇప్పుడు టీడీపీ అధినేత చంద్రబాబుకు కొత్త టెన్షన్ గా మారుతోంది.

రాజకీయ భవిష్యత్ కు కీలకంగా యువగళం
2014 ఎన్నికల సమయంలో పార్టీ గెలుపు కోసం సని చేసిన నారా లోకేష్...పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత క్రియాశీలకంగా మారారు. ప్రభుత్వంలో మంత్రిగా చేరిన తరువాత అటు పార్టీ- ఇటు ప్రభుత్వ వ్యవహారాల్లో కీలకంగా మారారదు. 2019 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. వచ్చే ఎన్నికల్లో తిరిగి మంగళగిరి నుంచి గెలవాలని లోకేష్ పట్టుదలతో ఉన్నారు. ఇక, వచ్చే ఎన్నికల్లో గెలుపు ప్రతిష్ఠాత్మకంగా మారిన వేళ..లోకేష్ యువగళం పేరుతో పాదయాత్ర ప్రారంభించారు. 400 రోజులు.. 4 వేల కిటో మీటర్ల మేర యాత్ర మొదలు పెట్టారు. నెల రోజులుగా చిత్తూరు జిల్లాలో లోకేష్ యాత్ర సాగుతోంది. ఈ యాత్ర సమయంలో లోకేష్ సామాజిక వర్గాల వారీ సమావేశాలు.. యూనియన్లతో మీటింగులు..స్థానికులతో చర్చలు వంటి ద్వారా ఆకట్టుకొనే ప్రయత్నాలు చేస్తున్నారు. అదే సమయంలో ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తున్నారు. పూర్తిగా 2019 ఎన్నికల ముందు జగన్ పాదయాత్ర సమయంలో వ్యవహరించిన తీరులోనే ఇప్పుడు లోకేష్ వెనుక ఐ ప్యాక్ ఈ సమావేశాల నిర్వహణలో కీలకంగా ఉందని తెలుస్తోంది.

జగన్ తరహాలో లోకేష్ హామీల వర్షం
లోకేష్ తన నెల రోజుల పాదయాత్రలో ఇచ్చిన..కొనసాగిస్తున్న హామలు ఇప్పుడు కొత్త చర్చకు కారణమవుతున్నాయి. నాడు పాదయాత్ర సమయంలో తాను అధికారంలోకి వస్తే ఏం చేస్తాననేది జగన్ స్పష్టత ఇచ్చారు. స్థానిక..ఇతర సమస్యల పైన పరిష్కరిస్తాననే నమ్మకం కల్పించారు. అధికారంలోకి వచ్చిన తరువాత జగన్ నవరత్నాల పేరుతో తాను పాదయాత్రలో చెప్పిన అంశాలను అమలు చేస్తున్నారు. ఇతర హామీలను అమలుకు ప్రాధాన్యత ఇచ్చారు. ఇక, లోకేష్ తన నెల రోజుల పాదయాత్రలో అనేక హామీలు గుప్పించారు. బీస సంఘాల సమావేశంలో వడ్డెర కులస్థులను ఎస్టీల కేటగిరీలో చేరుస్తామని చెప్పారు. ముస్లిం కాలేజీ ఏర్పాటుకు హామీ ఇచ్చారు. వృద్ధాప్య పింఛన్ ను పెంచుతామని హామీ ఇచ్చారు. ఉద్యోగాల కల్పన పైన ఆశలు పెంచారు. స్థానికంగా ఉన్న సమస్యల పరిష్కారానికి మాట ఇస్తున్నారు. ప్రస్తుతం వృద్ధాప్య పింఛన్ రూ 2,750 ఇస్తున్నారు. వచ్చే ఏడాది జనవరి నుంచి మూడు వేలకు పెరగనుంది. ఇప్పుడు లోకేష్ ఈ ఫించన్ మరింత పెంచుతామని చెప్పటం కొత్త చర్చకు దారి తీస్తోంది.

లోకేష్ హామీలు - చంద్రబాబుకు టెన్షన్
లోకేష్ ఇస్తున్న హామీల చిట్టా పైన టీడీపీలో కొత్త టెన్షన్ కనిపిస్తోంది. నాడు జగన్ తన పాదయాత్రలో ప్రధానంగా టీడీపీ ఇచ్చిన హామీలు ఏవీ నెరవేర్చలేదంటూ వ్యక్తిగతంగా చంద్రబాబు విశ్వసనీయను దెబ్బ తీసే ప్రయత్నం చేసారు. తాను ఇచ్చిన హామీల అమలు ద్వారా మాట నిలబెట్టెకుంటాననే నమ్మకం కోసం ప్రయత్నిస్తున్నారు. ఇప్పుడు లోకేష్ ఒక్క జిల్లా పాదయాత్రలోనే ఇన్ని హామీలు ఇచ్చారు. ఇంకా 12 ఉమ్మడి జిల్లాలో పాదయాత్ర చేయాల్సి ఉంది. ఇక..జనసేన తో పొత్తు వేళ ఆ పార్టీ నుంచి కొన్ని హామీలు మేనిఫెస్టోలో చేర్చాల్సి ఉంటుంది. జగన్ కంటే మెరుగ్గా పాలన చేస్తామనే విధంగా సంక్షేమ పథకాల లబ్ది పెంచి హామీలుగా ప్రస్తావించాల్సిన అవసరం ఉంది. ఇదే సమయంలో ఏపీ ఆర్దిక పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. దీనికి తోడు ఇప్పుడు లోకేష్ ఇస్తున్న హామీలు మరింత భారంగా మారే అవకాశం కనిపిస్తోంది. మరి.. లోకేష్ తన హామీల వర్షం కొనసాగిస్తారా..చంద్రబాబు సూచనలు చేస్తారా అనేది చూడాల్సి ఉంది.












Click it and Unblock the Notifications