"జైలుకు వెళ్లొచ్చిన జగన్ నాయకత్వాన్ని ఎవరైనా అంగీకరిస్తారా?"
విజయవాడ : అధికార పార్టీలో ఉన్న నేతను పట్టుకుని ప్రత్యర్థి పార్టీ అధినేతను ఆదర్శంగా తీసుకుంటారా? అని ప్రశ్నిస్తే ఎలా ఉంటుంది. సరిగ్గా ఇదే ప్రశ్న అడిగారు సిద్దార్థ కాలేజీ విద్యార్థులు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్.. సిద్దార్థ కాలేజీ విద్యార్థులతో ముఖాముఖిలో పాల్గొనగా.. జగన్, చంద్రబాబులలో ఎవరిని అనుసరిస్తారని ప్రశ్నించారు విద్యార్థులు.
దీనిపై స్పందిస్తూ..వేల కోట్ల రూపాయల అవినీతి చేసి, 12 మందిని జైలుకి పంపి, స్వయంగా జైలుకు వెళ్లిన వ్యక్తి నాయకత్వంలో నడవడాన్ని ఎవరైనా అంగీకరిస్తారా? అని బదులు ప్రశ్నించారు లోకేష్. సరైన నాయకత్వంలో నడిచే ఎవరైనా అభివృద్ధి చెందగలరని తెలిపారు. రాష్ట్రాభివృద్ధికి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అహర్నిశలు శ్రమిస్తున్నారని పేర్కొన్నారు.

ఇక విదేశాల్లో చదువుకున్న వ్యక్తిగా.. అమెరికాలో విద్యా విధానం ఎలా ఉందో వివరించాలంటూ విద్యార్థులు లోకేష్ ను ప్రశ్నించగా.. భారతీయ విద్యావ్యవస్థకు, అమెరికన్ విద్యావ్యవస్థకు చాలా వ్యత్యాసముందని లోకేష్ అభిప్రాయపడ్డారు. భారతీయ విద్యావ్యవస్థలో ఎక్కువ కాలం చదవలేదు కనుక దీనిపై ఒక స్పష్టమైన అభిప్రాయం చెప్పడం ఇబ్బందితో కూడుకున్నదేనని చెప్పుకొచ్చారు.
ఇలా మాట్లాడుతుండగానే.. తన విదేశీ విద్యపై ప్రతిపక్ష పార్టీ అనేక ఆరోపణలు చేస్తుందనడంతో.. విద్యార్థులంతా నవ్వేశారు. అమెరికన్ విద్యా విధానంలో బట్టీ విధానం కన్నా అప్లికేషన్ ఎక్కువగా ఉండడంతో.. అక్కడి విద్యా విధానం మెరుగ్గా ఉందని తెలియజేశారు.












Click it and Unblock the Notifications