ఏపీకి మరో గండం: బంగాళాఖాతంలో సుడులు తిరుగుతూ..అంతకంతకూ: 18న దక్షిణ కోస్తా తీరానికి
విశాఖపట్నం: రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికే భారీ వర్షాలు కురిశాయి. శ్రీకాకుళం నుంచి చిత్తూరు జిల్లా దాకా వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. చెరువులు నిండుకుండల్లా మారిపోయాయి. వరదనీటితో పోటెత్తాయి. ఇప్పుడిప్పుడే వర్షాల తీవ్రత తగ్గుముఖం పట్టింది. ఊపిరి పీల్చుకునే లోపే మరోసారి భారీ వర్షాలు రాష్ట్రాన్ని ముంచెత్తనున్నాయి. మరిన్ని అతి భారీ వర్షాలను ఎదుర్కొనడానికి ప్రజలు సంసిద్ధంగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది.

మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం..
ఏపీ దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో కుండపోతగా వర్షం కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ కేంద్రం అధికారులు హెచ్చరించారు. అండమాన్ తీర ప్రాంతానికి సమీపంలో మధ్య బంగాళాఖాతంలో ఇవ్వాళ తాజాగా అల్పపీడనం ఏర్పడింది. క్రమంగా ఇది వాయుగుండంగా మారే అవకాశం ఉంది. అనంతరం ఇది ఆగ్నేయ దిశగా ప్రయాణిస్తుంది. ఈ నెల 18వ తేదీ నాటికి ఏపీ దక్షిణ తీర ప్రాంతం, కోస్తా జిల్లాలను సమీపిస్తుందని భారత వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు.

18 నుంచి..
ఈ క్రమంలో ఈ వాయుగుండం మరింత తీవ్ర రూపాన్ని దాల్చుతుందని, తుఫాన్‌గా రూపాంతరం చెందడానికి అనుకూల వాతావరణం నెలకొని ఉందని అంచనా వేశారు. ఈ వాయుగుండం ప్రభావంతో ఈ నెల 18వ తేదీ నుంచి ఏపీ దక్షిణ కోస్తా జిల్లాలు, రాయలసీమల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొన్నారు. 17వ తేదీ నుంచి సముద్రం అల్లకల్లోలంగా మారుతుందని స్పష్టం చేశారు. ముందస్తు హెచ్చరికలను జారీ చేశారు.
మత్స్యకారులెవరూ సముద్రంలో వెళ్లొద్దంటూ
నాలుగైదు రోజుల పాటు మత్స్యకారులెవరూ బంగాళాఖాతంలో ఆగ్నేయదిశగా చేపలవేటకు వెళ్లకూడదని సూచించారు. ఏపీ దక్షిణ ప్రాంతం వైపు చేపలవేటకు వెళ్లొద్దని పేర్కొన్నారు. ఇప్పటికే వెళ్లిన మత్స్యకారులు వెంటనే తీరానికి చేరుకోవాలని చెప్పారు. ఇదివరకు ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో ఏపీ సహా తమిళనాడు, దక్షిణ కర్ణాటక, యానాం, పుదుచ్చేరి, కరైకల్‌లల్లో భారీ వర్షాలు పడ్డాయి. చెన్నై మళ్లీ మునిగిపోయింది.

కేరళ, తమిళనాడుపైనా..
తాజాగా ఏర్పడిన అల్పపీడనం ప్రభావం తమిళనాడుపై సైతం ఉంటుందనే అంచనాలు ఉన్నాయి. ఏపీ దక్షిణ కోస్తా జిల్లాలతో పాటు, దానికి ఆనుకుని ఉన్న తమిళనాడు, చెన్నైల్లోనూ ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు నమోదవుతాని అధికారులు పేర్కొన్నారు. రాయలసీమ, నెల్లూరు జిల్లాల్లో మరోసారి అతి భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేశారు. అటు కర్ణాటక, కేరళలపైనా ఈ వాయుగండం ప్రభావం పడే అవకాశాలు లేకపోలేదు. కేరళలోని ఎర్నాకుళం, ఇడుక్కి, త్రిశూర్, కోజికోడ్, కన్నూర్, కాసర్‌గోడ్ జిల్లాలపై దీని తీవ్రత ఉంటుంది.

17 నుంచి భారీ వర్షాలు పడే ఛాన్స్..
17వ తేదీ నాటికి ఏపీ దక్షిణ కోస్తా, తమిళనాడు ఉత్తర తీర ప్రాంత జిల్లాలపై ఈ తాజా అల్పపీడనం ప్రభావం ఉంటుందని స్పష్టం చేశారు. తీరానికి సమీపించే కొద్దీ ఇది వాయుగుండంగా మారుతుందని పేర్కొన్నారు. అనంతరం క్రమంగా బలహీనపడుతుందని చెప్పారు. ఈ తాజా అల్పపీడనం ప్రభావంతో నెల్లూరు, చిత్తూరు, కడప జిల్లాల్లో అతి భారీగా, ఇతర ప్రాంతాల్లో ఓ మోస్తరుగా వర్షపాతం నమోదవుతుందని అంచనా వేశారు. 17 నుంచి కనీసం రెండురోజుల పాటు ఈ వాయుగుండం తీవ్రత కనిపిస్తుందని అన్నారు.

జరభద్రం..
ఈ మేరకు వాతావరణ కేంద్రం అధికారులు తాజా సమాచారాన్ని సోషల్ మీడియాలో విడుదల చేశారు. ఈ రెండు రాష్ట్రాల తీర ప్రాంతవాసులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రాణ నష్టాన్ని నివారించడానికి తక్షణ చర్యలను తీసుకోవాల్సి ఉంటుందని సూచించారు. వర్షాలు పడనున్నందున పాత ఇళ్లల్లో నివసించే వారు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.












Click it and Unblock the Notifications