బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీకి కష్టాలే
ఒకవైపు చలి, మరోవైపు వర్షాలతో ఏపీ ప్రజలు విచిత్రమైన వాతావరణం మధ్య జీవితాలను కొనసాగిస్తున్నారు. ముసురేసిన వాతావరణంతో చలికి గజగజలాడుతున్నారు. వారం రోజుల నుంచి రాష్ట్రంలో ఇదే పరిస్థితి నెలకొంది. తాజాగా బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో ఉపరితల ఆవర్తనం ఏర్పడినట్లు విశాఖపట్నం వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. ఒకటిన్నర కిలోమీటర్ల మేర ఈ ఆవర్తనం ఉండటంతో గంటకు 60 నుంచి 70 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచే అవకాశం ఉంది. మత్స్యాకారులెవరూ సముద్రంలో వేటకు వెళ్లొద్దని, జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచించారు.
పోర్టుల వద్ద మూడో ప్రమాద హెచ్చరిక
సునామీ వచ్చి 20 సంవత్సరాలు పూర్తికావడంతో మత్స్యకారులంతా విశాఖపట్నం సముద్రతీరంలో గురువారం పూజలు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఇటువంటి తరుణంలోనే బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడటంతో రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. రాబోయే రెండురోజులు రాష్ట్రంలో వర్షాలున్నాయని అధికారులు పేర్కొన్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ అధికారులు కూడా సూచించారు. ఒకవేళ అనుకోని పరిస్థితులు ఎదురైతే అందుకు తగినట్లుగా వాటిని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, అవసరమైతేనే ఇళ్లల్లో నుంచి బయటకు రావాలన్నారు. రాష్ట్రంలోని పోర్టులవద్ద మూడో ప్రమాద హెచ్చరికలు జారీచేశారు.

నెల్లూరుపై ఎక్కువగా ఉండే అవకాశం
అల్పపీడన ప్రభావం నెల్లూరు జిల్లాపై తీవ్రంగా ఉండే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. రైతులు అప్రమత్తంగా ఉండాలని, వీలైతే పంటను ఇంటికి చేర్చుకోవాలని సూచిస్తున్నారు. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా సంక్రాంతికి ఇంటికి రావల్సిన ధాన్యాన్ని రైతులు నెలరోజులు ముందుగానే కోతలు కోసేశారు. పొలాల్లో వరికుప్పలను వేశారు. ఈ తరుణంలో వర్షం పడితే నష్టపోతామని, తడిసిన ధాన్యాన్ని గిట్టుబాటు ధరకే ప్రభుత్వం కొనుగోలు చేయాలని అన్నదాతలు కోరుతున్నారు. ధాన్యంలో 25 శాతం తేమ ఉన్నప్పటికీ గిట్టుబాటు ధరకే కొనుగోలు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఇప్పటికే అధికారులకు ఆదేశాలు జారీచేశారు. ఆమేరకే ధాన్యం కొనుగోళ్లు కూడా జరుగుతున్నాయి. కొనుగోలు జరిగిన 48 గంటల్లో ప్రభుత్వం రైతులకు డబ్బులు జమచేస్తోంది.












Click it and Unblock the Notifications