జగన్ పిల్లలు లండన్, ప్యారిస్‌లో..: తాను కన్నెర్ర చేస్తే అంటూ వైసీపీకి చంద్రబాబు తీవ్ర హెచ్చరిక
చిత్తూరు: ఏపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు ఎక్కుపెట్టారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. చిత్తూరు జిల్లా మదనపల్లెలో ఎన్టీఆర్ స్ఫూర్తి-చంద్రన్న భరోసా పేరుతో టీడీపీ మినీ మహానాడు భారీ బహిరంగ సభ నిర్వహించింది. పెద్ద ఎత్తున తరలివచ్చిన ప్రజలనుద్దేశించి చంద్రబాబు మాట్లాడారు. జగన్ సర్కారుపై విమర్శలు గుప్పిస్తూనే.. తీవ్ర హెచ్చరికలు చేశారు.

ఏపీలో అరాచక పాలన.. నవఘోరాలంటూ చంద్రబాబు
ఏపీలో మూడేళ్లుగా అరాచక పాలనపై పోరాటం చేస్తున్నామన్నారు. ఎక్కడ చూసినా సమస్యలే, లేని సమస్యలు సృష్టిస్తున్నారని చంద్రబాబు మండిపడ్డారు. ప్రశ్నించినవారిని బెదిరించి కేసులు పెడుతున్నారన్నారు. తాము కన్నెర్ర చేస్తే వైసీపీ నాయకులు ఇంటి నుంచి బయటకు రాలేరని హెచ్చరించారు. పోలీసులను అడ్డంపెట్టుకుని ఏమీ సాధించలేరన్నారు. నవరత్నాలు పేరుతో నవ ఘోరాలు చేస్తోందని చంద్రబాబు మండిపడ్డారు.

నేను తలుచుకుంటే జగన్ పాదయాత్ర చేసేవారా?: చంద్రబాబు
తాము తలచుకుంటే వైఎస్ జగన్ పాదయాత్ర చేసేవారా? అని చంద్రబాబు నిలదీశారు. తాను ప్రజాస్వామ్య వాదిని...చేతగాని వ్యక్తిగా చూడవద్దంటూ హెచ్చరించారు. అప్పుడు ఊరురా తిరిగి ముద్దులు పెట్టి.. ఇప్పుడేమో ప్రజలపై పిడిగుద్దులు గుద్దుతున్నారన్నారు. పేద పిల్లలు బాగా చదువుకోవాలని కోరుకునే పార్టీ టీడీపీ అని అన్నారు. తమ హయాంలో ప్రతి గ్రామంలోనూ పాఠశాలలు కట్టించామన్నారు. అమ్మ ఒడికి ఆంక్షలు పెట్టి తల్లులను మోసం చేస్తున్నారని మండిపడ్డారు. టీడీపీ ఎప్పుడూ ప్రజల పార్టీనేనని స్పష్టం చేశారు.

జగన్ లక్షా 75వేల కోట్ల అవినీతికి పాల్పడ్డారంటూ చంద్రబాబు
సీఎం వైఎస్ జగన్ లక్షా 75 వేల కోట్ల అవినితీకి పాల్పడ్డారని చంద్రబాబు ఆరోపించారు. అమ్మ ఒడి బూటకం, ఇంగ్లీష్ మీడియం నాటకం, నాడు-నేడు అవినీతి మయం అని చంద్రబాబు విమర్శలు గుప్పించారు. వైసీపీ ప్రభుత్వం వచ్చాక అన్నింటిపై బాదుడే బాదుడని అన్నారు. ఆర్టీసీ ఛార్జీలు పెంచి పేదలపై తీవ్ర భారం మోపారన్నారు. మళ్లీ గ్యాస్ సిలిండర్ ధర పెంచారని, నిత్యావసర వస్తువుల ధరలు పెరిగాయన్నారు. కొత్త బ్రాండ్ల పేరుతో నాసిరకం మద్యం తెస్తున్నారని, ల్యాబ్ పరీక్షలో మద్యంలో రసాయనాలు ఉన్నాయని తేలిందన్నారు.
జగన్ సొంత డిస్టిలరీలు పెట్టుకుని రేట్లు పెంచారని ఆరోపించారు. మూడేళ్లలో ఐదుసార్లు విద్యుత్ ఛార్జీలు పెంచారన్నారు. జాబ్ క్యాలెండర్ ఏమైందని ప్రశ్నించారు. కొత్తగా రూ. 5వేల కోట్ల వృత్తిపన్ను వేస్తున్నారని మండిపడ్డారు. ఈ అరాచక పాలనపై ప్రతి ఒక్కరూ పోరాడాలని చంద్రబాబు పిలుపునిచ్చారు.

జగన్ కుమార్తెలు ప్యారిస్, లండన్‌లో..: చిత్రగుప్తడిలా అంటూ చంద్రాబు
జగన్ కుమార్తెలు ప్యారిస్‌లో, లండన్‌లో చదవాలి.. మన పిల్లలు వాగులు వంకలు దాటి వెళ్లాలా? జగన్ పెట్టిన ప్రతి కేసుపై చిత్ర గుప్తుడిలా లెక్కలు రాస్తున్నా...అధికారం లోకి వచ్చిన తరువాత అన్నింటికీ తిరిగి చెల్లిస్తాం. రాజంపేట పార్లమెంట్ లో రౌడీయిజం చెయ్యడానికి ఈ ప్రాంతం ఈ మంత్రి జాగీరు కాదు. పుంగనూరులో దాడులు చేస్తున్నారు.. తంబళ్ల పల్లిలో అక్రమ కేసులుపెట్టి అరెస్టు చేశారు. టీడీపీ నేతలపై దాడులు పిరికిపంద చర్యలు కాదా...మాకు దాడి చెయ్యడం రాదా? పదవులు, కాంట్రాక్టులు, ఇసుక, లిక్కర్ అన్ని ఈ మంత్రికే రావాలి. ఇక్కడ ప్రతిపాదించిన పనులు ప్రజల కోసం కాదు...ఈ వైసిపి నాయకుల కోసం. ప్రభుత్వంలో ఉన్న వ్యక్తులు సొంత కంపెనీలకు పనులు ఇవ్వవచ్చా? అని చంద్రబాబు నిలదీశారు.