చంద్రబాబు అరెస్ట్ వెనుక సీఎం కేసీఆర్, పీఎం మోడీ; ఇది ౩పార్టీల మ్యాచ్ ఫిక్సింగ్!!
చంద్రబాబు అరెస్టుపై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మధుయాష్కీ సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు అరెస్టు వెనుక సీఎం కేసీఆర్, ప్రధాని నరేంద్ర మోడీ ఉన్నారని ఆయన పేర్కొన్నారు. చంద్రబాబు అరెస్ట్ వెనుక కేసీఆర్, మోడీ పాత్రలపై తమ వద్ద పూర్తి సమాచారం ఉందని మధుయాష్కీ షాకింగ్ వ్యాఖ్యలు చేశారు.
చంద్రబాబు అరెస్టుపై ఇప్పటివరకు కేసీఆర్ ఎందుకు స్పందించలేదు అంటే ఇందుకే అంటూ పేర్కొన్న మధుయాష్కి చంద్రబాబు నాయుడు గతంలో బిజెపికి వ్యతిరేకంగా పనిచేశాడని, అందుకే ప్రధాని, కెసిఆర్ తో కలిసి చంద్రబాబును జైలుకు పంపించారని మధు యాష్కి పేర్కొన్నారు. బిజెపి, బీఆర్ఎస్, వైసిపి మూడు పార్టీలు మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకున్నాయని మధుయాష్కీ సంచలన ఆరోపణలు చేశారు. చంద్రబాబుకు బెయిల్ రాకుండా ఇరువురు నేతలు అడ్డుకున్నారని మధు యాష్కీ ఆరోపించారు.

ఇప్పటివరకు చంద్రబాబు నాయుడు ని అరెస్ట్ చేసిన విషయంపై జాతీయ నాయకులు కూడా స్పందించారని కానీ సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ ఎందుకు స్పందించడం లేదని మధు యాష్కి ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి వచ్చి హైదరాబాద్లో సెటిల్ అయిన వారు చంద్రబాబు కోసం ర్యాలీ చేశారని పేర్కొన్న ఆయన, ఈ ర్యాలీలో ఎల్బీనగర్ ఎమ్మెల్యే ఎందుకు పాల్గొన్నారో చెప్పాలని ప్రశ్నించారు.
ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి కేవలం వాళ్ల ఓట్ల కోసమే ర్యాలీలో పాల్గొన్నారని, మేక తోలు కప్పుకున్న పులిలా వ్యవహరించారని మధుయాష్కి పేర్కొన్నారు. అసలు సుధీర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ, చంద్రబాబు దయతోనే అప్పట్లో గెలిచారని మధుయాష్కి అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇప్పటివరకు బిజెపికి వ్యతిరేకంగా ఎవరైతే మాట్లాడతారో వారి పైన అక్రమ కేసులు బనాయించి జైలుకు పంపారన్నారు.

బీజెపికి అనుకూలంగా ఉన్నవారు కుంభకోణాలు చేసినా అరెస్టు కూడా చేయడం లేదని మధుయాష్కి పేర్కొన్నారు. ఢిల్లీ లిక్కర్ స్కాం లో ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన నేత, ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియా ని అరెస్టు చేయించి జైలుకు పంపారని, ఇప్పుడు చంద్రబాబును సైతం అరెస్టు చేయించి జైల్లో కూర్చోబెట్టారని పేర్కొన్న మధు యాష్కి ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఎమ్మెల్సీ కవితను ఎందుకు అరెస్ట్ చేయలేదో చెప్పాలంటూ ప్రశ్నించారు.












Click it and Unblock the Notifications