గుంటూరు, విజయవాడ నుంచి కుంభ మేళాకు ప్రత్యేక రైళ్లు- టైమింగ్స్ ఇవే
Maha Kumbh 2025: మహా కుంభ మేళా 2025 అంగరంగ వైభవంగా కొనసాగుతోంది. రెండో రోజు పండగ వాతావరణం నెలకొంది. మకర సంక్రాంతిని పురస్కరించుకుని లక్షలాది మంది భక్తులు ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ వద్ద గంగా-యమున-సరస్వతి త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలను ఆచరిస్తోన్నారు. తమ మొక్కులు చెల్లించుకుంటోన్నారు.
వేల సంఖ్యలో రైళ్లు..
పవిత్ర స్నానాలను ఆచరించడానికి ప్రయాగ్‌రాజ్ వెళ్లే భక్తుల కోసం రైల్వే శాఖ రంగంలోకి దిగింది. వేల సంఖ్యలో అదనపు రైళ్లను అందుబాటులోకి తీసుకొస్తోంది. దేశవ్యాప్తంగా అన్ని ప్రధాన నగరాల నుంచి ప్రత్యేక రైళ్లను నడిపిస్తోంది. 13,000లకు పైగా ప్రత్యేక రైళ్లు ఆయా నగరాల నుంచి ప్రయాగ్‌రాజ్‌కు రాకపోకలు సాగించనున్నాయి.

ఏపీ నుంచీ..
తాజాగా దక్షిణ మధ్య రైల్వే అధికారులు ఏపీ నుంచి ప్రయాగ్‌రాజ్ మీదుగా వివిధ నగరాలకు ప్రత్యేక రైళ్లను నడిపించనున్నారు. దీనికి సంబంధించిన తేదీలను వెల్లడించారు. గుంటూరు, విజయవాడ, కాకినాడ టౌన్, మచిలీపట్నం నుంచి ప్రయాగ్‌రాజ్ మీదుగా వేర్వేరు నగరాలకు ఈ రైళ్లు రాకపోకలు సాగించనున్నాయి.
గుంటూరు- ఆజంగఢ్..
ఈ నెల 24వ తేదీన శుక్రవారం రాత్రి 11 గంటలకు గుంటూరు నుంచి బయలుదేరే నంబర్ 07701 ఎక్స్‌ప్రెస్ ఆదివారం సాయంత్రం 5:15 నిమిషాలకు ఉత్తరప్రదేశ్‌లోని ఆజంగఢ్‌కు చేరుకుంటుంది. 26వ తేదీన మంగళవారం సాయంత్రం 7:45 నిమిషాలకు ఆజంగఢ్ నుంచి బయలుదేరే నంబర్ 07702 ఎక్స్‌ప్రెస్ మంగళవారం ఉదయం 9 గంటలకు గుంటూరుకు చేరుకుంటుంది.
గుంటూరు- గయ
ఈ నెల 25వ తేదీన శనివారం మధ్యాహ్నం 2:20 నిమిషాలకు గుంటూరు నుంచి బయలుదేరే నంబర్ 07719 ఎక్స్‌ప్రెస్ సోమవారం ఉదయం 9 గంటలకు గయకు చేరుకుంటుంది. 27వ తేదీన సోమవారం మధ్యాహ్నం 2:15 నిమిషాలకు గయ నుంచి బయలుదేరే నంబర్ 07720 ఎక్స్‌ప్రెస్ గురువారం తెల్లవారుజామున 4 గంటలకు గుంటూరుకు చేరుకుంటుంది.
మచిలీపట్నం- ఆజంగఢ్..
ఫిబ్రవరి 5వ తేదీన బుధవారం రాత్రి 10 గంటలకు మచిలీపట్నం నుంచి బయలుదేరే నంబర్ 07083 ఎక్స్‌ప్రెస్ శుక్రవారం సాయంత్రం 5:15 నిమిషాలకు ఆజంగఢ్‌కు చేరుకుంటుంది. అదే నెల 7వ తేదీన శుక్రవారం సాయంత్రం 7:45 నిమిషాలకు ఆజంగఢ్ నుంచి బయలుదేరే నంబర్ 07084 ఎక్స్‌ప్రెస్ ఆదివారం ఉదయం 9 గంటలకు మచిలీపట్నానికి చేరుకుంటుంది.
కాకినాడ టౌన్- ఆజంగఢ్..
ఫిబ్రవరి 20వ తేదీన గురువారం రాత్రి 8:10 నిమిషాలకు కాకినాడ టౌన్ నుంచి బయలుదేరే నంబర్ 07085 ఎక్స్‌ప్రెస్ శనివారం సాయంత్రం 5:15 నిమిషాలకు ఆజంగఢ్‌కు చేరుకుంటుంది. 22వ తేదీన శనివారం ఆజంగఢ్ నుంచి బయలుదేరే నంబర్ 07086 ఎక్స్‌ప్రెస్ సోమవారం ఉదయం 7:30 గంటలకు విజయవాడకు చేరుకుంటుంది.












Click it and Unblock the Notifications