టీడీపీకి రాజమండ్రి సెంటిమెంట్ - 2024 లో అధికారం దక్కాలంటే..!!
టీడీపీ పార్టీ పసుపు పండుగ మహానాడు. 2024 ఎన్నికలే లక్ష్యంగా ఈ సారి మహానాడు జరగనుంది. పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు కీలక నిర్ణయాలకు మహానాడు వేదిక కానుంది. 41 సంవత్సరాల పార్టీ చరిత్రలో ఇది 32వ మహానాడు. ఎన్టీఆర్ నాడు ప్రారంభించిన మహానాడు నిర్ణయం వెనుక అనేక లక్ష్యాలు ఉన్నాయి. ఎన్టీఆర్ శతజయంతి ఈ సారి మహానాడు ప్రత్యేకత. రాజమండ్రి ఎంపిక వెనుక పార్టీ సెంటిమెంట్ ఉంది. ఈ సారి అదే సెంటిమెంట్ రిపీట్ అవుతుందనేది పార్టీ నేతల నమ్మకం.
మహానాడు ప్రారంభం ఇలా: రాజమహేంద్రవరం వేదికగా శని, ఆదివారాల్లో రెండ్రోజులపాటు అట్టహాసంగా మహానాడు సమావేశాలను టీడీపీ నిర్వహించనుంది. తొలి మహానాడు ఆవిర్భావ సంవత్సరం 1982లో హైదరాబాద్‌లో జరిగింది. 83లో విజయవాడ వేదికగా నిర్వహించారు. నాటి సభకు టీడీపీ అధ్యక్షుడు ఎన్టీఆర్ ఈ సభకు ఎందరో ప్రముఖులను ఆహ్వానించారు.

ఎంజీ రామచంద్రన్, బాబు జగ్జీవన్ రాం, ఫరూఖ్ అబ్దుల్లా, హెచ్ఎస్ బహుగుణ, చండ్ర రాజేశ్వర్ రావు, ఎల్‌కే అద్వానీ, అటల్ బిహార్ వాజ్‌పేయి, రామకృష్ణ హెగ్దే, అజిత్ సింగ్ , శరద్ పవార్, ఉన్నికృష్ణన్, ఎస్ఎస్ మిశ్రా, రవీంద్ర వర్మ, మేనకాగాంధీ లాంటి పెద్ద నాయకులు టీడీపీ మహానాడుకు రావడం దేశం దృష్టిని ఆకర్షించింది. పార్టీ కార్యకర్తల నుంచి అధ్యక్షుడి వరకు అంతా కలసి మహానాడు వేదికగా నిర్ణయాలు తీసుకోవటం ఆనవాయితీ.
జాతీయ రాజకీయాల్లో సంచలనం: ఈ సారి ఎన్నికలకు మహానాడు ద్వారా పార్టీని సిద్దం చేయాలనేది చంద్రబాబు లక్ష్యం. రాబోయే ఎన్నికల్లో పొత్తులు, ప్యూహాలు, ప్రజా పోరాటాలపై కార్యచరణ ఖరారు చేయనున్నారు. 1984 విశాఖలో, 86, 87-హైదరాబాద్, 88-విజయవాడ, 90 నుంచి 94 మధ్య కాలంలో నాలుగు మహానాడు సమావేశాలు హైదరాబాద్‌లోనే జరిగాయి. 1998, 99 సంవత్సరాల్లో మళ్లీ హైదరాబాద్ వేదికగానే మహానాడు జరిగింది. 2000లో విజయవాడ, 2001లో విశాఖ, 2002లో వరంగల్, 2003లో తిరుపతిలో సమావేశాలు జరిగాయి.
2004, 2005ల్లో హైదరాబాద్‌లో, 2006-రాజమండ్రి, 2007-తిరుపతి, 2009 నుంచి 2015 వరకూ హైదరాబాద్, 2016-తిరుపతి, 2017-విశాఖ, 2018లో విజయవాడ వేదికలయ్యాయి. కరోనా కారణంగా 2020, 21లో ఆన్‌లైన్‌లో మహానాడు సమావేశాలు జరిపారు. నిరుడు ఒంగోలులో జరిగింది. మధ్యలో మొత్తం తొమ్మిదేళ్లపాటు మహానాడు జరుపలేదు. గత ఏడాది ఒంగోలులో మహానాడు నిర్వహించారు.

రాజమండ్రి సెంటిమెంట్: రాజమండ్రిలో టీడీపీకి సెంటిమెంట్ ఉంది. 1993లో ఎన్టీఆర్ ఆధ్వర్యంలో రాజమహేంద్రిలో జరిగిన ప్రజాగర్జన సభకు కనీవినీ ఎరుగని రీతిలో జనంలో వచ్చారు. మరుసటి ఏడాది జరిగిన ఎన్నికల్లో టీడీపీ అపూర్వ విజయం సాధించింది. అదే సెంట్‌మెంట్‌తో ఇప్పుడిక్క మహానాడు నిర్వహిస్తున్నారు. 2006లో కూడా ఇక్కడ మహానాడు జరిపినా.. అప్పుడు కేవలం ప్రతినిధుల సభే జరిగింది. బహిరంగ సభ నిర్వహించలేదు.
ఈసారి రెండూ నిర్వహించనున్నారు. ఈ సారి బహిరంగ సభకు భారీ సంఖ్యలో తరలి వస్తారని అంచనా వేస్తున్నారు. ఈ మహానాడు ద్వారా గోదావరి తీరాన పార్టీ ఎన్నికల పొత్తులు.. యువత.. మహిళలు.. సామాజిక వర్గాల వారీగా ఇవ్వబోయే ప్రాధాన్యతలపైన పార్టీ అధ్యక్షుడు క్లారిటీ ఇవ్వనున్నారు. మరి..రాజమండ్రి సెంటిమెంట్ రిపీట్ అవుతుందా లేదా అనేది చూడాలి.












Click it and Unblock the Notifications