రిజర్వేషన్లు ఎత్తేస్తామంటోన్న బీజేపీకి మద్దతా?: మహాసేన రాజేష్: వాళ్లకు ఓటెయ్యం
Mahasena Rajesh: రాష్ట్రంలో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల పోలింగ్ గడువు సమీపించిన ప్రస్తుత పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ నాయకుడు, దళిత నేత మహాసేన రాజేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. పవన్ కల్యాణ్, జనసేనకు తమ మద్దతును ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించారు.
పవన్ కల్యాణ్‌ను ముఖ్యమంత్రిగా చేయడానికి పని చేస్తోన్న నిఖార్సయిన నాయకులకు జనసేనలో చోటు లేదని తేల్చి చెప్పారు. తెలుగుదేశం పార్టీకి చెందిన కొందరు నాయకులను పార్టీలోకి చేర్చుకుని వారికి టికెట్లు ఇవ్వడాన్ని ఆయన తప్పుపట్టారు. శెట్టిబత్తుల రాజారావు వంటి కొందరు నాయకుల పేర్లను ఆయన దీనికి ఉదహరించారు.

పీ గన్నవరంలో టీడీపీ టికెట్ ప్రకటించినప్పుడు జనసేన నాయకులు తనను గేలి చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. తనకు టికెట్ ఇచ్చినందుకు కోనసీమ జిల్లా మొత్తం మీద టీడీపీని ఓడించాలంటూ జనసేన నాయకులు తీర్మానం సైతం చేశారని తెలిపారు. దీనివల్లే పీ గన్నవరం టికెట్‌ను టీడీపీ వెనక్కి తీసుకున్నట్టయిందని అన్నారు.
జనసేన నాయకులు టీడీపీకి వెన్నుపోటు పొడిచేలా వ్యవహరిస్తోన్నారని మహాసేన రాజేష్ అన్నారు. అసెంబ్లీలో ఎవరికైనా ఓటు వేసుకోవచ్చని, కాకినాడ లోక్‌సభకు మాత్రం తమ పార్టీకి ఓటు వేయాలంటూ జనసేన నేతలు ప్రచారం చేస్తోన్నారని ఆయన ఆరోపించారు. రాజమండ్రి సభలో పవన్ కల్యాణ్ ప్రసంగం చూసిన తరువాత జనసేన అభ్యర్థులకు ఓటు వేయబోమని దళితులు స్పష్టం చేస్తోన్నారని అన్నారు.
బీజేపీకి 400 సీట్లు సాధించడానికి అవసరమైతే ప్రాణ త్యాగాలను చేస్తామంటూ పవన్ కల్యాణ్ ఆ సభలో చేసిన ప్రసంగాన్ని మహాసేన రాజేష్ తప్పుపట్టారు. ఎస్సీ, ఎస్టీలు, ముస్లింల రిజర్వేషన్లు, ఆస్తి హక్కులను ఎత్తేస్తామంటూ స్టేట్‌మెంట్లు ఇచ్చిన బీజేపీకి ఓటు వేయమనడం, ఆ పార్టీ కోసం ప్రాణత్యాగం చేస్తామనడం సరికాదని అన్నారు.
ముస్లిం రిజర్వేషన్ల విషయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి హీరోలాంటి స్టేట్‌మెంట్ ఇచ్చారని మహాసేన రాజేష్ అన్నారు. ముస్లింల నాలుగు శాతం రిజర్వేషన్లకు తాను హామీగా ఉంటానని, దాని జోలికి ఎవడొస్తాడో చూస్తానంటూ హీరోలా మాట్లాడారని గుర్తు చేశారు.

జనసేన పోటీ చేసే అన్ని నియోజకవర్గాల్లో తాము వైఎస్ఆర్సీపీకి ఓటు వేస్తామే తప్ప ఆ పార్టీకి ఓటు వేయబోమని దళిత నాయకులు, మహాసేన కార్యకర్తలు తేల్చేశారని చెప్పారు. పవన్ కల్యాణ్‌ను ఓడించకపోతే ఈ రాష్ట్రానికి చాలా ప్రమాదమని మహాసేన రాజేష్ హెచ్చరించారు.
పిఠాపురంలో ఒక మహిళ అయిన వంగా గీతను ఓడించడానికి జబర్దస్త్ టీమ్, రికార్డింగ్ డాన్స్ ట్రూప్, సీరియల్ నటులను మొత్తాన్నీ పవన్ కల్యాణ్ దించారని ఆయన గుర్తు చేశారు. అక్కడ నెగ్గాలంటే ఎస్‌వీఎస్ఎన్ వర్మకు తల వంచి దండం పెట్టక తప్పదని అన్నారు. ఎమ్మెల్యేగా గెలవడానికి ఇంతలా తంటాలు పడాల్సిన అవసరం లేదని చెప్పారు.












Click it and Unblock the Notifications