ఏపీలో ఎంత శాతం పోలింగ్ నమోదైతే..ఎవరికి లాభం..!?
ఏపీలో మరి కొద్ది గంటల్లో పోలింగ్ ప్రారంభం కానుంది. ఇందు కోసం అన్ని ఏర్పాట్లు పూర్తవుతున్నాయి. పార్టీలు ఓటర్లను తమ వైపు తిప్పుకొనేందుకు చివరి ప్రయత్నాల్లో ఉన్నాయి. ఇదే సమయంలో ఇతర ప్రాంతాల్లో ఉంటున్న ఏపీ ఓటర్లు స్వస్థలాలకు చేరుకుంటున్నారు. ఈ సారి భారీ పోలింగ్ శాతం నమోదు అవుతుందనే అంచనాలు ఉన్నాయి. దీంతో..పోలింగ్ శాతం పెరిగితే ఎవరికి లాభం అనే ఆసక్తి కర చర్చ రాజకీయంగా మొదలైంది.
హోరా హోరీగా
ఏపీ ఎన్నికలు ఈ సారి హోరా హోరీగా మారాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా పోలింగ్ శాతం పెరిగే అవకాశం కనిపిస్తోంది. ఏపీ విభజన తరువాత 2014లో జరిగిన ఎన్నికల్లో 13 జిల్లాల ఆంధ్రప్రదేశ్ లో 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 78.7 శాతం పోలింగ్ నమోదైంది. ఆ ఎన్నికల్లో టీడీపీ కూటమి విజయం సాధించింది.

1.95 శాతం ఓట్ల తేడాతో వైసీపీ 67 సీట్లకు పరిమితం కాగా..కూటమి 106 స్థానాలు , ఇద్దరు స్వతంత్ర అభ్యర్దులు గెలుపొందారు. 2019 ఎన్నికల్లో 79.74 శాతం పోలింగ్ రికార్డు అయింది. 3.93 కోట్ల ఓటర్లలో3.13 కోట్లమంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఆ ఎన్నికల్లో వైసీపీ 151, టీడీపీ 23, జనసేన 1 సీటులో విజయం సాధించాయి.
పెరిగిన ఓటర్లు
ఈ సారి ఏపీలో ఓటర్ల సంఖ్య పెరిగింది. రాష్ట్రంలో 4.14 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 46,389 పోలింగ్ స్టేషన్లలో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించు కోనున్నారు. రాష్ట్రంలో 2.2 కోట్ల పురుష ఓటర్లు, 2.10 కోట్ల మహిళా ఓటర్లు ఉన్నారు. రాష్ట్రంలో కొత్త ఓటర్లు 5.94 లక్షలు నమోదయ్యారు.
ఈ సారి లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రంలోని 25 స్థానాలకు గానూ 454 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. అలాగే, 175 అసెంబ్లీ స్థానాలకు 2,300 మంది పోటీ చేస్తున్నారు. ప్రతీ నియోజకవర్గంలో గెలుపు కోసం ప్రధాన పార్టీలు ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇదే సమయంలో మహిళా ఓటర్లు 154 నియోజక వర్గాల్లో గెలుపు - ఓటమలను ప్రభావితం చేయనున్నాయి.
కలిసొచ్చేదెవరికి
2014లో 78.7 శాతం పోలింగ్ జరగ్గా కూటమి, 2019లో 79.74 శాతం పోలింగ్ తో ప్రతిపక్షంలో ఉన్న వైసీపీ అధికారంలోకి వచ్చాయి. ఈ సారి 80 శాతానికి పైగా పోలింగ్ జరిగే అవకాశం ఉందనే అంచనాలు వ్యక్తం అవుతున్నాయి. ఆ స్థాయిలో పోలింగ్ జరిగితే ఎవరికి కలిసి వస్తుందనే లెక్కలు తెర మీదకు వస్తున్నాయి.
ప్రభుత్వ పాజిటివ్ లేదా వ్యతిరేక ఓటు లో ఈ పోలింగ్ శాతం దేనిని నిర్ధారిస్తుందనేది ఇప్పుడు అంతు చిక్కని అంశంగా మారుతోంది. రాజకీయంగా హోరా హోరీ సమరం..ఓటర్ల మద్దతులోనూ ఆ పోటీ కనిపిస్తుండటంతో..ఈ సారి ఏపీలో నమోదయ్యే పోలింగ్ శాతం..ఫలితం రాజకీయంగా కొత్త ట్రెండ్ ను క్రియేట్ చేయటం ఖాయమనే విశ్లేషణల నడుమ..పోలింగ్ మరింత ఉత్కంఠ పెంచుతోంది.












Click it and Unblock the Notifications