డిప్యూటీ సీఎం పవన్ కాన్వాయ్ కార్లు ధ్వంసం, సెక్యూరిటీపై వేటు
మంగళగిరిలోని జనసేన కేంద్ర కార్యాలయం వద్ద చోటుచేసుకున్న భద్రతా లోపం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారి తీసింది. ఓ వ్యక్తి కార్యాలయ ప్రాంగణంలోకి చొరబడి వాహనాలను ధ్వంసం చేయడం మాత్రమే కాదు, డిప్యూటీ సీఎం కాన్వాయ్‌కు చెందిన కార్లను లక్ష్యంగా చేసుకోవడం పరిస్థితి తీవ్రతను స్పష్టం చేసింది. ఈ ఘటన అనంతరం భద్రతా వ్యవస్థపై ప్రశ్నలు వెల్లువెత్తగా, అధికారులు తక్షణ చర్యలు చేపట్టారు.
మంగళగిరిలోని జన సేన పార్టీ కేంద్ర కార్యాలయంలోకి శ్రీకాకుళం జిల్లా కవిటి మండలం ఖాజూరుకు చెందిన నారద నీలాద్రి (39) అకస్మాత్తుగా చొరబడ్డాడు. భద్రతా సిబ్బందిని తోసివేస్తూ లోపలికి ప్రవేశించిన అతను ప్రాంగణంలో నిలిపిన వాహనాలను ధ్వంసం చేశాడు. ప్రత్యేకంగా డిప్యూటీ సీఎం కాన్వాయ్‌లో ఉన్న రెండు కార్లను లక్ష్యంగా చేసుకుని దాడి చేయడం కలకలం రేపింది. ఈ ఘటన సమయంలో కార్యాలయ ప్రాంగణంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

ఈ ఘటన అనంతరం భద్రతా లోపాలపై ఉన్నతాధికారులు సీరియస్‌గా స్పందించారు. భద్రతా విభాగానికి చెందిన ఐదుగురిపై చర్యలు తీసుకున్నారు. రిజర్వ్ ఇన్‌స్పెక్టర్ బి. పెంటారావుతో పాటు నలుగురు కానిస్టేబుళ్లను హోంశాఖకు రిపోర్ట్ చేయాలని ఆదేశించారు.
నిందితుడు నారద నీలాద్రిని వెంటనే అదుపులోకి తీసుకున్న మంగళగిరి పోలీసులు కేసు నమోదు చేశారు. అతను కార్యాలయంలోకి ఎలా ప్రవేశించాడు? భద్రతా తనిఖీలు ఎలా తప్పించుకున్నాడు? అన్న అంశాలపై దర్యాప్తు కొనసాగుతోంది. ఘటనకు గల కారణాలు, నిందితుడి నేపథ్యం, మానసిక స్థితి తదితర అంశాలపై పోలీసులు విచారణ చేపట్టారు
మంగళగిరి ఘటన రాజకీయ, భద్రతా వర్గాల్లో చర్చనీయాంశమైంది. భద్రతా వ్యవస్థలో లోపాలు వెలుగులోకి వచ్చిన ఈ ఘటనపై పూర్తి స్థాయి దర్యాప్తు కొనసాగుతోంది. నిందితుడి ఉద్దేశ్యం ఏమిటి? భద్రతా విభాగం లోపం ఎంతవరకు ఉంది? అనే ప్రశ్నలకు సమాధానాలు రావాల్సి ఉంది.












Click it and Unblock the Notifications