మేక్ ఏపీ యువర్ బిజినెస్: దావోస్ వీధుల్లో ఏపీ ప్రచార రథం
అమరావతి: విశాఖపట్నంలో ఇటీవల జరిగిన భాగస్వామ్య సదస్సులో సుమారు రూ. 5 లక్షల కోట్ల పెట్టుబడులను ఆకర్షించిన ఏపీ ప్రభుత్వం తాజాగా వరల్డ్ ఎకనమిక్ ఫోరం 46వ సదస్సుకు సిద్ధమైంది. స్విట్జర్లాండ్‌లోని దావోస్ నగరంలో మంగళవారం నుంచి వరల్డ్ ఎకనమిక్ ఫోరం సదస్సు ప్రారంభం కానుంది.
ఈ వరల్డ్ ఎకనమిక్ ఫోరం సదస్సు మూడు రోజుల పాటు జరగనుంది. ఈ సదస్సుకు హాజరయ్యేందుకు గాను ఈ రాత్రికి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, తన ప్రతినిధి బృందంతో కలిసి దావోస్ పర్యటనకు బయలుదేరనున్నారు. ఏపీకి పెట్టుబడులే ప్రధానంగా వరల్డ్ ఎకనమిక్ ఫోరం జరగనున్న దావోస్‌లో ఏపీ తరఫున ఇప్పటికే ప్రచారాన్ని కూడా ప్రారంభించింది.

‘మేక్ ఆంధ్రప్రదేశ యువర్ బిజినెస్' పేరుతో రూపొందించిన రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రచార రథం దావోస్ వీధుల్లో తిరుగుతోంది. వారం రోజుల నుంచి ప్రత్యేకంగా తయారు చేసిన ఓ బస్సు దావోస్ వీధుల్లో తిరుగుతూ అక్కడి స్థానికులను ఎంతగానో ఆకర్షిస్తోంది. ‘మేక్ ఏపీ యువర్ బిజినెస్' పేరిట సరికొత్తగా రూపొందించిన ఈ బస్సు ఏపీ ప్రభుత్వానికి చెందినదే.
‘మేక్ ఆంధ్రప్రదేశ్ యువర్ బిజినెస్' అనే నినాదంతో ప్రపంచ పెట్టుబడిదారులకు, వాణిజ్యవేత్తలకు పిలుపునిస్తూ ఈ బస్సు ముందుకు సాగుతోంది. ఏపీకి పెట్టుబడులు రాబట్టడమే లక్ష్యంగా ఏపీ సర్కారు ఈ సరికొత్త యత్నానికి శ్రీకారం చుట్టింది. ఇక ఏపీలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను వివరిస్తూ www.ap industries.gov.in పేరుతో నగరంలో ఏపీ పరిశ్రమల శాఖ ఏర్పాటు చేసిన హోర్డింగులు దావోస్ నగరవాసులను విశేషంగా ఆకర్షిస్తున్నాయి.












Click it and Unblock the Notifications